గ్రేటర్ నోయిడా: ఇక్కడ జరుగుతున్న ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత స్టార్ బాక్సర్, తెలుగుతేజం నిఖత్ జరీన్ పసిడి పతకం సాధించింది. ఈ వరల్డ్‌కప్‌లో నిఖత్‌తో సహా మరో నలుగురు బాక్సర్లు స్వర్ణ పతకాలు సొతం చేసుకున్నారు. గురువారం జరిగిన 51 కిలోల విభాగం ఫైనల్లో నిఖత్ 50 తేడాతో చైనీస్ తైపీకి చెందిన జువాన్ యు గువోను ఓడించింది. ఆరంభం నుంచే దూకుడును ప్రదర్శించిన నిఖత్ ఏ దశలోనూ ప్రత్యర్థికి కోలుకునే అవకాశం ఇవ్వలేదు. కళ్లు చెదిరే పంచ్‌లతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసింది. నిఖత్ ధాటికి జువాన్ కనీస ప్రతిఘటన కూడా ఇవ్వకుండానే చేతులెత్తేసింది. మరోవైపు చిరస్మరణీయ ఆటతో అలరించిన నిఖత్ తన ఖాతాలో మూడో ప్రపంచకప్ స్వర్ణం జత చేసుకుంది. ఇంతకు ముందు కూడా నిఖత్ రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. సుదీర్ఘ విరామం తర్వాత బరిలోకి దిగిన తొలి టోర్నమెంట్‌లోనే స్వర్ణం సాధించి నిఖత్ సత్తా చాటింది. భుజం గాయంతో నిఖత్ ఏడాది పాటు ఆటకు దూరంగా ఉంది. ఈ టోర్నీతోనే మళ్లీ ఆటను ప్రారంభించింది. ఒలింపిక్స్‌లో పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరిచిన నిఖత్ మళ్లీ వరల్డ్‌కప్ టైటిల్‌తో పూర్వవైభవం సాధించడం భారత బాక్సింగ్‌కు శుభపరిణామంగా చెప్పొచ్చు.
మీనాక్షి, అరుంధతిలకు స్వర్ణాలు
కాగా, నోయిడాలోని షహీద్ విజయ్ సింగ్ పాటిల్ స్పోర్ట్ కాంప్లెక్స్‌లో గురువారం జరిగిన ఫైనల్లో భారత బాక్సర్లు ఆకాశమే హద్దుగా చెలరేగి పోయారు. 48 కిలోల విభాగంలో మీనాక్షి, 54 కిలోల విభాగంలో ప్రీతి, 70 కిలోల విభాగంలో అరుంధతి చౌదరి, 80 ప్లస్ విభాగంలో నుపూర్ పసిడి పతకాలను గెలుచుకున్నారు. అంతేగాక మహిళల 57 కిలోల విభాగంలో జస్మయిన్ లంబోరియా కూడా పసిడి పతకం సాధించింది. ఇక పురుషుల 60 కిలోల విభాగంలో సచిన్, 70 కిలోల విభాగంలో హితేశ్‌లు స్వర్ణ పతకాలను సొంతం చేసుకున్నారు. దీంతో పాటు మరో ఆరు రజత పతకాలను కూడా భారత్ గెలుచుకుంది. ఈ వరల్డ్‌కప్‌లో భారత బాక్సర్లు 9 స్వర్ణ పతకాలు, ఆరు రజతాలను సాధించి నయా చరిత్రను సృష్టించారు.