ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం,అల్లూరి సీతారామరాజు జిల్లా, మారేడు మిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టు పార్టీ మోస్ట్ వాంటెడ్ మడావి హిడ్మా అతడి భార్య రాజే అలియాస్ రాజక్క అంత్యక్రియలు గురువారం సాయంత్రం హిడ్మా స్వగ్రామమైన ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా పువ్వర్తి గ్రామంలో ముగిశాయి. బుధవారం రాత్రి మృతదేహాలకు పోస్ట్‌మార్టం పూర్తి అవ్వడంతో భారీ బందోబస్తు నడుమ గురువారం ఉదయం మృత దేహాలను ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని పువ్వర్తి గ్రామానికి తరలించారు.హిడ్మా దంపతుల అంత్యక్రియల్లో పాల్గొనేందుకు పరిసర గ్రామాల ప్రజలతో పాటు వివిధ జిల్లాల నుండి ప్రజలు ప్రజా సంఘాల నాయకులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.జనం పెద్ద ఎత్తున తరలిరావడంతో పువ్వర్తి గ్రామం జన సంద్రంగా మారింది. కీకారణ్యంలో ఎక్కడ చూసినా జనమే కనిపించారు. మరోవైపు పువ్వర్తి గ్రామం కన్నీటి సంద్రంగా మారింది.హిడ్మా దంపతుల మృతదేహాలను చూసిన అతడి బంధువుల రోదనలు మిన్నంటాయి.హిడ్మా మృతదేహాన్ని గుండెలకు హత్తుకున్న అతడి తల్లి కన్నీరు మున్నీరుగా విలపించారు.ఒక్కసారి లే కొడుక అంటూ రోదించింది..
జనసంద్రంగా మారిన పువ్వర్తి గ్రామం
మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేత హిడ్మా మృతి చెందడంతో అతడి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు అతడి బంధువులు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. దీంతో పువ్వర్తి గ్రామం జన జాతరను తలపించింది. సుదూర ప్రాంతాల నుండి సైతం ఆదివాసీ ప్రజలు కాలినడకన పువ్వర్తి గ్రామానికి చేరుకున్నారు.అనంతరం అంత్యక్రియలు ముగియడంతో తిరుగు ప్రయాణం అయ్యారు.
కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసిన పోలీసు బలగాలు
మావోయిస్టు అగ్రనేత పిఎలజీఏ ఒకటవ నంబర్ బెటాలియన్ కమాండర్ మడావి హిడ్మా అంత్యక్రియల వేల పువ్వర్తి, పువ్వర్తి పరిసర గ్రామాల్లో పోలీసు బలగాలు పెద్ద ఎత్తున మోహరించాయి. పువ్వర్తి గ్రామానికి వచ్చే వారిని ఎక్కడిక్కడ నిలిపివేసి ఆరాతీశారు. హిడ్మా మృతి చెందిన వేళ మావోయిస్టులు ఏదైన అవాంఛనీయమైన ఘటనలకు పాల్పడకుండా తనిఖీలు నిర్వహించారు. మరోవైపు హిడ్మా అతడి భార్య సన్నిహితులది బూటకపు ఎన్‌కౌంటర్ అంటూ ప్రజా సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. మారేడుమిల్లి ఎన్‌కౌంటర్ పై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.