ఫార్ములా ఈ-కార్ రేసింగ్‌పై కెటిఆర్‌ను విచారించేందుకు గవర్నర్ అనుమతి లభించడంతో ఆయనపై అభియోగాలు నమోదు చేసి, విచారణ చేపట్టేందుకు ఎసిబి అధికారులు సిద్ధమవుతున్నారు. త్వరలోనే ఆయనకు నోటీసులు జారీ చేసి, విచారణ ప్రక్రియను ప్రారంభించే అవకాశం ఉంది. విచారణ అనంతరం ఈ కేసులో ఛార్జ్‌షీట్ దాఖలు చేయాలని ఎసిబి భావిస్తోంది. ఫార్ములా ఈ-కార్ రేసింగ్‌పై 2022 అక్టోబరు 25న ఒప్పందం కుదిరింది. ఫార్ములా -ఈ ఆపరేషన్స్, ఏస్ నెక్ట్ జెన్, మున్సిపల్ శాఖలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. 9, 10, 11, 12వ సీజన్ల కార్ రేస్‌లు హైదరాబాద్‌లో నిర్వహించేలా ఒప్పందం కుదిరింది. 2023 ఫిబ్రవరి 10, 11 తేదీల్లో నెక్లెస్‌రోడ్‌లో తొమ్మిదో సీజన్ రేసింగ్ నిర్వహించారు. తదుపరి ఏడాది 10వ సీజన్ నుంచి ఏస్ నెక్ట్ జెన్ అకస్మాత్తుగా తప్పుకుంది.
దాంతో ప్రమోటర్‌గా హైదరాబాద్ మెట్రో డెవలప్‌మెట్ అథారిటీ (హెచ్‌ఎండిఎ)నే పోషించాలని అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో 2023 అక్టోబరు రూ.54.88 కోట్లను ఫార్ములా -ఈ ఆపరేషన్స్ సంస్థకు హెచ్‌ఎండిఎ నేరుగా బదిలీ చేసింది. ఈ వ్యవహారమే ఇప్పుడు ఈ మొత్తం వివాదానికి తెరలేపింది. హెచ్‌ఎండిఎ బోర్డు, ఆర్థికశాఖ, ఆర్‌బిఐ అనుమతి లేకుండానే ఈ చెల్లింపులు జరిగాయని, వీటిలోనూ రూ.46 కోట్ల వరకు డాలర్ల రూపంలో చెల్లించారనేది ప్రధాన అభియోగం. ఈ మేరకు ఎసిబి విచారణ జరుపుతోంది. కాగా, ఈ- కార్ రేసింగ్ కేసులో కెటిఆర్‌ను ఎసిబి విచారించేందుకు గవర్నర్ అనుమతి ఇవ్వడం పట్ల బిఆర్‌ఎస్ నేతలు భగ్గుమన్నారు. రాజకీయ కక్షసాధింపులో భాగంగానే కెటిఆర్‌పై కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.