కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు హైకోర్టులో భారీ ఊరట లభించింది. తెలంగాణ పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజ్ వ్యవహారంలో బండి సంజయ్ ప్రమేయం ఉందంటూ 2023లో హనుమకొండ జిల్లా కమలాపూర్ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసును హైకో ర్టు కొట్టివేసింది. బండి సంజయ్‌పై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను క్వాష్ చేస్తూ తీర్పు ఇచ్చింది. గత బిఆర్‌ఎస్ హాయంలో 2023లో జరిగిన తెలంగాణ పదో తరగతి పరీక్షల సమయంలో హిందీ ప్రశ్నా పత్రం లీక్ కావడం కలకలం రేపింది. ఈ లీకేజీలో బండి సంజయ్ ప్రమేయం ఉందని ఆయనపై ఐపిసిసెక్షన్లు 120-బి, 420, 447, 505(1)(బి), తెలంగాణ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ మాల్‌ప్రాక్టీసెస్) యాక్ట్, 1997 లోని సెక్షన్లు 4(ఎ), 6 r/w 8, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ సెక్షన్ 66డి కింద పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ వ్యవహారంలో అప్పట్లో బండి సంజ య్‌ను పోలీసులు అరెస్టు సైతం చేశారు. ఈ కేసుపై తాజాగా గురువారం విచారణ జరిపిన హైకోర్టు బండి సంజయ్‌కు ఉపశనమం కలిగిస్తూ ఆయనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేసింది.
హైకోర్టు తీర్పుపై బండి స్పందన
2023లో పదోతరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో కమలాపురం పిఎస్‌లో తనపై నమోదైన కేసును హైకోర్టు కొట్టివేయడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. ఎక్స్ వేదిగా రియాక్ట్ అయిన ఆయన సత్యమేవ జయతే అంటూ పోస్టు ప్రారంభించారు. ’నాడు అధికారంలో ఉన్న ఉన్న బిఆర్‌ఎస్ ప్రభుత్వం నాపై పెట్టించిన కట్టుకథ 10వ తరగతి ప్రశ్నాపత్రం లీక్ కేసును హైకోర్టు రద్దు చేసింది. బిజెపిని సైలెన్స్ చేయడానికి చేసిన అధికార దుర్వినియోగానికి ఇదో ఉదాహరణ. నాకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని వాళ్లకే తెలిసినా ప్రతీకార రాజకీయాల కోసం పోలీసులను ఆయుధాల్లా ఉపయోగించారు. బిఆర్‌ఎస్ నాయకత్వం ఎంత దిగజారిందో దీంతో స్పష్టమైంది. మానవత్వం, మర్యాద లేకుండా నా అత్త దశదిన కర్మ రోజే నన్ను ఈడ్చుకెళ్లారు. ఇది పూర్తిగా రాజకీయ పగ. గురువారం కోర్టు తీర్పుతో బిఆర్‌ఎస్ అబద్ధాలు, దుర్వినియోగం, అధికార దౌర్జన్యం అంతమైంది. నిజం గెలిచి. న్యాయం నిలిచింది’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నాడు తనను అరెస్టు చేసినప్పటి విజువల్స్ ను బండి సంజయ్ షేర్ చేశారు.