బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ నిజాయితీపరుడైతే ఫార్ములా ఈ-కారు రేసు కేసులో కోర్టుకు వెళ్లాలని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సెటైర్లు వేశారు. కెటిఆర్‌ను తన ఫ్రెండ్ కిషన్‌రెడ్డి కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కెటిఆర్‌పై గవర్నర్ విచారణకు అనుమతినిచ్చిన నేపథ్యంలో కేసులో ఏ1, ఏ2లపై జాయింట్ ఛార్జిషీటు వేయాల్సి ఉంటుందన్నారు. కేసులో ఏ2గా ఉన్న అరవింద్ కుమార్ కేంద్ర సర్వీసుల్లో ఉన్నారని ఆయన్ను విచారించాలంటే డిఓపిటి నుంచి అనుమతి తీసుకోవాలన్నారు. ఈ కార్ రేసు అయితే లొట్టపీసు కేసు అయితే కెటిఆర్ కోర్టుకు వెళ్లకుండా విచారణకు సహకరించాలన్నారు. అడ్డగోలుగా దోచుకొని విచారణకు రమ్మంటే ప్రభుత్వాన్ని నిందిస్తారా అంటూ ఆయన ఫైర్ అయ్యారు. కక్ష రాజకీయాలు చేయాలంటే ప్రభుత్వం ఏర్పడగానే కెటిఆర్‌ను జైల్లో వేసేవాళ్లమఅన్నారు. గత ప్రభుత్వ తప్పులు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని ఆయన అన్నారు. కెటిఆర్ అరెస్టు ఆగడంలో కేంద్ర ప్రభుత్వం పాత్ర ఉందని ఆయన ఆరోపించారు. కాళేశ్వరం కేసు సీబిఐకి అప్పగించాలని బిజెపి డిమాండ్ చేసిందని, 2 నెలలు గడుస్తున్నా విచారణను ప్రారంభించలేదని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఫైర్ అయ్యారు.