హైదరాబాద్: దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో రేషన్ షాపుల ద్వారా వినియోగదారులకు సన్నబియ్యం సరఫరా చేస్తున్నామని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి వివరించారు. హైదరాబాద్ నగరానికి వచ్చిన కేంద్ర మంత్రితో ముఖ్యమంత్రి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి గురువారం ఉదయం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రజలకు సన్నబియ్యం పంపిణీ అంశంపై వివరించారు. ప్రజలు తినే బియ్యం సరఫరా చేసినప్పుడే ఆ సంక్షేమ పథకం ఉద్దేశం నెరవేరుతుందని అన్నారు. తెలంగాణలో అమలు చేస్తున్నట్టుగా దేశ వ్యాప్తంగా వినియోగదారులకు సన్నబియ్యం పంపిణీ చేసే అంశాన్ని కేంద్రం పరిశీలించాలని సెంట్రల్ మినిస్టర్ కు ముఖ్యమంత్రి సూచించారు. ఈ విషయంలో అవసరమైతే సమగ్రంగా అధ్యయనం చేసి తగిన నిర్ణయం తీసుకోవాలని కోరారు. పూర్తి స్థాయి అధ్యయనం జరిపిన తరువాత దేశ వ్యాప్తంగా సన్నబియ్యం పంపిణీ అంశంపై నిర్ణయం తీసుకుంటామని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి తెలిపారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.