బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణశిక్ష విధించడం చట్టపర ప్రక్రియ భారాన్ని మోయవచ్చు. కానీ ఇందులో గుర్తించలేని రాజకీయ ప్రతీకార చర్య దాగి ఉందన్న దుర్గంధం గుప్పుమంటోంది. ఒకవైపు ప్రజలంతా ఈ సమయంలో ఉద్రిక్తతలకు లోనుకాకుండా ప్రశాంతంగా ఉండాలని అభ్యర్థిస్తూ , మరోవైపు ఈ తీర్పు చారిత్రాత్మకమైనదని, అత్యంత లోతైన పరిశీలనతో కూడుకున్నదని మొహమ్మద్ యూనస్ నేతృత్వం లోని తాత్కాలిక బంగ్లాదేశ్ ప్రభుత్వం తనకు తాను గొప్పలు చెప్పుకుంటోంది. అయినప్పటికీ బంగ్లాదేశ్ అంతటా చెలరేగిన రాజకీయ అశాంతి ఇప్పటివరకు చేసిన పొరపాట్లలో ఉన్న లోతుపాతుల పగుళ్లను బయటపెడుతోంది. బంగ్లాదేశ్‌కు విముక్తి ప్రసాదించిన పోరాట యోధుడు షేక్ ముజిబుర్ రెహ్మాన్ కుమార్తె హసీనా. ఆమెకు అత్యంత సన్నిహితుడైన బంగ్లా మాజీ హోం మంత్రి అసదుజమాన్ ఖాన్‌కు కూడా మరణశిక్ష పడింది. వీరిద్దరినీ తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ ఒత్తిడి తెస్తోంది. దీనికి భారత్ విముఖత చూపిస్తుండటంతో ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించడానికి బంగ్లాదేశ్ ప్రయత్నిస్తోంది. భారత్ నుంచి తిరిగి బంగ్లాదేశ్‌కు వెళ్లాలని హసీనాకు ఇష్టం లేకపోయినా, వెళ్లిపోవాల్సిందిగా భారత్ అసాధారణంగా బహిష్కరించినప్పుడు ఆమె ఉరికంబం ఎక్కవలసి వస్తుంది.
ప్రజలు ఎన్నిక చేయని తాత్కాలిక ప్రభుత్వ నిర్వహణ లోని ట్రిబ్యునల్ తీర్పు కేవలం రాజకీయ ప్రతీకారమేనని, తన వాదనలు వినిపించనీయకుండా ఏకపక్ష నిర్ణయమని ఆమె విమర్శిస్తున్నారు. హసీనాను తమ దేశానికి తిరిగి పంపించివేయాలని బంగ్లాదేశ్ అభ్యర్థనను భారత్ పట్టించుకోకపోవడం సమంజమే. ఎందుకంటే చట్టబద్ధంగా ఎన్నికై, రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వం ఏర్పడినప్పుడే తాము ఆలోచించాల్సి వస్తుందని భారత్ వాదిస్తోంది. 2026 ఫిబ్రవరిలో బంగ్లాదేశ్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో హసీనాకు చెందిన అవామీ లీగ్‌కు చోటు లేకుండా అక్కడి తాత్కాలిక ప్రభుత్వం వేటు వేసింది. హసీనా మూడు ప్రధాన సంఘటనల్లో దోషిగా తేలారు. గత ఏడాది విద్యార్థుల నేతృత్వంలో సాగిన తిరుగుబాటులో ఘర్షణలను ప్రేరేపించడం, కాల్పులకు ఆదేశాలు ఇవ్వడం, దౌర్జన్యాల నివారణలో వైఫల్యం చెందడం ఈ మూడు విషయాల్లో ఆమె పొరపాట్లు చేసి దోషిగా తేలారు. ఈ మూడింటిలో రెండు విషయాల్లో ఆమెకు ట్రిబ్యునల్ మరణశిక్ష విధించగా, మూడో విషయంలో ఆమె సహజ మరణం పొందేవరకు జీవితఖైదు విధించాలని తీర్పు వెలువడింది. 2024 నాటి అల్లకల్లోలంతో బాధపడుతున్న దేశంలో ఈ అవకాశాలు మరింత దహించి వేస్తున్నాయి.
తిరుగుబాటు తరువాత అణచివేత చర్యలను దృష్టిలో పెట్టుకుని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్ పరిశోధకులు బంగ్లాదేశ్‌లో దాదాపు 1400 మరణాలు సంభవించాయని అధికారికంగా ధ్రువీకరించారు. వీటిలో చాలావరకు దగ్గరగా గురిపెట్టి కాల్చిచంపారని తేల్చారు. ఉద్దేశపూర్వకంగానే ఈ దారుణాలు జరిగాయని, నియంతృత్వ విధానంతో ఏకపక్షంగా అరెస్టులు సాగాయని నివేదికలో వెల్లడించారు. ఆడియో రికార్డింగ్‌లను పరిశీలించగా ప్రభుత్వం ఎంత హద్దులు మీరి అతిగా ప్రవర్తించిందో చాలా దీనాతిదీనమైన దృశ్యం బయటపడింది. అయినప్పటికీ ఈ తీర్పు చాలా ఇబ్బందికరమైన సందర్భంలో వెలువడింది. ఈనాడు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ పాలనలో సాగుతోంది. దీని చట్టబద్ధత సంక్షోభం నుంచి ఆవిర్భవించిందే తప్ప ప్రజా తీర్పు ద్వారా ఏర్పడలేదు. యూనస్ సారథ్యంలో ఢాకా ఇంకా స్థిరత్వాన్ని సాధించలేదు. తీర్పు వెలువడక ముందునుంచే బంగ్లాదేశ్ హసీనా మద్దతుదార్లు, అవామీలీగ్ కార్యకర్తల ఆందోళనలతో భగ్గుమంటోంది. ఢాకా లోని వీధివీధినా ఆందోళనలు, ఘర్షణలు సాగుతున్నాయి.
బస్సులు తగలబడుతున్నాయి. లాఠీలు విరుగుతున్నాయి. ఒక దేశానికి అవసరమైన శాంతిభద్రతల సమతుల్యత, భద్రత ఇవేవీ కనిపించకుండా దూరంగా ఉంటున్నదంటే తాత్కాలిక ప్రభుత్వ పాలన ఎలా ఉందో అర్థమవుతోంది. చట్టపరమైన పాలన, రాజకీయ స్థిరత్వం కేవలం ప్రతీకార పునాదులపై నిర్మింపబడవన్న వాస్తవాన్ని తెలుసుకోవాలి. హసీనా కూడా తాను అధికారంలో ఉన్నప్పుడు కొన్ని క్షమించరాని పొరపాట్లు చేశారు. ఆందోళనకారులపై సైనిక బలగాలు మితిమీరి చర్యలు తీసుకోకుండా అడ్డుకోలేకపోయారు. ప్రజాస్వామ్య సంస్థలను నిర్వీర్యం చేశారు. ఆమె పర్యవేక్షణలో అసమ్మతిని సహించలేకపోయారు. అయినాసరే మరణశిక్ష తీర్పుతో రాజకీయ ప్రతీకారం సమానం చేయడం తీవ్ర ఆక్షేపణీయం. న్యాయం అన్నది ముందుగా సాగే మార్గాన్ని ప్రకాశవంతం చేయాలే తప్ప అస్తిరతలోకి దేశం దిగజారేలా మరింత తీవ్ర పరిస్థితులను కల్పించరాదు.
ఇక ఈ పరిస్థితుల్లో భారతదేశం సంయమనం కోరుకుంటోంది. బంగ్లాదేశ్‌తో దైపాక్షిక సంబంధాల్లో క్లిష్టతరమైన దశను ఎదుర్కోవచ్చు. ముఖ్యంగా రానున్న బంగ్లాదేశ్ ఎన్నికల్లో హసీనాకు చెందిన అవామీలీగ్‌కు ప్రాతినిధ్యం లేనప్పుడు ఢాకా లో రాజకీయ అనిశ్చితి మరింత తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కానీ బంగ్లాదేశ్ అంటే కేవలం ప్రభుత్వమే కాదు, తన ప్రజలు, తన సాంస్కృతిక వారసత్వ భాగస్వామ్యం, ఆర్థిక భవిష్యత్తు, దేశభద్రత ఇవన్నీ పెనవేసుకుని ఉన్నాయన్న వాస్తవాన్ని బంగ్లాదేశ్ పాలకులు అర్థం చేసుకోవాలి. ఈ విషయాల్లో దీర్ఘదృష్టి మందగిస్తే ఉపఖండంలో అత్యంత కీలకమైన పరిణామాలను ప్రమాదంలో నెట్టేయడమే అవుతుంది. ఇప్పుడు హసీనాకు విధించిన మరణశిక్ష బంగ్లాదేశ్ నియంతృత్వ విధానాలకు ప్రారంభ సంకేతమా లేక రాజకీయ ప్రతీకార చర్యల కొనసాగింపా అన్నది బంగ్లాదేశ్ ప్రభుత్వం తనకుతాను నిర్ణయించుకోవాలి.