రంగారెడ్డి: ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని ఎంఎల్ సి కవిత తెలిపారు. శెరిలింగంపల్లిలో 2014 లో ఇక్కడ 64 చెరువులు ఉండేవని ఇప్పుడు అనేక చెరువులు కబ్జాకు గురయ్యానని మండిపడ్డారు. జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లాలోని శేరిలింగంపల్లి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పర్యటిస్తున్నారు. ఆమెకు తెలంగాణ జాగృతి నాయకులు ఘన స్వాగతం పలికారు. సే నో డ్రగ్స్ క్యాంపెయిన్ లో భాగంగా విద్యార్థులతో కలిసి కవిత ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. శేరిలింగంపల్లి నుంచి తమ పర్యటనను మొదలు పెట్టామని, ఇవాళ యువమిత్రులతో కలిసి నో టు డ్రగ్స్ అనే కార్యక్రమం చేపట్టామన్నారు. మత్తుకు బానిసైన యువతను ఆ ఊబి నుంచి ఏలా బయటకు తేవాలన్న దానిపై జాగృతి కృషి చేస్తుందన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం చాలా పెద్దది అని, కానీ ఇక్కడ పేదలు, పేద బస్తీలు చాలా ఉన్నాయని కవిత వివరించారు. ఈ విషయాన్ని హైదరాబాద్, తెలంగాణ ప్రజలు గమనించాలని, ఒక పక్క తెలంగాణకు వారసత్వంగా వచ్చిన ఆస్తులు పోయాయని దుయ్యబట్టారు. పేదల కష్టాలు ఏ మాత్రం తీరలేదని, అభివృద్ధి ఫలాలు అందడం లేదని, వారికి సౌకర్యాలు పెరగలేదన్నారు. ట్రాఫిక్ కష్టాలు పెరిగాయని, అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఇక్కడ ఇబ్బందులు పడుతున్నారని కవిత తెలియజేశారు.