హైదరాబాద్: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో తమిళనాడు, ఎపిలో భారీ వర్షాలు కురవనున్నాయి. లక్షద్వీప్ దీవుల సరిహద్దుల్లో ఉన్న మాల్దీవుల వరకు అల్పపీడనం విస్తరించి ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉండడంతో తమిళనాడులో వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడులోని మూడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, చెన్నై సహా ఏడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. తిరునల్వేలిలో పలు ప్రాంతాలు నీట మునిగడంతో జలపాతాల సందర్శన నిలిపివేశారు. తామిర భరణి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. దక్షిణ తమిళనాడుపై వరద ప్రభావం ఉంటుందని అధికారులు ప్రకటించారు. ఇది వచ్చే 24 గంటల్లో ఇది పశ్చిమ, వాయవ్య దిశగా నెమ్మదిగా కదులుతున్నట్ల వాతావరణ శాఖ వెల్లడించింది. వీటి ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురిసే అవకాశం కూడా ఉంది.