మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘా లు ఉత్పత్తి చేస్తున్న వివిధ వస్తువులను ఆన్‌లైన్ మార్కెటింగ్ ద్వారా అంతర్జాతీయ మార్కెట్‌కు తీసుకెళ్లేందుకు అ మెజాన్‌తో సంప్రదింపులు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. మాజీ ప్రధానమంత్రి దివంగత ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని నెక్లెస్ రోడ్డులోని ఆమె విగ్రహానికి ముఖ్యమంత్రి బుధవారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీని ఆయన అక్కడే లాంఛనంగా ప్రారంభించారు. అనంత రం రాష్ట్ర సచివాలయం నుంచి జిల్లాలోని మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు, కలెక్టర్‌లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సిఎం మాట్లాడారు. తెలంగాణలోని ఆడ బిడ్డలకు పుట్టింటి వాళ్లు అన్నదమ్ములు సారె చీర పె ట్టడం సాంప్రదాయమని అన్నారు. అలాగే, రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డను తోబుట్టువుగా భావించి తమ ప్రజా ప్రభుత్వం అర్హులైన ప్రతి మహిళకు చీర అందిస్తుందని పేర్కొన్నారు. తెలంగాణలోని అర్హులైన కోటి మంది మహిళలకు చీరలు
పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ ప్రక్రియకు సంబంధించి ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని కలెక్టర్లను సిఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి పేరిట చీరల పంపిణీ కార్యక్రమాలను చేపట్టాలన్నారు. ప్రతి మండల కేంద్రంలో కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలని ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులను ఆహ్వానించాలని సిఎం సూచించారు. నవంబర్ 19వ తేదీ నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు గ్రామీణ ప్రాంతాల్లోని 18 ఏళ్లు నిండిన మహిళలకు చీరల పంపిణీ పూర్తి చేయాలని ఇందుకు 65 లక్షల చీరెలను అందుబాటులో ఉంచామని సిఎం తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో మార్చి 1 నుంచి 8వ తేదీ వరకు 35 లక్షలు చీరలు పంపిణీ చేయాలని సిఎం ఆదేశించారు. అర్హులైన ప్రతి మహిళకు చీర అందుతుందని ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని ఆయన పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం చేపట్టిన సామాజక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల సర్వే (సీపెక్) డాటాను దగ్గర పెట్టుకొని ప్రతి మహిళకు చీర అందెలా చూడాలని చీర అందించే సమయంలో ఆధార్ నెంబర్‌ను తీసుకోవాలని ముఖ గుర్తింపు చేపట్టాలని సిఎం కలెక్టర్లకు సూచించారు. మహిళా మంత్రులు, మహిళా ఎమ్మెల్యేలు, మహిళా అధికారులు ఇందిరమ్మ చీర కట్టుకోవాలని మీరే బ్రాండ్ అంబాసిడర్‌గా మారి ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని చాటాలని ఆయన పిలుపునిచ్చారు.
అవకాశం ఉన్నచోట మహిళలకు ప్రోత్సాహాం..
మహిళల ఉన్నతే లక్ష్యంగా తమ ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపడుతోందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం వడ్డీలేని రుణాల విషయంలో నిర్లక్ష్యం వహించిందని తాము వడ్డీలేని రుణాలు ఇవ్వడంతో పాటు అందుకు సంబంధించిన నిధులు విడుదల చేసిన విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు.మహిళలకు ఆర్టీసి బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడమే కాకుండా ఆర్టీసి బస్సులకు మహిళలను యజమానులను చేశామని సిఎం తెలిపారు. యూనిఫాంలు కుట్టే బాధ్యతను అప్పజెప్పడంతో మహిళా సంఘాలకు రూ.30 కోట్ల ఆదాయం సమకూరిందని, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా పాఠశాలల్లో రూ.534 కోట్ల పనులు చేపట్టామని, ధాన్యం కొనుగోళ్లు మహిళా సంఘాలకే అప్పజెప్పామని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. శిల్పారామం పక్కన రూ.వందల కోట్ల విలువైన 3 ఎకరాల్లో ఇందిరా మహిళా శక్తి బజార్ ఏర్పాటు చేశామని సిఎం పేర్కొన్నారు. మహిళా సంఘాలు ఉత్పత్తి చేస్తున్న ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్ కల్పించాలన్న లక్ష్యంతో అమెజాన్‌తో సంప్రదింపులు చేస్తున్నామని సిఎం వెల్లడించారు.
అంతకు ముందు చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ సిఎం
ఇందిరమ్మ స్పూర్తితో మహిళా సాధికరతకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని, మహిళల సంక్షేమంతో పాటు ఆర్థిక ఉన్నతి కలిగించే కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. రాజకీయాల్లోనూ మహిళలకు తగిన ప్రాధాన్యత కల్పించామని, కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలని లక్ష్యంగా పెట్టుకొని ప్రభుత్వం పనిచేస్తోందని సిఎం రేవంత్ చెప్పారు. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తామని చెప్పి మోసం చేసిందని, పేదలను ఆశలను అడియాశలు చేసిందని ఆయన విమర్శించారు. మన ప్రభుత్వం రాగానే మొదటి విడతగా రూ.22,500 కోట్ల వ్యయంతో ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామన్నారు. మహిళలకు పెట్రోల్ బంక్ లు నిర్వహించుకునేలా ప్రోత్సహించామని, ఆర్టీసిలో వెయ్యి బస్సులకు మహిళలని యజమానులను చేశామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 4లక్షల ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తున్నామని, ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో మహిళలను భాగస్వామ్యులను చేస్తున్నామని సిఎం రేవంత్ చెప్పారు.
పరిపాలనలో ఇందిరాగాంధీ ఒక రోల్ మోడల్
పరిపాలనలో ఇందిరా గాంధీ ఒక రోల్ మోడల్ అని భూ సంస్కరణలతో ఆమె పేదలకు భూ పంపిణీ చేశారని సిఎం రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు. ఇందిరాగాంధీ పాకిస్తాన్‌ను విడగొట్టి బంగ్లాదేశ్‌ను ఏర్పాటు చేశారని, ప్రపంచ దేశాల బెదిరింపులకు ఇందిరమ్మ భయపడలేదని సిఎం రేవంత్ తెలిపారు. ఇందిరాగాంధీ పాలన దేశానికి దిక్సూచి అని సిఎం రేవంత్ కొనియాడారు. వైఎస్‌ఆర్ హయాంలో 25 లక్షల ఇందిరమ్మ ఇళ్లు కట్టించారని, డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని చెప్పి బిఆర్‌ఎస్ మోసం చేసిందని సిఎం విమర్శించారు.
రేషన్ కార్డు ఉన్న మహిళలందరికీ చీరలు: ఉప ముఖ్యమంత్రి
కలెక్టర్లతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ మహిళలకు గౌరవం పెంచాలన్న ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం చీరల పంపిణీ కార్యక్రమం చేపడుతోందన్నారు. రేషన్ కార్డు ఉన్న మహిళలందరికీ చీరలు అందిస్తున్నామని ఆయన తెలిపారు.
దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి: మంత్రి సీతక్క
మంత్రి సీతక్క మాట్లాడుతూ మహిళా సంఘాల రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు సంఘాల దగ్గరకే వస్తున్నాయని తెలిపారు. 98 శాతం రుణ చెల్లింపుతో సంఘాలు తమ క్రమశిక్షణను చాటుతు న్నాయని మంత్రి సీతక్క కొనియాడారు. ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీపైనా కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని వాటిని తిప్పికొట్టాలని మంత్రి సీతక్క సూచించారు. ఆకాశమే హద్దుగా మహిళలు ఎదగాలన్న ఉద్దేశంతో ఆకాశం రంగును చీరలకు ఎంచుకున్నామని ఆమె తెలిపారు.
మీ పెట్రోల్ బంక్ ఎలా నడుస్తోంది..
మీ సంఘం ఆధ్వర్యంలోని పెట్రోల్ బంక్ ఎలా నడుస్తోందని నారాయణపేట జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు అరుంధతిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. బాగా నడుస్తోందని, నెలకు రూ.4 లక్షల రాబడి వస్తోందని ఆమె సిఎంతో పేర్కొన్నారు. ఇతర జిల్లాల నుంచి సంఘాలను అక్కడకు తీసుకెళ్లి వారి పని తీరు రాబడిని ప్రత్యక్షంగా చూపాలని కలెక్టర్లకు సిఎం సూచించారు..
డిజైన్లు ఎంతో బాగున్నాయి…
తమకు ఇస్తున్న చీరల డిజైన్లు ఎంతో బాగున్నాయని రాజన్న సిరిసిల్ల జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు భాగ్య ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. 9 మీటర్లు, 6 మీటర్ల చీరలు తమకు నచ్చినట్లు ఉన్నాయని తమకు ఎంతో సంతోషంగా ఉందని ఆమె సిఎంతో పేర్కొన్నారు.
మాకు యూనిఫాం ఇచ్చినట్లు ఉంది
ఇందిరామహిళా శక్తి చీరలు ఇవ్వడం ద్వారా తమకు యూనిఫాం వచ్చిందన్న సంతోషం ఉందని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు శ్రీదేవి తెలిపారు. ఈ చీరలు దరించడం ద్వారా తమ సంఘాల మహిళలకు ప్రత్యేక గుర్తింపు ఉంటుందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్ అండ్ బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ కార్యదర్శి శేషాద్రి, సిఎం కార్యదర్శి మాణిక్‌రాజ్, సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్, చేనేత, జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ తదితరులు పాల్గొన్నారు.