భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో గగన్‌యాన్ యాత్రలో మరో ముందడుగు వేసింది. నవంబర్ 7న మహేంద్రగిరి లోని ప్రొపల్షన్ కాంప్లెక్స్‌లో నిర్వహించిన పరీక్షల్లో ఎల్‌వీఎం 3 రాకెట్‌ను నడిపించే సీఈ20 క్రయోజెనిక్ ఇంజిన్‌ను కొత్త బూట్‌స్ట్రాలప్ మోడ్‌లో విజయవంతంగా స్టార్ట్ చేసింది. దాదాపు పది సెకన్ల పాటు ఈ పరీక్ష నిర్వహించినట్టు ఇస్రో తెలిపింది. ఈ ఇంజిన్ ఇప్పటికే 19 నుంచి 22 టన్నుల వరకు థ్రస్ట్ స్థాయిలో ప్రయోగాల్లో పనిచేసింది. తాజాగా బూట్‌స్ట్రాప్ స్టార్ట్ సాధించడం విశేషం. అదనంగా ఉండే స్టోర్డ్ గ్యాస్ సిస్టమ్ అవసరం లేకుండానే థ్రస్ట్ చాంబర్ , గ్యాస్ జెనరేట్‌లో మల్టీ ఎలిమెంట్ ఇగ్నిటర్ ఉపయోగించి ఈ విధానం సాధించినట్టు చెప్పింది. ఈ కొత్త స్టార్ట్‌అప్ టెక్నిక్ సాయంతో ఇంజిన్ లోని టర్బో పంపులు తామే వేగాన్ని పెంచుకుంటూ స్థిరస్థితికి చేరుతాయని , దాంతో రాకెట్ బరువు తగ్గి, సామర్థం పెరుగుతుందని తెలియజేసింది.