అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) బుధవారం ప్రకటించిన తాజా వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఒక పాయింట్ తేడాతో టాప్ ర్యాంక్‌ను కోల్పోయాడు. న్యూజిలాండ్ ఆటగాడు డారిల్ మిఛెల్ 782 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకున్నాడు. రోహిత్ 781 పాయింట్లతో రెండో ర్యాంక్‌కు పడిపోయాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న సిరీస్‌లో మెరుగైన బ్యాటింగ్‌ను కనబరచడం ద్వారా మిఛెల్ రెండు స్థానాలు మెరుగుపరుచుకుని మొదటి ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. అఫ్గాన్ ఆటగాడు ఇబ్రహీం జద్రాన్ మూడో, భారత ఆటగాళ్లు శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లిలు వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. భారత బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ 8వ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు.
కాగా, న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిఛెల్ టాప్ ర్యాంక్‌కు చేరుకోవడం ద్వారా అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. 1979లో గ్లెన్ టర్నర్ తర్వాత వన్డేల్లో టాప్ ర్యాంక్‌ను దక్కించుకున్న రెండో కివీస్ బ్యాటర్ మిఛెల్ నిలిచాడు. బౌలింగ్ విభాగంలో రషీద్ ఖాన్ (అఫ్గాన్) టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. జోఫ్రా ఆర్చర్ (ఇంగ్లండ్) రెండో, కేశవ్ మహరాజ్ (సౌతాఫ్రికా) మూడో, తీక్షణ (లంక) నాలుగో, బెర్నార్డ్ (నమీబియా) ఐదో ర్యాంక్‌లో నిలిచారు. భారత బౌలర్ కుల్దీప్ యాదవ్ ఆరో ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. టెస్టు బ్యాటింగ్ విభాగంలో జో రూట్ (ఇంగ్లండ్), బౌలింగ్‌లో జస్‌ప్రీత్ బుమ్రా (భారత్) టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్నారు.