ఢిల్లీ ఎర్రకోట వద్ద పేలుడు గ్యాంగ్ మూలాలున్న అల్ ఫలాహ్ వర్శిటీ ఛైర్‌పర్సన్ జవాద్ అహ్మద్ సిద్థిఖీని 13 రోజుల పాటు ఇడి కస్టడీకి అప్పగించారు. ఈ మేరకు ఢిల్లీ కోర్టు బుధవారం ఉత్తర్వులు వెలువరించింది. విద్యాసంస్థకు సంబంధించి రూ 415 కోట్ల మేర అక్రమ నిధులను గుర్తించారు.ఈ క్రమంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) సమగ్ర విచారణ అవసరం, పైగా ఈ వ్యక్తి ఏదో విధంగా దేశం వీడి పారిపోయేందుకు వీలుంది. ఆయన కుటుంబ సభ్యులు గల్ఫ్‌లో స్థిరపడి ఉన్నారు. అన్నిటిని గుర్తించి ఈ వ్యక్తిని ఇడి నిర్బంధానికి అప్పగిస్తున్నట్లు అదనపు సెషన్స్ జడ్జి షీతల్ చౌదరి ప్రదాన్ తెలిపారు. కేసు తీవ్రతను బట్టి నిందితుడిని తెల్లవారుజామున జడ్జి నివాసంలో ప్రవేశపెట్టారు. అరగంట పాటు విచారణ తరువాత సిద్థిఖీని ఇడి కస్టడికి తరలించేందుకు మహిళా న్యాయమూర్తి ఆదేశాలు వెలువరించారని ఇడి వర్గాలు తెలిపాయి.
ఈ వ్యక్తి 14 రోజుల కస్టడీకి ఇడి అభ్యర్థించింది. వైట్‌కాలర్ టెర్రర్ మాడ్యూల్ కేసులో ఫరీదాబాద్‌లోని అల్ ఫలాహ్ వర్శిటీకి చెందిన పలువురు డాక్టర్లు ప్రమేయం ఉన్నట్లు వెల్లడికావడంతో ఈ విద్యాసంస్థ పూర్వాపరాలు ఇప్పుడు భారీ స్థాయిలో దర్యాప్తు సంస్థల నిఘాకు తరువాతి ఆరాలు, పలు అరెస్టులకు దారితీస్తున్నాయి. ఈ వర్శిటీకి చెందిన డాక్టర్ ఉమర్ ఉన్ నబీనే ఈ ఢిల్లీ పేలుడు ఘటనలో తనను తాను పేల్చుకుని, పౌరుల మృతికి కారకుడైన సూసైడ్ బాంబర్‌గా నిర్థారణ అయింది. ఈ క్రమంలో ఈ విద్యాసంస్థ నిధులు , ఇతర వ్యవహారాలు పూర్తి స్థాయిలో దర్యాప్తునకు, మనీలాండరింగ్ నిరోధక చట్టం పరిధిలో విచారణకు దారితీశాయి. ఈ విద్యాసంస్థ వ్యవస్థాపకుడు , మేనేజింగ్ ట్రస్టీగా సిద్ధిఖీ చక్రం తిప్పుతూ వచ్చాడు. ఈ వ్యక్తి లావాదేవీలపై సమగ్ర దర్యాప్తు అత్యవసరం అని, ఆయన పారిపోకుండా కట్టడి చేసుకోవల్సి ఉందని ఇడి కోర్టుకు తెలిపింది.