కోల్‌కతా వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో టీం ఇండియా సారథి శుభ్‌మాన్ గిల్ గాయపడిన విషయం తెలిసిందే. మెడ భాగంలో అతనికి గాయం కావడంతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఆ మ్యాచ్ ముగిసేవరకూ తిరిగి మైదానంలో అడుగుపెట్టలేదు. అయితే గౌహతి వేదికగా జరిగే రెండో టెస్ట్‌లో గిల్ ఆడుతాడా.. లేదా.. అనే అంశంపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో బిసిసిఐ ఓ ప్రకటన విడుదల చేసింది. తొలి టెస్ట్ మ్యాచ్ ఆట ముగిసిన తర్వాత గిల్‌ని ఆస్పత్రికి తరలించినట్లు.. వైద్యులు అతడి ఆరోగ్యాన్ని పర్యవేక్షించారని తెలిపింది. ఆ మరుసటి రోజు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయినట్లు.. గిల్ జట్టుతో పాటు గౌహతికి వెళ్తాడని.. కానీ, అతడు ఆ మ్యాచ్‌లో ఆడేది.. లేనిది అ తర్వాత నిర్ణయిస్తామని పేర్కొంది.
ఒకవేళ శుభ్‌మాన్ గిల్ రెండో టెస్ట్ మ్యాచ్‌లో ఆడకుంటే.. అతడి స్థానంలో వైస్ కెప్టెన్ రిషబ్ పంత్‌కు సారథ్య బాధ్యతలు అప్పగిస్తారు. మరి అతడి స్థానంలో జట్టులోకి ఎవరు వస్తారనే విషయంపై క్లారిటీ లేదు. ప్రస్తుతం సాయి సుదర్శన్, దేవ్‌దత్ పడిక్కల్ అందుబాటులో ఉన్నారు. కానీ, ఇప్పటికే జట్టులో ఆరుగురు ఎడమ చేతి వాటం బ్యాటర్లు ఉన్నారు. వీరిద్దరిలో ఎవరిని జట్టులోకి తీసుకున్నా.. ఆ సంఖ్య ఏడుకు చేరుతుంది. అలాగే ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి సైతం ఇప్పటికే జట్టులోకి వచ్చి చేరాడు.