కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు ఘోరంగా విఫలమయ్యారు. సఫారీలు నిర్ధేశించిన 124 పరుగుల విజయలక్ష్యాన్ని చేధించలేక.. 93 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యారు. ఈ నేపథ్యంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. గంభీర్ తీసుకున్న కొన్ని నిర్ణయాలే ఈ వైఫల్యానికి కారణమని అభిమానులు విమర్శించారు. అయితే టీం ఇండియా మాజీ ఆటగాడు రాబిన్ ఊతప్ప గంభీర్‌కు మద్ధతు ఇచ్చాడు. ఆటగాళ్లు పరుగులు చేయడంలో విఫలమైతే.. దానికి గంభీర్ ఏం చేస్తాడని ఆయన ప్రశ్నించాడు.
‘మనం కోల్‌కతా మ్యాచ్ ఫలితాన్ని చూసి కోచ్ గంభీర్‌ను తప్పుబడుతున్నాం. కానీ, బ్యాటర్లు విఫలమైతే.. గంభీర్ ఏం చేస్తాడు. గంభీర్ స్వయంగా వచ్చి మ్యాచ్ ఆడలేదు కదా. అంతర్జాతీయ క్రికెట్‌లో 20 వేల నుంచి 30 వేల పరుగులు చేసి రాహుల్ ద్రవిడ్‌ను సైతం గతంలో ఇలాగే విమర్శించారు. ఇక్కడ ఎవర్నైనా అలాగే విమర్శిస్తారని అర్థమైంది’ అని ఊతప్ప తన యూట్యూబ్ ఛానెల్‌లో పేర్కొన్నాడు. కాగా, గౌతమ్ గంభీర్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి భారత్ 18 టెస్ట్ మ్యాచ్‌లు ఆడగా.. అందులో కేవలం తొమ్మిది మ్యాచ్‌లు మాత్రమే గెలవడం గమనార్హం.