గ్రేటర్ వ్యాప్తంగా 30 ప్రదేశాల్లో ప్రతిపాదనలు
పిపిపి పద్దతిన ప్లాన్‌లను సిద్దంచేసిన జీహెచ్‌ఎంసి
5000 చ.గ.లు.. 4 అంస్తులుగా నిర్మాణం
సుమారు 300 కార్లపార్కింగ్ సామర్థం
మనతెలంగాణ, సిటీబ్యూరో ః గ్రేటర్‌లో వాహనాల పార్కింగ్ సమస్యను పరిష్కరించడంపై జీహెచ్‌ఎంసి ప్రత్యేక దృష్టిసారించింది. ఇందులో భాగంగానే చౌమహల్లా ప్యాలేస్ చెంతన ఒక ప్రత్యక ‘మల్టీలేవల్ పార్కింగ్ కాంప్లెక్స్’ను నిర్మించాలని జీహెచ్‌ఎంసి నిర్ణయించింది. ఈమేరకు టెండర్లను పిలిచేందుకుగానూ చౌమహల్లా ప్యాలేస్ ప్రాంతంలో ఎంతస్థలముంది, ఎన్ని అంతస్థులు పార్కింగ్ కాంప్లెక్స్‌ను నిర్మంచవచ్చును, అక్కడ ఎన్న వాహనాలు నిలుస్తున్నాయనే దానిపై అధ్యయనం చేసిన కార్పోరేషన్ త్వరలోనే టెండర్లకు వెళ్లాలనే దిశగా ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఈమేరకు స్టాండింగ్ కమిటీ సమావేశం ముందుకు ప్రతిపాదనలను పంపి అనుమతి పొందాలని నిర్ణయించింది. చౌమహల్లా ప్యాలేస్ ప్రాంతంలో వాహనాల పార్కింగ్ సమస్య రోజురోజుకు జఠిలమవుతున్న నేపథ్యంలో అక్కడ ముందుగా మల్టీలేవల్ పార్కింగ్ కాంప్లెక్స్‌ను నిర్వహించేందుకు జీహెచ్‌ఎంసి సిద్దమైంది. ఈ కాంప్లెక్స్‌ను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ పద్దతిలో నిర్మించడం ద్వారా సంస్థకు ఎలాంటి ఆర్థిక భారం లేకుండా.. సమస్య పరిష్కరించడం జరుగుతుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
డిబిఎఫ్‌ఓటి పద్దితలో..
మల్టీలేవల్ పార్కింగ్ కాంప్లెక్స్‌ను పిపిపి పద్దతిలో నిర్మించడం ద్వారా సంస్థ ఏ ఒక్క రూపాయి కూడా వెచ్చించకుండా జీహెచ్‌ఎంసి నిర్మించనున్నది. డిజైన్, బిల్ట్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్ విధానంలో ఏర్పాటు చేయాలని జీహెచ్‌ఎంసి ప్లాన్‌చేసింది. చౌమహల్లా ప్యాలేస్ వద్ద సుమారు 5000 చ.గ.ల స్థలంలో సుమారు 4 అంతస్థులుగా కాంప్లెక్స్‌ను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నది. అయితే, ఈ కాంప్లెక్స్‌లో కనీసంగా 300 కార్లు ఏకకాలంలో పార్కింగ్ చేసుకునే సదుపాయాన్ని కల్పించే సామర్థం, అత్యాధునిక సాంకేతిక వ్యవస్థతో నిర్వహణను చేపట్టే విధంగా ఏర్పాటు చేస్తున్నట్టు అధికార వర్గాల సమాచారం. కనీస పార్కింగ్ రుసుంలను విధించి, డ్రైవర్లకు వసతులు కల్పించడం, ముందుగానే పార్కింగ్ స్థలం ఉన్నదా..? లేదా..? తెలుసుకునే టెక్నాలజీని కూడా వినియోగంలో ఉండేలా తీర్చిదిద్దాలని జీహెచ్‌ఎంసి నిర్ణయించింది. లిఫ్టింగ్ పద్దతి ద్వారా కార్లను పై అంతస్థులకు తరలించడం, దింపడం ఉండేలా కాంప్లెక్స్‌ను రూపొందిస్తున్నట్టు అధికార వర్గాల సమాచారం.
30 ప్రాంతాల్లో ప్రతిపాదనలు..
గ్రేటర్‌లో రోజురోజుకు పెరుగుతున్న వాహనాలతో జఠిలమవుతోన్న పార్కింగ్ సమస్యను అధిగమించేందుకు నగర వ్యాప్తంగా 30 ప్రదేశాల్లో మల్టీలేవల్ పార్కింగ్ సదుపాయంను అందుబాటులోకి తీసుకురావాలని జీహెచ్‌ఎంసి నిర్ణయించింది. ఇందులో భాగంగా ముందుగా చౌమహల్లా ప్యాలేస్ చెంతన, జీహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయం వద్ద, అనంతరం ప్యారడైజ్ సమీపాన, సికింద్రాబాద్, జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45లోనూ మొదటి దశలో వీటిని నిర్మించాలని జీహెచ్‌ఎంసి ప్రణాళికలను ఈపాటికే రూపొందించిందనీ, అయితే, ఉప ఎన్నికల నేపథ్యంలో వీటి ప్రతిపాదనలు స్టాండింగ్ కమిటీకి రాలేకపోయినట్టు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి.