స్థానిక ఎన్నికల్లో బిసిలకు పెద్ద పీట
బిజెపి అధ్యక్షుడు రాంచందర్ రావు
మన తెలంగాణ/హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిలకు పార్టీ పరంగా రిజర్వేషన్లు కల్పించి, వారికి పెద్ద పీట వేస్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు తెలిపారు. పార్టీ పరంగా పోటీ చేసేందుకు ముందుకు వచ్చే నాయకులు, కార్యకర్తల గుణ గణాలను, పూర్తి వివరాలు పరిశీలించి ఎంపిక చేస్తామని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులకో మాట్లాడుతూ అన్నారు. గత సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. బిసిల ఓట్లు పొందేందుకు బిసి రిజర్వేషన్ల గురించి చెప్పినా, అధికారంలోకి వచ్చిన తర్వాత చర్యలు చేపట్టలేదని ఆయన విమర్శించారు. తమ పార్టీ బిసిల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నదని ఆయన చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్‌తో దేశంలో ఉగ్రవాదం, మావోయిస్టు చర్యలను నిర్మూరించేందుకు వీలుగా నిర్ణయం తీసుకుందన్నారు. గత అనేక దశాబాలుగా మావోయిస్టులు పేదలను, దళితులను, గిరిజనులను, పోలీసులను, పోలీస్ ఇన్ఫార్మల పేరిట అనేక మందిని, ఇంకా బిజెపి, ఎఐవిపి కార్యకర్తలను పొట్టనపెట్టుకున్నారని ఆయన విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు వచ్చే ఏడాది మార్చి నెలాఖరులోగా తుపాకులు వదిలి లొంగిపోవాలని హెచ్చరించడమే కాకుండా లొంగిపోవడానికి తగిన సమయం కూడా ఇచ్చిందని ఆయన వివరించారు. కాబట్టి మావోయిస్టులు తుపాకి వీడి జన జీవన స్రవంతిఓ కలవాలని రాంచందర్ రావు పిలుపునిచ్చారు.
కీలక సమావేశం..
ఇదిలాఉండగా బిజెపి రాష్ట్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు అధ్యక్షతన మంగళవారం కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు, మోర్చా అధ్యక్షులు పాల్గొన్నారు. పార్టీ బలోపేతానికి పోలింగ్ కేంద్రం స్థాయి నుంచి కమిటీల ఏర్పాటు, ప్రస్తుత కార్యాచరణ ప్రణాళికలు, రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన వ్యూహాత్మక కార్యక్రమాలపై వారు సవివరంగా చర్చించారు.
రాంజీ గోండ్ మ్యూజియం
గిరిజన నాయకుడు బిర్సా ముండా 150వ జయంతి సందర్భంగా, జన జాతీయ గౌరవ దివస్‌లో భాగంగా బిజెపి ఎస్‌టి మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రవి నాయక్ అధ్వర్యంలో ఆబిడ్స్‌లోని రాంజీ గోండ్ మ్యూజియం ఏర్పాటైంది.