రిజర్వేషన్లు 50 శాతం పరిమితిపై …
విస్తృత ధర్మాసనంలో విచారించేందుకు సుప్రీంను అభ్యర్థించాలి : బిసి కమిషన్
మన తెలంగాణ / హైదరాబాద్ : రిజర్వేషన్‌లు 50 శాతానికి మించొద్దన్న 5 గురు జడ్జిల బెంచ్ ఇచ్చిన తీర్పును వెంటనే ఛాలెంజ్ చేస్తూ 7 గురు జడ్జిల విస్తృత ధర్మాసనం విచారించి బిసిలకు న్యాయం చేసేలా సుప్రీంకోర్టును అభ్యర్థించాలని రాష్ట్ర బిసి కమిషన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. రాష్ట్రంలో బిసిలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఆశలు కల్పించి, ఆ దిశలో తీవ్రంగా ప్రయత్నించి చివరకు బిసిల ఆశలపై నీళ్ళు చల్లే విధంగా మొత్తం రిజర్వేషన్లు 50 శాతం లోపు కల్పించే విధంగా నిర్ణయించడం ఆత్మహత్యాసదృశ్యమని బిసి కమిషన్ అభిప్రాయపడింది. పరిస్థితులకనుగుణంగా రాజ్యాంగంలో మార్పులు జరిగాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి. ఆర్. గవాయ్ అమరావతిలో జరిగిన ఒక సమావేశంలో చెప్పిన విషయాన్ని బిసి కమిసన్ గుర్తు చేసింది.
భారత రాజ్యాంగం స్థిరంగా ఉండే పత్రం కాదని, పరిస్థితులకు, సహజ అవసరాలకు అనుగుణంగా రాజ్యాంగ సవరణకు అధికరణ 308 ద్వారా వెనులుబాటు కల్పించారని, సాంఘిక, ఆర్థిక సవాళ్ళను ఎదుర్కొనే క్రమంలో పార్లమెంట్ రాజ్యాంగ సవరణలు చేస్తుందని, బిసి కమిషన్ చైర్మన్ నిరంజన్ పేర్కొన్నారు. 42 శాతం రిజర్వేషన్లు కల్పించే విషయంలో అటు సుప్రీంకోర్టులో ఇటు హైకోర్టులో జరుగుతున్న వాద ప్రతివాదనలకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వ్యాఖ్యలు కనువిప్పు కలిగించాలన్నారు.
కె. కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (11 మే 2010) కేసులో 5 గురు జడ్జిల బెంచ్ రిజర్వేషన్లు 50 శాతం కంటే ఎక్కువగా ఉండొద్దన్న తీర్పును ఆధారంగా చేసుకొని, బిసిలకు 42 శాతం రిజర్వేషన్లను అడ్డుకునే ప్రయత్నం జరుగుతుందన్నారు. ఇది కాలానుగుణమైన మార్పులను పరిగణలోకి తీసుకోకుండా జరుగుతున్న వాదనలని, బిసిలకు గొడ్డలిపెట్టుగా మారుతున్న విషయం గమనించాలన్నారు. వ్యయ ప్రయాసలతో నిర్వహించిన ఇంటింటి సర్వే బిసిల వెనుకబాటుతనాన్ని గుర్తించిన విషయాన్ని ఏమాత్రం లెక్కపెట్టకుండా 5 గురు జడ్జిలతో కూడిన తీర్పునే ఉటంకిస్తూ అడ్డుకోవడం క్షంతవ్యం కాదన్నారు. రాజకీయ కారణాలతో బిసి బిల్లులను 9వ షెడ్యూలులో పెట్టకపోవటం దురదృష్టకరమని, ఇది బిసిలకు తీవ్రమైన అన్యాయం చేసే చర్యగా భావించాల్సివస్తోందని నిరంజన్ అన్నారు.