* తెలంగాణకు చెందిన అభ్యర్థులందరూ అర్హులే
* గతంలో దరఖాస్తు చేసుకోలేని అభ్యర్థులకు అవకాశం
* సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ వెల్లడి
మన తెలంగాణ / హైదరాబాద్ : సివిల్స్ ఇంటర్వ్యూలకు ఎంపికైన తెలంగాణ ప్రాంత అభ్యర్థులకు శుభవార్త. సింగరేణి సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం పథకంలో భాగంగా సివిల్స్ ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థులకు రూ.లక్ష ప్రోత్సాహకం కోసం అర్హులైన అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవాలని సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ మంగళవారం తెలిపారు. ఈ పథకంలో భాగంగా గతంలో మెయిన్స్ కు ఎంపికై ఇప్పటికే లక్ష రూపాయల ప్రోత్సాహకాన్ని అందుకున్న వాళ్లు మళ్లీ దరఖాస్తు చేసుకోనవసరం లేదని, తెలంగాణకు చెందిన ఇతర అభ్యర్థులు ఎవరైనా ఇంటర్వ్యూలకు ఎంపికైతే వారికి కూడా ఈ ప్రోత్సాహకాన్ని అందించనున్నట్లు పేర్కొన్నారు. సమాచారం లేకపోవడం వల్ల తాము దరఖాస్తు చేసుకోలేదని, సివిల్స్ ఇంటర్వ్యూలకు ఎంపికయ్యామని, తమకు ఆర్థిక ప్రోత్సాహకం అందించాలని పలువురు అభ్యర్థులు విజ్ఞప్తి చేశారని, ఈ నేపథ్యంలో వారికి కూడా అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. సంబంధిత అభ్యర్థులు తమ దరఖాస్తులను, వివరాలను ఈ నెల 21వ తేదీ లోపు హైదరాబాద్ సింగరేణి భవన్ లో అందజేయాలని కోరారు. త్వరలో అర్హులందరికీ రెండో విడత లక్ష రూపాయల ప్రోత్సాహకాన్ని అందించనున్నట్లు వెల్లడించారు.
యువతకు చేయూతగా రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం : గత ఏడాది ప్రారంభించిన ఈ పథకం ద్వారా మొదటగా మెయిన్స్ కు ఎంపికైన 140 మందికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందచేయగా వారిలో 20 మంది ఇంటర్వ్యూలకు ఎంపికయ్యారని సీఎండీ బలరామ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇంటర్వ్యూలకు ఎంపికైన 20 మందికి మరో విడతగా రూ.లక్ష చొప్పున సాయం అందించగా వారిలో ఏడుగురు విజేతలుగా నిలిచారని, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో టాపర్గా నిలిచిన 11వ ర్యాంకర్ కూడా ఇందులో ఉన్నారని వివరించారు. ఈ ఏడాది ప్రిలిమ్స్ పాసైన 202 మందికి ఆర్థిక చేయూత అందించగా 43 మంది ఇంటర్వ్యూలకు ఎంపికయ్యారని వెల్లడించారు.