వైద్య విద్యార్థులకు, యువతకు మంత్రి అడ్లూరి పిలుపు
మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్టాన్ని మత్తు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రజా ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టిందని ఎస్‌సి, ఎస్‌టి, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. డ్రగ్స్‌కు దూరంగా జీవిత లక్ష్యాలకు దగ్గరగా అనే సందేశాన్ని ప్రతి విద్యార్థి, యువకుడి వద్దకు చేరేలా సమగ్రమైన అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. మంగళవారం గాంధీ మెడికల్ కళాశాల ఆడిటోరియంలో తెలంగాణ రాష్ట దివ్యాంగులు వయోవృద్ధులు, ట్రాన్స్ జెండర్ వ్యక్తుల సాధకారిత శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నషాముక్త్ భారత్ అభియాన్ 5వ వార్షికోత్సవంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాదకద్రవ్యాల దుష్ప్రభాలపై మంత్రి అడ్లూరి ప్రసంగించారు. యువత చెడు వ్యసనాలకు లోనుకాకుండా చదువు, ఉద్యోగ అవకాశాలు, వ్యక్తిత్వ వికాసం వైపు దృష్టి సారించేలా ప్రభుత్వం బాధ్యతగా తీసుకుందని మంత్రి పేర్కొన్నారు. మత్తు పదార్థాల దుష్ప్రభావాల నేపథ్యంలో ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు ప్రారంభించిందన్నారు. రాష్ట్రంలో డ్రగ్ సరఫరా మార్గాలను పూర్తిగా నిర్మిలించడానికి ప్రవేశపెట్టిన ఈగల్ స్పెషల్ యూనిట్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. నగరాల్లో, విద్యాసంస్థల పరిసరాల్లో, ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో డార్క్‌నెట్ ద్వారా జరిగే లావాదేవీలపై ఈగల్ టీమ్ నిరంతరం నిఘా పెడుతోందని చెప్పారు. రియల్ టైమ్ ఇంటెలిజెన్స్, డేటా విశ్లేషణ, వేగవంతమైన ఆపరేషన్లతో ఈ వ్యవస్థ రాష్ట్ర పోలీసింగ్ విధానాన్ని కొత్త దిశగా నడిపించిందన్నారు. డ్రగ్ మాఫియాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందన్నారు. మత్తు వ్యసనం వ్యక్తిగత అలవాటు కాదని, ఇది కుటుంబాలను కూల్చివేసే ఒక అగ్నికీల అని మంత్రి పేర్కొన్నారు. యువత రక్షణ తెలంగాణ భవిష్యత్తు రక్షణేనని ఆయన వ్యాఖ్యానించారు.
యువత కోసం ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు, కళాశాలల్లో కౌన్సెలింగ్ సేవలు, స్పోర్ట్ కల్చరల్ ఈవెంట్లు, డ్రగ్ ఫ్రీ క్యాంపెయిన్‌లు, మారథాన్‌లు నిర్వహిస్తూ సానుకూల వాతావరణం ఏర్పడుతోందన్నారు. డ్రగ్స్‌కు దూరంగా, కెరీర్‌కు దగ్గరగా, విజయాలకు దగ్గరగా, భవిష్యత్తుకు దగ్గరగా అనే నినాదాన్ని విద్యార్థి జీవన సూత్రంగా తీసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. డ్రగ్స్ కొద్ది రోజుల ‘కిక్’తో మొదలై, భవిష్యత్తును చీకటిలోకి నెట్టేస్తుందని, మనం చూస్తున్న కేసుల్లో అనేక మంది విద్యార్థులు అలవాటు బారిన పడి చదువు, అవకాశాలు, కుటుంబాలను కోల్పోతున్నారనీ ఆందోళన వ్యక్తం చేశారు.
ఇది తెలంగాణ భవిష్యత్తు పై ఒక పెద్దముప్పుగా పరిణమించిందన్నారు. ప్రవర్తనలో మార్పులు, అర్థరాత్రి తిరగడం, కొత్త అలవాట్లు ఇవన్నీ మత్తు వ్యసన సూచనలుగా కనిపిస్తాయని, వెంటనే కౌన్సెలింగ్‌కు తీసుకెళ్లాలని సూచించారు. విద్యాసంస్థల్లో ప్రత్యేక క్లబ్‌లు ఏర్పాటు చేసి విద్యార్థులపై నిఘా కొనసాగించాలని సూచించారు. మత్తు నిరోధక చర్యల్లో భాగంగా, రాష్ట్రవ్యాప్తంగా ఎన్‌ఎమ్‌బిఎ కమిటీలు ఏర్పాటు చేసి, పాఠశాలలు-, కళాశాలల్లో క్లబ్‌లు స్థాపించామని మంత్రి వివరించారు. ఇప్పటివరకు 15,891 విద్యాసంస్థల్లో 7,018 కార్యక్రమాల ద్వారా 1.45 కోట్ల మందికి అవగాహన కల్పించామన్నారు. ఇది దేశంలోనే అతిపెద్ద డ్రగ్స్ అవగాహన కార్యక్రమమని మంత్రి అడ్లూరి స్పష్టం చేశారు.
యువత పునరావాసానికి ప్రత్యేక చర్యల్లో భాగంగా సైదాబాద్ అబ్జర్వేషన్ హోమ్‌లో పిల్లల కోసం డీ- అడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేసినట్టు, చెర్లపల్లి, నిజామాబాద్, చంచల్‌గూడ, సంగారెడ్డి జైళ్లలో ప్రత్యేక చికిత్సా సేవలు ప్రారంభించామని తెలిపారు. పది జిల్లాల్లో ఎన్‌జిఓలతో కలిసి పునరావాస కేంద్రాలు, త్వరలో పన్నెండు జిల్లా ఆసుపత్రుల్లో కొత్త చికిత్సా కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయన్నారు. మాదక ద్రవ్య రహిత తెలంగాణ కోసం ప్రభుత్వం, -సమాజం-, యువత కలిసి ముందుకు సాగాలి అని మంత్రి పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాదకద్రవ్యాల నిరోధక 2025 ప్రతిజ్ఞను వైద్య విద్యార్థులచేత చేయించారు. మాదకద్రవ్యాల నిర్మూలనలో సేవలందిస్తున్న వాలంటీర్లను మంత్రి సన్మానించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కళాకారులు ప్రదర్శించిన నాటక ప్రదర్శన, ఆటలు,పాటలు యువతలో మత్తు వ్యసనంపై అవగాహన కార్యక్రమాలు వీక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, టిజి ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్య, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన, సీనియర్ సిటిజన్, ట్రాన్స్‌జెండర్ విభాగం డైరెక్టర్ శైలజ, హైదరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీ శ్రీకాంత్, గాంధీ హాస్పిటల్ సూపరిండెంటెంట్ డాక్టర్ వాణి, గాంధీ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఇందిరా, యాంటీ నార్కోటిక్ బ్యూరో ఎస్‌పి సీతారాం తదితరులు పాల్గొన్నారు.