కేంద్రం ఎట్టి పరిస్థితుల్లోను అనుమటించొద్దు
ఆల్మట్టి ఎత్తు పెంచితే సహించేది లేదు
ఎత్తు పెంచకుండా కర్ణాటకను నిలువరించండి
కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో మంత్రి ఉత్తమ్ భేటీ
కీలక అంశాలపై కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు
మన తెలంగాణ / హైదరాబాద్ : ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టును ఏ రూపంలో నిర్మించాలనుకున్న ప్రతిఘటిస్తామని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి తేల్చిచెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వవద్దని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆల్ మట్టి ఎత్తు పెంపు తెలంగాణాకు నష్ట దాయకమని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎత్తు పెంపుకు అనుమతులు ఇవ్వదద్దని ఆయన కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎపి ప్రభుత్వం ప్లాన్ చేస్తున్న పోలవరం- బనకచర్ల ప్రాజెక్టుకు తాము వ్యతిరేకమని, ఈ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వవద్దని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్lను కోరారు. మంగళవారం ఢిల్లీలో కేంద్రమంత్రితో భేటీ అయిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అనంతరం విలేఖరులతో మాట్లాడారు.
45 టీఎంసీలు వెంటనే కేటాయించండి : కొంత కాలం నుంచి జల్ శక్తి మినిస్ట్రీలో తెలంగాణకు చెందిన అంశాలు పెండింగ్‌లో ఉన్నాయని, కేంద్రమంత్రిగా చొరవ చూపి వాటిని త్వరగా పరిష్కరించాలని కోరామని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వివరించారు. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌కు మొత్తం 90 టీఎంసీల నీటి కేటాయింపు అడిగామని, వాటిల్లో 45 టీఎంసీల నీటిని వెంటనే పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌కు కేటాయించాలని అడిగామన్నారు. ఈ సమావేశంలో కేంద్రమంత్రి సీఆర్ పాటిల్‌తో సహా సీడబ్ల్యూసీ ఛైర్మన్ కూడా ఉన్నారని, వారికి కూడా ఇదే విషయాన్ని చెప్పామన్నారు. ఈ అంశం మీ దగ్గరే చాలా రోజుల నుంచి పెండింగ్‌లో ఉందని చెప్పామని, పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌కు మొదటి 45 టీఎంసీల నీటిని వెంటనే కేటాయించాలని రిక్వెస్ట్ చేయడం జరిగిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.
సమ్కక్క- సారక్క ప్రాజెక్టుకు క్లియరెన్స్ ఇవ్వండి : గోదావరి జలాల్లో సమ్కక్క- సారక్క ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్‌ను సబ్మిట్ చేశామని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి చెప్పారు. సీడబ్ల్యూసీకి అనేక సందర్భాల్లో వారు అడిగిన వివరాలు ఇచ్చామని, ఇప్పటికే చాలా సమయం గడిచిపోయిందన్నారు. వీలైనంత తొందరగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని క్లియరెన్స్‌లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశామని, దాని పూర్తి వివరాలు మళ్లీ సమర్పించామన్నారు. బ్రిజేష్ ట్రిబ్యునల్ (కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్- 2) ఏపీ-తెలంగాణ మధ్య 811 టీఎంసీలను ఇరు రాష్ట్రాలకు డివైడ్ చేయాలని, దీనికి సంబంధించిన ప్రొసీడింగ్స్ కూడా చాలా స్లోగా వెళ్తున్నాయన్నారు. ఈ విషయంలో కేంద్రప్రభుత్వం చొరవ చూపి జస్టిస్ బ్రిజేష్‌ను రిక్వెస్ట్ చేసి ఈ ప్రొసీడింగ్స్‌ను వేగవంతంగా ఫైనలైజేషన్ చేయించాలని కోరామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.
పోలవరం…బనకచర్లకు మేము వ్యతిరేకం :’ఆంధ్రప్రదేశ్ పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు సంబంధించి ప్రీ ఫీజుబులిటీ రిపోర్ట్‌ను సబ్మిట్ చేసిందని, దాన్ని తాము వ్యతిరేకించామని ఉత్తమ్ కుమార్‌రెడ్డి చెప్పారు. అది చాలా స్పష్టంగా గోదావరి వాటర్ డిస్ప్యూట్ 1980 అవార్డులో ఫ్లడ్ వాటర్ కేటాయించడానికి ఎవరికీ ఎటువంటి ఆస్కారం లేదనే విషయాన్ని అప్పుడు కూడా పాయింటవుట్ చేశామని వివరించారు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు టర్మినల్ ఫేజ్ మార్చి, ప్రాజెక్టు పేరు మార్చి తిరిగి గోదావరి ఫ్లడ్ వాటర్ స్పేర్‌పై మరోసారి కేంద్రానికి వస్తున్న సందర్భంగా తాము దీనికి కూడా వ్యతిరేకం అని చెప్పామని, స్పష్టంగా, లిఖితపూర్వకంగా కేంద్ర మంత్రికి వివరించామన్నారు. ఈ ప్రాజెక్టు ఇల్లీగల్ అని స్పష్టంగా చెప్పామని, ఈ ప్రాజెక్టును మహారాష్ట్ర, కర్ణాటక కూడా వ్యతిరేకిస్తున్నాయన్నారు. ఆ రాష్ట్రాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయో కేంద్రమంత్రికి తెలియచేశామని, దీనికి కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వొద్దని చెప్పామని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
ఆల్మట్టి ఎత్తు పెంచొద్దు..ఆదేశాలు ఇవ్వండి : ఆల్మట్టి డ్యాం 519 మీటర్ల కంటే ఎత్తు పెంచవద్దని సుప్రీంకోర్టులో స్టే ఉందని, ఈ స్టే ఉండగానే కర్ణాటక ప్రభుత్వం కేబినెట్ తీర్మానం చేసి, జీవో ఇచ్చి ఎత్తు పెంచడానికి భూసేకరణ కోసం ప్రొసీడింగ్స్ ఇచ్చిందన్నారు. ఆ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చామని, ఇది చట్ట వ్యతిరేకం అని, కేంద్ర ప్రభుత్వంగా మీరు కూడా కర్ణాటక ప్రభుత్వానికి చెప్పండని విజ్ఞప్తి చేసినట్లు ఉత్తమ్‌కుమర్‌రెడ్డి తెలిపారు. ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచితే తెలంగాణ అన్యాయం జరుగుతుందని, అందుకే దీన్ని తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పామని మంత్రి వివరించారు.
ప్రాజెక్టులకు నిధులు ఇవ్వండి : గత 22 నెలల నుంచి కేంద్ర ఫండింగ్ ఇరిగేషన్ కోసం అడిగామని, ఇప్పటివరకు ఫండింగ్ ఇచ్చిన ప్రాజెక్టులను పూర్తి చేయాలని గతంలో తాను, సీఎం రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు చెప్పామని, ఆ సూచన మేరకు దేవాదుల ప్రాజెక్టు మినహా అన్ని ప్రాజెక్టులు పూర్తి చేశామన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం తాము కొన్ని ప్రాజెక్టులను లిస్టవుట్ చేశామని, వాటికి సీడబ్ల్యూసీ నుంచి ఇన్వెస్ట్‌మెంట్ క్లియరెన్స్ ఇప్పించాలని కోరినట్లు మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టు, నారాయణపేట- కొడంగల్ ప్రాజెక్టు, సీతారామ ప్రాజెక్టు, పాలమూరు -రంగారెడ్డి లిఫ్ట్, , చిన్న కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, మోదికుంట వాగు ప్రాజెక్టుల కోసం కేంద్ర ప్రభుత్వ నిధులు అడిగామనిని ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం కృష్ణా నది నీటిని ఎవరూ ఎక్కువ డైవర్ట్ చేయవద్దని, దుర్వినియోగం చేయవద్దని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి వివరించారు. దీనిపై కేఆర్‌ఎంబీకి అధికారం ఇచ్చారని, అయితే గత పదేళ్లు బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఈ అంశాన్ని పట్టించుకోలేదన్నారు. తాము వచ్చిన తర్వాత పదేపదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తాను కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి, కేఆర్‌ఎంబీకి నిధులు ఇచ్చి టెలిమెట్రీ స్టేషన్ ఇన్‌స్టాలేషన్లలో కొంత ప్రొగ్రెస్ తీసుకువచ్చామన్నారు. ఫేజ్-1 కింద 18 టెలిమెట్రీ స్టేషన్‌లు ఇన్‌స్టాల్ అయ్యాయని, ఫేజ్-2 కింద మరో 9 చేయాల్సి ఉందన్నారు. ఫేజ్-3 కింద 11 టెలిమెట్రీ స్టేషన్ ఇన్‌స్టాలేషన్ చేయాల్సి ఉందని, ఫేజ్-2, ఫేజ్-3కి సంబంధించి కేఆర్‌ఎంబీకి ఆదేశాలు ఇచ్చి వేగవంతంగా పూర్తి చేయాలని కోరినట్లు వివరించారు. అప్పుడు ఏ రాష్ట్రం ఎంత కృష్ణా నది నీటిని వాడుకుంటుందో స్పష్టంగా తెలుస్తుందని చెప్పామని, అంతర్రాష్ట్ర వివాదాలు తగ్గుతాయని కేంద్రమంత్రికి వివరించామన్నారు. వెంటనే స్పందించిన కేంద్రమంత్రి సీఆర్ పాటిల్ కేఆర్‌ఎంబీకి, ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు ఇస్తామని చెప్పారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
సీడబ్ల్యూసీ ఛైర్మన్‌తో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ
కేంద్రమంత్రి సీఆర్ పాటిల్‌తో భేటీ అనంతరం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీడబ్ల్యూసీ ఛైర్మన్‌తో సమావేశమయ్యారు. పెండింగ్‌లో ఉన్న తెలంగాణ ప్రాజెక్టుల గురించి చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు అత్యంత వెనుకబడ్డ జిల్లాలో ఉందన్నారు. 45 టీఎంసీల నీటిని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు వెంటనే కేటాయించాలని, ట్రిబ్యునల్ కేటాయింపు కోసం చూడకుండా మైనర్ ఇరిగేషన్ కోసం 45 టీఎంసీల నీరు కేటాయించాలని కోరారు. సమ్మక్క-సారక్క ప్రాజెక్టుకు టిఎసి, ఐటిసి అనుమతులు ఇవ్వాలని, తెలంగాణ -ఆంధ్రా మధ్య కృష్ణా నీటి పంపకాలు ట్రిబ్యునల్ ద్వారా త్వరగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. గోదావరి ట్రిబ్యునల్ ప్రకారం గోదావరి వరద జలాలు వినియోగం సాధ్యం కాదని, ఇదే అంశాన్ని సీడబ్ల్యూసీ ఛైర్మన్‌కి తెలిపామని వివరించారు. తెలంగాణ నీటి పారుదల రంగానికి ఎక్కువ నిధులు ఖర్చు చేసే రాష్ట్రం అని, తెలంగాణ ప్రాజెక్టులకు పిఎంకెఎస్‌వై కింద 2026 – 2031 వరకు ఆర్థిక సహకారం అందిస్తామన్నారు. టెలీ మెట్రీ స్టేషన్ల ఏర్పాటుకు ఏపీ ముందుకు రాకపోతే తామే పూర్తి నిధులు వెచ్చిస్తామని కేంద్ర మంత్రికి తెలిపామని వివరించారు. ఏపీ టెలీమెట్రీ స్టేషన్ల ఏర్పాటుకు నిధులు ఇవ్వడం లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తోపాటు ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ డాక్టర్ శశాంక్ గోయెల్, నీటిపారుదల శాఖ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.