తెలంగాణ రైజింగ్ ఉత్సవాల్లో 2047 రోడ్ మ్యాప్
అన్ని రకాల పాలసీలను ఇందులో ప్రకటిస్తాం
భవిష్యత్తుకు సిద్ధమయ్యే తెలంగాణను నిర్మిద్దాం
హ్యామ్ రహదారుల నిర్మాణంతో మారనున్న రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రం
భారీ స్థాయిలో 2047 తెలంగాణ రైజింగ్ ఉత్సవాలు
47వ ఎస్‌ఎల్ బిసి త్రైమాసిక సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
మన తెలంగాణ / హైదరాబాద్ : బ్యాంకర్లు కార్పొరేట్ సంస్థలతోపాటు స్వయం సహాయక సంఘాలు, సూక్ష్మ మధ్యతరహా, చిన్న పరిశ్రమలకు ప్రోత్సాహం అందించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కోరారు. ఈ రెండు రంగాలను ప్రోత్సహించడం ద్వారా రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉపాధి లభించడంతోపాటు సంపద సృష్టించబడుతుందని తద్వారా జిడిపి పెరుగుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 2047 తెలంగాణ రైజింగ్ ఉత్సవాలను డిసెంబర్ 8, 9 తేదీల్లో నిర్వహించనుంది. ఇందులో అన్ని రకాల పాలసీలను ప్రకటిస్తామని ఈ కార్యక్రమంలో బ్యాంకర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని భాగస్వాములు కావాలని డిప్యూటీ సీఎం పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్ బేగంపేటలో నిర్వహించిన బ్యాంకర్స్ 47వ త్రైమాసిక సమావేశంలో ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. మూడు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా 13 శాతం జీడీపీ పెరుగుదల టార్గెట్ గా 2047 రోడ్ మ్యాప్ ను విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం 10 శాతం చొప్పున పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని నాణ్యమైన విద్యుత్తు సరఫరా లక్ష్యాన్ని సాధిస్తామని తెలిపారు. మొదటి సంవత్సరం ప్రభుత్వం ఏ కార్యక్రమాలు చేసిందో వివరించారు. రెండో సంవత్సరం చేసిన కార్యక్రమాలు వివరించడంతోపాటు రాష్ట్రం పట్ల మా కల ఏంటి, ఆ కలను సాధించేందుకు ఎలాంటి ప్రణాళికలతో ముందుకు పోతున్నామనేది తెలంగాణ రైజింగ్ ఉత్సవంలో వివరించబోతున్నామని తెలిపారు. రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం, రీజినల్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డును కలుపుతూ అనేక ఇండస్ట్రియల్ కారిడార్ల నిర్మాణం, మూసీ పునర్జీవం వంటి అంశాలను వివరించి ప్రపంచవ్యాప్తంగా వస్తున్న పెట్టుబడి దారులను ఆకర్షించబోతున్నామని తెలిపారు. హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యూహాత్మకంగా, వాతావరణం, భాష, భూమి, తక్కువ ధరలకే నైపుణ్యంతో కూడిన మానవ వనరులు, బలమైన విద్యుత్ సరఫరా వ్యవస్థ వంటి అంశాలను వివరించి పెట్టుబడిదారులను ఆకర్షించినట్లు తెలిపారు.
విద్య, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి : రాష్ట్ర ప్రభుత్వం విద్య, ఆరోగ్యం అంశాలపై ప్రధానంగా దృష్టి సారించిందని బ్యాంకర్లు సిఎస్‌ఆర్ నిధులను చీఫ్ సెక్రటరీ మొదలు కలెక్టర్ వరకు, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీని సంప్రదించి ఈ రంగాల్లో నిధులను ఖర్చు చేయాలని సూచించారు. విద్యను ప్రోత్సహించేందుకు మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు, డిజిటలైజ్ ఎడ్యుకేషన్ అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు పోతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణ ఇప్పుడు కీలకమైన అభివృద్ధి దశలో ప్రవేశిస్తోందని, ఈ పరివర్తనలో బ్యాంకింగ్ రంగం ముందు వరుసలో ఉండాలని డిప్యూటీ సీఎం కోరారు. బ్యాంకులు ఈ ఏడాది తొలి అర్ధభాగంలో 49.45% ప్రాధాన్య రంగ రుణాలను సాధించాయి. క్రెడిట్-డిపాజిట్ నిష్పత్తి 130.18%గా ఉండటం తెలంగాణ ఆర్థిక ప్రయాణంపై ఉన్న విశ్వాసాన్ని స్పష్టంగా చూపిస్తుందనీ తెలిపారు. ఈ వేగం ప్రోత్సాహకరం, కానీ ఇదే సమయంలో మనం మరింత ఎత్తుకు చేరే బాధ్యత కూడా మనపై ఉందని గుర్తు చేశారు. వ్యవసాయ మౌలిక వసతుల నిధి కింద మంచి పురోగతి సాధించామని, తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నిజంగా మార్పు చేయాలంటే పంట కోత తర్వాత మౌలిక సదుపాయాలు, ప్రాసెసింగ్ యూనిట్లు, సూక్ష్మ పంట నీరు, మరియు అనుబంధ రంగాల్లో బ్యాంకు రుణాలను మరింతగా పెంచాని బ్యాంకర్లకు సూచించారు. పంట రుణాలు సమర్థవంతంగా అందుతున్నప్పటికీ, వ్యవసాయ టర్మ్ లెండింగ్ అవసరానికి తగ్గట్లు లేదన్నారు. ఇది రైతులు ఆధునీకరించుకోవడం, వైవిధ్యం చేర్చుకోవడం, ఆత్మనిర్భర స్థాయి నుంచి సంపన్న స్థాయికి చేరడం సహాయపడదని డిప్యూటీ సీఎం అభిప్రాయపడ్డారు. ఈ లోటును బ్యాంకులు అత్యవసరంగా భర్తీ చేయాలని కోరుతున్నానన్నారు.
విభిన్న పంటలకు బ్యాంకులు మద్దతు ఇవ్వాలి : తెలంగాణలో వరి ఉత్పత్తి అద్భుతం అని, కానీ ఇప్పుడు పరిమాణం నుంచి విలువ వైపు అడుగులు వేయాలన్నారు. భవిష్యత్ ఆదాయాలను భద్రపరిచే పామాయిల్ తో పాటు ఇతర విభిన్న పంటలకు బ్యాంకులు ఎక్కువ మద్దతు ఇవ్వాలని కోరుతున్నానన్నారు. మహిళా సంఘాల సభ్యులు కేవలం లబ్ధిదారులు మాత్రమే కాదని, వారు ఇప్పుడు వ్యాపారవేత్తలుగా, సంస్థల నాయకులుగా ఎదుగుతున్నారన్నారు. అయితే కొన్ని జిల్లాల్లో ఇంకా ఎస్‌హెచ్‌జీ రుణాలు తమ పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవడం లేదని, మహిళలు తమ ఆర్థిక కార్యకలాపాలను విస్తరించేందుకు ఎక్కువ పరిమితులు, వేగవంతమైన రీపీట్ ఫైనాన్స్ అందించాన్నారు. ఇందిరా మహిళా శక్తి పథకం ఒక శక్తివంతమైన వేదిక అని, దీనిని పూర్తిస్థాయిలో వినియోగించి మహిళా ఆధారిత ఆర్థిక మార్పును వేగవంతం చేయాలని బ్యాంకులను కోరుతున్నానన్నారు. ఎంఎస్‌ఎంఈలు తెలంగాణలో ఉపాధి, ఆవిష్కరణలకు వెన్నెముకగా నిలుస్తున్నాయని ఇప్పటివరకు ఎంఎస్‌ఎంఈల కోసం ఏసీపీ లక్ష్యాలలో 50.23 శాతం సాధించినప్పటికీ, వర్కింగ్ క్యాపిటల్ కొరతలు, రుణాల ప్రక్రియలో ఆలస్యం వల్ల సంస్థలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని డిప్యూటీ సీఎం అభిప్రాయపడ్డారు. సీజిటిఎంఎస్‌ఈ, డిజిటల్ అసెస్‌మెంట్ పద్ధతులను మరింతగా వినియోగించి, క్లస్టర్ ఆధారిత రుణ వ్యూహాలను అనుసరించాలని కోరుతున్నానని చెప్పారు. భరోసాతో కూడిన, బలమైన ఎంఎస్‌ఎంఈ వ్యవస్థ వచ్చే దశాబ్దం తెలంగాణ రైజింగ్‌కు పునాది అని బ్యాంకర్లకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వివరించారు.
వచ్చే దశాబ్దం తెలంగాణ రైజింగ్‌కు పునాది : 13,000 కిలోమీటర్ల అంతర్గత రహదారుల నిర్మాణం, ఒక రూపాంతర కార్యక్రమం ప్రస్తుతం జరుగుతోందని భట్టి వివరించారు. ఇది రాష్ట్ర ఆర్థిక పటాన్ని సమూలంగా మారుస్తుందని, దీనిని బ్యాంకులు ప్రాధాన్య రంగ రుణ అవకాశంగా చూడాలని కోరుతున్నానన్నారు. ప్రస్తుతం మౌలిక వసతుల ఫైనాన్సింగ్‌లో పాల్గొనడం రాష్ట్ర అవసరాలకు సరిపడడం లేదని, తెలంగాణ అభివృద్ధిలో తన నేతృత్వాన్ని కొనసాగించాలంటే బ్యాంకులు ఇక్కడ మరింత బలమైన పాత్ర వహించాలని సూచించారు. ప్రధానంగా పీఎంజెడీవై శాతం, బీమా కవరేజ్, గ్రామ పంచాయతీల్లో బీసీల లభ్యత వంటి అంశాలను వివరించారు. ఈ లోటును వేగంగా భర్తీ చేయాలని డిప్యూటీ సీఎం బ్యాంకర్లను కోరారు. డిజిటల్ పేమెంట్ వ్యవస్థల్లో ఆన్‌బోర్డింగ్‌ను వేగవంతం చేసి, చివరి మైలు డెలివరీని బలోపేతం చేయాలని కోరుతున్నానని, తెలంగాణ రైజింగ్ సమ్మిట్‌కు రాష్ట్రం సిద్ధమవుతోందని, మన దృష్టి, రాబోయే దశాబ్దానికి గాను రోడ్‌మ్యాప్‌ను ప్రపంచానికి పరిచయం చేయబోతున్నామన్నారు. గ్రామీణ పరివర్తనం, బలమైన ఎంఎస్‌ఎంఈ క్లస్టర్లు, అధిక విలువ కలిగిన తయారీ, డిజిటల్ పరిపాలన, గ్రీన్ గ్రోత్ ఇవి తదుపరి దశకు దారి తీసే రంగాలని వివరించారు. దీని కోసం బ్యాంకులు లావాదేవీ విధానం నుంచి రూపాంతరక భాగస్వామ్యం వైపు మారాలి. తెలంగాణ స్థిరత్వం, ఆశయం, అవకాశాలను అందిస్తోంది అని వివరించారు. ఈ ఆశయానికి తగినంత ధైర్యవంతమైన క్రెడిట్ విస్తరణ, నవీన ఆర్థిక పరిష్కారాలతో మనం సిద్ధంగా ఉన్నామా అనేది ప్రధానమన్నారు. ఆత్మవిశ్వాసం, సమిష్టి కర్తవ్యంతో ఒక ఆధునిక, సమగ్ర, భవిష్యత్ సిద్ధ తెలంగాణను నిర్మిద్దామిని, తదుపరి దశాబ్దాన్ని తెలంగాణ చరిత్రలో అత్యంత రూపాంతరక కాలంగా మలుద్దామని డిప్యూటీ సీఎం పిలుపునిచ్చారు.