మారేడుమిల్లి: ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఈ కాల్పుల్లో ఆరుగురు మావోలు హతమయ్యారు. మృతుల్లో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు మద్వి హిడ్మా, ఆయన భార్య రాజీ, అనుచరులు ఉన్నారు. గెరిల్లా దాడుల వ్యూహకర్తగా పేరొందిన హిడ్మా అలియాస్ సంతోష్‌పై రూ.6 కోట్ల వరకు పలు రాష్ట్రాలు రికార్డు ప్రకటించాయి.
ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా పూర్వాటి గ్రామంలో హిడ్మా జన్మించారు. బస్తర్ ప్రాంతంలో దళంలో కీలక సభ్యుడిగా ఎదిగారు. చిన్న వయసులోనే మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు అయ్యారు. పీపుల్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ కమాండర్‌గా, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగానూ పని చేశారు.
కాగా, మంగళవారం ఉదయం 6 గంటల నుంచి అటవీ ప్రాంతంలో కూంబింగ్ జరుగుతుందని ఎపి డిజిపి హరీశ్‌కుమార్ గుప్తా తెలిపారు. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలపై సమాచారం అందిన నేపథ్యంలో కూంబింగ్ నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఛత్తీస్‌గడ్‌లోని సుక్మా జిల్లాలోనూ ఎదురుకాల్పులు జరిగాయి. మంగళవారం ఎర్రబోరు ప్రాంతంలో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య జరిగిన కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందాడు.