పైరసీ పెనుభూతంగా మారి భారతీయ సినీ పరిశ్రమను కబళిస్తోంది. వందల కోట్లు పెట్టుబడి పెట్టి, వందలాది మంది టెక్నీషియన్లతో కొన్ని నెలలపాటు తీసే సినిమా, థియేటర్లలో విడుదలైన రెండు మూడు గంటల్లోనే ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమవుతోంది. హాలీవుడ్ తర్వాత బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ తదితర పేర్లతో పిలుచుకునే భారతీయ సినీ పరిశ్రమే ప్రపంచంలో అతి పెద్దది. ఇక్కడ రూపొందిస్తున్న సినిమాలు అమెరికా, జర్మనీ, చైనా, జపాన్ వంటి దేశాల్లో అమోఘమైన ప్రేక్షకాదరణ పొందుతున్నాయి. అయితే, పైరసీ మహమ్మారి కారణంగా భారతీయ చిత్ర పరిశ్రమకు ఏటా కొన్ని వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోంది. ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఎర్నెస్ట్-యంగ్ సంస్థలు ఆ మధ్య సంయుక్తంగా నిర్వహించిన ఓ సర్వేలో భారతీయ సినీ పరిశ్రమకు పైరసీ కారణంగా 2023వ సంవత్సరంలో ఒనగూడిన నష్టం అక్షరాలా 22,400 కోట్ల రూపాయలని తేలింది. ఇటీవల ఓ భారీ తెలుగు చిత్రం విడుదలైన రెండు రోజుల్లోనే ఆర్‌టిసి బస్సులో ప్రసారమైన సంఘటన పైరసీ పెనుభూతం గ్రామీణ స్థాయికి సైతం ఎంతలా పాకిందో తెలియజెప్పడానికి ఉదాహరణ.
ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గత కొన్ని నెలల్లో అనేకమంది పైరసీదారుల ఆటకట్టించారు.అందులో చెప్పుకోదగినది తాజాగా ఐ బొమ్మ పేరిట సాగుతున్న పైరసీదారుణ్ని కటకటాల వెనక్కి నెట్టడం. కరేబియన్ దీవుల్లో తిష్టవేసుకు కూర్చుని, వచ్చిన సినిమాను వచ్చినట్లుగా పైరసీ చేసి, ఆన్‌లైన్‌లో పెడుతున్న ఐ బొమ్మ నిర్వాహకుడు విద్యాధికుడు. ఇంజినీరింగ్, ఎంబిఎ పట్టాలు తీసుకుని, రెండు కంపెనీలకు సిఇఒగా పనిచేసిన ఈ ప్రబుద్ధుడు ఈజీ మనీకి ఆశపడి, సినిమాల పైరసీకి శ్రీకారం చుట్టడం ఆశ్చర్యం గొలిపే విషయం. వందకు పైగా డొమైన్లతో, ప్రాక్సీ సర్వర్ల ద్వారా వేలాది సినిమాలను ఇతను పైరసీ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఔపోసన పట్టిన ఇలాంటివారు తమ తెలివితేటలను అక్రమార్జనకు వినియోగిస్తున్నారు. నిర్మాతలు లేదా పంపిణీదారులనుంచి థియేటర్లకు చేరే సినిమా ‘కీ’ని బగ్ హంటింగ్, బర్ఫ్ స్యూట్ వంటి టెక్నాలజీల సాయంతో కాజేస్తున్నట్లు ఆ మధ్య బీహార్ కు చెందిన ఓ పైరసీదారు వెల్లడించడం ఐటి నిపుణులను సైతం ఆశ్చర్యానికి లోను చేసింది.
పైరసీదారులకు మూడేళ్ల కారాగారం, సినిమా నిర్మాణ వ్యయంలో ఐదు శాతం జరిమానా విధించేందుకు వీలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టాలను సవరించినా పైరసీదారులకు ముకుతాడు పడకపోవడానికి కారణం.. విదేశాలనుంచి తమ కార్యకలాపాలు నిర్వహిస్తూ, భారతీయ చట్టాలకు దొరకకుండా తప్పించుకుంటూ ఉండటమే. ‘మమ్మల్ని మీరేం చేయలేరు’ అంటూ ఐ బొమ్మ నిర్వాహకుడు అంత ధైర్యంగా మన పోలీసులకు సవాల్ విసరడం వెనుక విదేశాలలో ఉన్న తనను ఏమీ చేయలేరనే ధైర్యమే కారణం. అతను హైదరాబాద్‌కు రాకపోయి ఉంటే, మన పోలీసులు పట్టుకోగలిగేవారేనా అనేది ప్రశ్నార్థకం. సైబర్ నేరాలను అరికట్టేందుకు ప్రపంచ దేశాల మధ్య సయోధ్య కొరవడటం వల్లే ఇలాంటి పైరసీదారులు పేట్రేగిపోతున్నారు. తమ వెబ్‌సైట్లకు గేమింగ్, బెట్టింగ్ యాప్‌ల ద్వారా వచ్చే ప్రకటనలే వీరికి కాసులు కురిపిస్తున్నాయి. ఈ వెబ్‌సైట్లలో సినిమాలు చూస్తున్న అమాయక జనం, ఇలాంటి యాప్‌ల ప్రభావానికి లోనవుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలడం మరింత ఆందోళన కలిగించే అంశం.
ఒకరిద్దరి అరెస్టులతో పైరసీ పెనుభూతం మటుమాయమవుతుందని భావించడం హాస్యాస్పదం. పైరసీ సినిమాలకు ప్రేక్షకాదరణ ఎందుకుంటోందని సినీ పరిశ్రమ పెద్దలు ఆత్మవిమర్శ చేసుకోవలసిన సమయమిది. ఐ బొమ్మ వెబ్‌సైట్‌లో నెలకు 35 లక్షలమంది పైరసీ సినిమాలు చూస్తున్నారంటే అందుకు కారణమేమిటి? పేదవాడికి అందుబాటులో ఉండే వినోద సాధనం సినిమా. ప్రస్తుత పరిస్థితుల్లో అది అందని ద్రాక్షగా మారుతోంది. రిలీజైన రోజే సినిమా చూడాలంటే నలుగురు సభ్యులుగల కుటుంబం పదిహేను వందలనుంచి రెండువేల రూపాయల వరకూ ఖర్చు చేయాల్సిన పరిస్థితి. ఇక థియేటర్‌లో తినుబండారాల ధరల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. పైరసీని అరికట్టడం గురించి తలలుబద్దలు కొట్టుకుంటున్న సినీపెద్దలు చిత్ర నిర్మాణ వ్యయాన్ని తగ్గించుకోవడంతోపాటు, టికెట్ రేట్లు సగటు ప్రేక్షకుడికి అందుబాటులో ఉంచితే సెల్ ఫోన్‌లో పైరసీ సినిమా చూసే బదులు సగటు మనిషి వెండితెరపై సలక్షణంగా సిసలైన సినిమానే చూస్తాడనడంలో సందేహం అక్కర్లేదు.