పోటాపోటీగా ప్రచారం జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గెలిచింది. గెలుపు అనంతరం సహజంగానే కాంగ్రెస్ పార్టీ సంబరాల్లో మునిగిపోగా, ఓడిపోయిన బిఆర్‌ఎస్ పార్టీలో నిరాశ అలుముకొంది. ఎన్నికల్లో గెలుపోటములు సహజం. ఏదేమైనా జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ఫలితం అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీలైన బిఆర్‌ఎస్, బిజెపిలకు ఒక సందేశాన్ని ఇచ్చాయి. భవిష్యత్‌లో రాష్ట్రంలో ఏ పార్టీ ఎలాంటి పాత్ర పోషించాలో స్పష్టత ఇచ్చాయి. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో గెలుపుతో కాంగ్రెస్‌కు రాష్ట్రంలో ఇక తిరుగులేదనే వాతావరణం లేదు. ప్రధాన ప్రతిపక్షం బిఆర్‌ఎస్ చతికిలపడాల్సిన అవసరం లేదు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం రాష్ట్రంలో జరిగిన పలు ఉప ఎన్నికల్లో గెలిచిన పార్టీ తర్వాత ఎలాంటి ఫలితాలు సాధించిందో పరిశీలిస్తే ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూశాయి.తెలంగాణలో ఉపఎన్నికల్లో గెలిచిన పార్టీ తర్వాత జరిగిన సాధారణ ఎన్నికల్లో పరాజయం పొందినట్టు మెజారిటీ ఫలితాల్లో స్పష్టమైంది. ఉపఎన్నికల తీరును గమనిస్తే గతంలో కెసిఆర్ సర్కార్, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒకే బాటలో ప్రయాణిస్తున్నట్టే ఉంది.
ఉపఎన్నికల్లో గెలవగానే పూర్తి ప్రజామోదం లభించనట్టు కాదని గత ఉప ఎన్నికలు, తర్వాత జరగిన జనరల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను చూస్తే అర్థమవుతోంది. ‘ఇల్లు అలుకగానే పండుగా కాదు’ అనే సామెత గతంలో బిఆర్‌ఎస్‌కు, ఇప్పుడు కాంగ్రెస్‌కు వర్తిస్తుంది. జూబ్లీహిల్స్‌లో గెలిచినంతమాత్రాన ఆరు గ్యారెంటీలను అసంపూర్తిగా అమలుచేసినా ప్రజలు గెలిపించారని కాంగ్రెస్ భావిస్తే పప్పులో కాలేసినట్టే. మహిళలకు నెలకు రూ. 2500 పంపిణీ, పెంచుతామన్న చేయూత పింఛన్లు, ఆటోడ్రైవర్లకు ఏడాదికి రూ. 12000 వంటి హామీలు అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెరగడం ఖాయం. గతంలో కెసిఆర్ కూడా ఉపఎన్నికల్లో ఇచ్చిన పలు హామీలను పూర్తిగా అమలు చేయలేకపోవడంతో అనంతరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పొందినట్టు చరిత్రే చెబుతుంది.
ఉపఎన్నికల్లో గెలుపోటములకు పలు కారణాలుంటాయి. అధికారంలో ఉండే పార్టీకి సామ, దాన, భేద, దండోపాయాలను ఉపయోగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇదే సందర్భంలో అధికార పార్టీ అత్యుత్సాహం ప్రదర్శిస్తే కొన్నిసార్లు ఫలితం పూర్తిగా తిరగబడిన దాఖలాలున్నాయి. తెలంగాణలో జూబ్లీహిల్స్ కంటే ముందు జరిగిన ఎనిమిది ఉపఎన్నికల్లోనూ ఇలాంటి పరిణామాలతోనే ఫలితాలు వెలువడ్డాయి. ఆరుసార్లు అధికార పార్టీ గెలవగా, రెండు సార్లు ప్రతిపక్షం గెలిచింది. అధికారంలో పార్టీ ఉప ఎన్నికలను ప్రతిష్ఠగా తీసుకొని పెద్దఎత్తున మంత్రులను, ఇతర ప్రజాప్రతినిధులను క్షేత్రస్థాయిలో దింపడంతోపాటు పలు హామీలిచ్చి గెలిచే అవకాశాలుంటాయి. సాధారణ ఎన్నికల్లో పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. ప్రజాప్రతినిధులకు ఎవరి నియోజకవర్గం వారికే ప్రాధాన్యతవుతుంది. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికల్లో పెట్టినంత ప్రత్యేక దృష్టి సాధారణ ఎన్నికల్లో పెట్టడం సాధ్యం కాదని గత ఎన్నికల ఫలితాలే నిరూపిస్తున్నాయి.
పాలేరు నియోజకవర్గానికి 2016లో జరిగిన ఉపఎన్నికల్లో మంత్రి హోదాలో బిఆర్‌ఎస్ తరఫున పోటీచేసిన తుమ్మల నాగేశ్వరరావు 26 శాతం ఓట్ల తేడాతో కాంగ్రెస్‌పై గెలిచి, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ చేతిలో 3% ఓట్ల తేడాతో ఓడిపోయారు. నారాయణఖేడ్‌లో సిట్టింగ్ కాంగ్రెస్ ఎంఎల్‌ఎ పి. కిష్టారెడ్డి మృతితో 2016లో జరిగిన ఉప ఎన్నికల్లో బిఆర్‌ఎస్ తరఫున పోటీ చేసిన మహేంద్‌రెడ్డి 34.63% ఓట్లతేడాతో గెలిచారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్‌నగర్ నుండి గెలిచిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 2019లో నల్గొండ ఎంపిగా గెలవడంతో ఎంఎల్‌ఎ పదవికి రావడంతో ఉపఎన్నిక అనివార్యమైంది. ఇక్కడ 2019లో జరిగిన ఉప ఎన్నికల్లో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సతీమణి పద్మావతిరెడ్డి కాంగ్రెస్ తరఫున పోటీ చేయగా అధికార బిఆర్‌ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి చేతిలో 21.65 శాతం ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సైదిరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేతిలో 20.85 శాతం ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2020లో దుబ్బాక ఉపఎన్నికల్లో బిజెపి తరఫున పోటీచేసిన రఘునందన్ రావు కేవలం 0.65 శాతం ఓట్ల తేడాతో గెలిచినా, 2023 సాధారణ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ చేతిలో 30.62 శాతం ఓట్లతో ఓడిపోయారు.
ఈటల రాజేందర్ బిఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి బిజెపిలో చేరడంతో 2021లో జరిగిన హుజురాబాద్ ఉపఎన్నికల్లో బిజెపి తరఫున ఈటల రాజేందర్ 11.58 శాతం ఓట్ల తేడాతో బిఆర్‌ఎస్‌పై గెలిచి, 2023 సాధారణ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ చేతిలో 8.06 శాతం ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2021 నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో బిఆర్‌ఎస్ తరఫున నోముల భగత్ 9.88 శాతం ఓట్ల తేడాతో గెలిచి, 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ చేతిలో 27.64% ఓట్ల తేడాతో ఓడిపోయారు. కాంగ్రెస్ ఎంఎల్‌ఎ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆ పార్టీకి రాజీనామ చేసి బిజెపిలో చేరడంతో 2022లో జరిగిన మునుగోడు ఉపఎన్నికల్లో బిఆర్‌ఎస్ గెలచింది. బిజెపి తరఫున పోటీ చేసిన రాజగోపాల్ రెడ్డి బిఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చేతిలో 4.57%ఓట్ల తేడాతో ఓడిపోయారు. రాజగోపాల్‌రెడ్డి తిరిగి కాంగ్రెస్‌లో చేరి 2023 ఎన్నికల్లో బిఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిపై 17.38 శాతం ఓట్ల తేడాతో గెలిచారు. 2025 జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ బిఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై 12.7 శాతం ఓట్ల తేడాతో గెలిచారు. హుజూర్‌గర్, హుజురాబాద్, మునుగోడులో మారిన రాజకీయ కారణాల నేపథ్యంలో ఉప ఎన్నికలు జరగ్గా, పాలేరు, నారాయణఖేడ్, దుబ్బాక, నాగర్జునసాగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లో సిట్టింగ్ అభ్యర్థుల మరణంతో ఉపఎన్నికలు జరిగాయి.
రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ గెలిచింది. ఇక్కడ 2023 ఎన్నికల్లో బిఆర్‌ఎస్ అభ్యర్థి లాస్య నందిత 13.88 శాతం ఓట్లతో బిజెపి అభ్యర్థి శ్రీగణేశ్‌పై గెలిచిన అనంతరం మూడు నెలల వ్యవధిలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో 2024లో లోక్‌సభ ఎన్నికలతో పాటు ఈ అసెంబ్లీ సెగ్మంట్‌కు కూడా ఉప ఎన్నికలు జరిగాయి. 2023లో ఇక్కడ బిజెపి నుండి పోటీ చేసి ఓడిపోయిన శ్రీగణేష్ కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగి 2024 ఉప ఎన్నికల్లో 10.06 శాతం ఓట్ల తేడాతో బిజెపిపై గెలిచారు. 2023లో గెలిచిన బిఆర్‌ఎస్ మూడో స్థానానికే పరిమితమైంది.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనం అనంతరం తెలంగాణలోనే కాదు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉపఎన్నికల ఫలితాలు ఆసక్తికరంగానే ఉన్నాయి. నంద్యాలలో 2014లో వైఎస్‌ఆర్‌సిపి నుండి గెలిచిన భూమా నాగిరెడ్డి అనంతరం అధికార టిడిపిలో చేరాక అకాల మరణం పొందారు. ఇక్కడ 2017లో జరిగిన ఉప ఎన్నికల్లో నాగిరెడ్డి సోదరుడి కుమారుడు భూమా బ్రహ్మానందరెడ్డి టిడిపి నుండి పోటీ చేసి వైఎస్‌ఆర్‌సిపిపై 15.86 ఓట్ల శాతం తేడాతో గెలిచారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో నంద్యాలలో బ్రహ్మానంద రెడ్డి వైఎస్‌ఆర్‌సిపి చేతిలో 17.50 శతం ఓట్లతో తేడాతో ఓడిపోయారు. ఆత్మకూరులో 2022 ఉప ఎన్నికల్లో గెలిచిన అధికార వైఎస్‌ఆర్‌సిపి 2024లో ఓడిపోయింది. ఇటీవల పులివెందులలో జరిగిన జెడ్‌పిటిసి ఎన్నికలు అధికార పార్టీకి అనుకూలంగా ఎలా జరిగియో బహిరంగ రహస్యమే.
బిజెపి నేతల ప్రచారం శైలి కూడా తమ పార్టీ కంటే ఇతర పార్టీలకు మేలు చేసేదిగానే జరిగింది. కేంద్రమంత్రి బండిసంజయ్ ప్రచారం చివరి దశలో ముస్లిం మైనారిటీల లక్ష్యంగా చేసుకొని రేవంత్‌రెడ్డిని విమర్శిస్తూ ప్రసంగాలు చేయడంతో ముస్లిం ఓటు బ్యాంకు సంఘటితమై భారీగా కాంగ్రెస్ పార్టీ వైపు మళ్లింది. ఎపిలో టిడిపి, జనసేన, బిజెపి ఒకే కూటమిలో ఉన్నా జూబ్లీహిల్స్ లో టిడిపి బహిరంగంగా బిజెపికి మద్దతు ప్రకటించలేదు. జనసేన కూడా సంపూర్ణంగా బిజెపి కోసం పని చేయలేదు. సెటిలర్లు ముఖ్యంగా కమ్మ సామాజికవర్గం ఎక్కువగా ఉండే జూబ్లీహిల్స్‌లో టిడిపికి బలమైన ఓటు బ్యాంక్ ఉంది. ఉప ఎన్నికల్లో ఈ ఓటు బ్యాంకు చంద్రబాబు, రేవంత్ రెడ్డి మధ్య ఉన్న అనుబంధంతో కాంగ్రెస్ వైపు మళ్లింది. జూబ్లీహిల్స్‌లో 2023 శాసనసభ ఎన్నికలతో 2025 ఉప ఎన్నికల ఫలితాలను పోలిస్తే.. 2023లో బిఆర్‌ఎస్ 43.94 శాతం ఓట్లు పొందితే 2025లో 38.13 శాతం, కాంగ్రెస్ 2023లో 35.03% పొందితే, 2025లో 50.83%, బిజెపి 2023లో 14.11 శాతం పొందితే 2025లో 8.76 శాతం ఓట్లు సాధించారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో జూబీహిల్స్ సెగ్మంట్‌లో 36.64 శాతం సాధించిన బిజెపి ఇప్పుడు ఉపఎన్నికల్లో కేవలం 8.76% ఓట్లే పొందింది. బిఆర్‌ఎస్ విషయానికొస్తే 2024లో 10.42 శాతం ఓట్లే పొందిన ఆ పార్టీ ఉప ఎన్నికల్లో 38.13 శాతం ఓట్లు సాధించింది.
అంటే లోక్‌సభ ఎన్నికల్లో బిజెపికి పడ్డ ఓట్లు ఇప్పుడు దాదాపు బిఆర్‌ఎస్ పార్టీకి బదిలీ అయ్యాయి. అంటే జూబ్లీహిల్స్‌లో 2023లో గెలిచిన బిఆర్‌ఎస్ అక్కడ మళ్లీ పుంజుకుందని తేలింది. మాగంటి గోపినాథ్ అకాల మరణం తర్వాత కూడా బిఆర్‌ఎస్‌కు ఉన్న ఆ ఓటు బ్యాంకు చెక్కుచెదరలేదని స్పష్టమైంది. కాంగ్రెస్ పార్టీ 2024 పార్లమెంట్ ఎన్నికల్లో సాధించిన 50.83 శాతం ఓట్లను ఉప ఎన్నికల్లోనూ నిలబెట్టుకుంది. ఈ పార్టీకి వచ్చి ఓట్లను పరిశీలిస్తే జూబ్లీహిల్స్ సెగ్మంట్‌లో నిర్ణయాత్మకంగా ఉన్న మైనారిటీ ఓటర్లు పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చి ఇప్పుడు ఉపఎన్నికల్లో కూడా బిజెపి చేసిన ముస్లిం వ్యతిరేక ప్రచారంతో అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి కాంగ్రెస్‌కే ఓటు వేశారు.తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా ఉప ఎన్నికలు భారీ వ్యయంతో కూడుకున్న ఎన్నికలుగా మారుతున్నాయి. అధికారంలో ఉన్నవారు ఇతర ప్రతిపక్షాల కంటే అధికంగా ఖర్చు చేస్తున్నారు. గత ఉప ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు జూబ్లీహిల్స్‌లో పార్టీలు మరింత అధికంగా రూ. 200 కోట్లకు పైగా ఖర్చు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. భారీ ఖర్చుతో కూడుకున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ఫలితాలను లోతుగా గమనిస్తే గెలిచిన కాంగ్రెస్‌కు ఇది బలం కాదు వాపు మాత్రమే అని చెప్పవచ్చు.
ఎన్నికల షెడ్యూల్ ముందే మంత్రులకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో డివిజన్ల వారీగా అభివృద్ధి బాధ్యతలను అప్పగించి హడావుడిగా పనులు ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ మంత్రులను, ఎంఎల్‌ఎలను, ఎంపిలను, ఇతర ప్రజాప్రతినిధులను నియోజకవర్గంలో పగలు రాత్రి మోహరించి పలు హామీలు ఇచ్చింది. కాంగ్రెస్ వారికి ఎంఐఎం ఎంఎల్‌ఎలు, ఎంపి, ఇతర ప్రజాప్రతినిధులు కూడా తోడయ్యి భారీ హామీలిచ్చారు. వాటినన్నింటినీ పూర్తి చేయాల్సిన బాధ్యత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉంది.జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను కాంగ్రెస్, బిఆర్‌ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని నువ్వానేనా అన్నట్టు తలపడ్డాయి. ఒకానొక దశలోబిఆర్‌ఎస్ దూసుకుపోతుందనే వార్తలొచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా మంత్రులందరూ వీధివీధిన ప్రచారం నిర్వహించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. మైనారిటీ ఓట్ల మీద దృష్టి పెట్టి ఆగమేఘాల మీద అజారుద్దీన్‌కు మంత్రి పదవి కట్టబెట్టారు. ఉద్యోగులకు డిఎ ప్రకటించారు. మరోవైపు బిఆర్‌ఎస్ ప్రజాక్షేత్రం కంటే సోషల్ మీడియాపై అధికంగా ఆధారపడి చేతులు కాల్చుకుంది. ఒకవేళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలను తమ ప్రభుత్వ పనితీరుకు కొలమానమని విశ్వసిస్తే పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఎన్నికలకు వెళ్లగలదా..? అప్పుడు జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీ బలానికి నిదర్శనమా..? లేదా ఇది కేవలం తాత్కాలిక వాపా..? అని తేలుతుంది. మొత్తం మీద జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ఫలితాలు అన్ని పార్టీలకు ఒక గుణపాఠంగా నిలుస్తాయనడంలో సందేహం లేదు.
– తోపుచర్ల నిఖిల్