మన తెలంగాణ/హైదరాబాద్: సౌదీ అరేబియాలో విషాద ఘటన చోటు చేసుకుంది. సోమవారం తెల్లవారుజామున దాదాపు 1.30 గంటలకు హైదరాబాద్ యాత్రికులు వెళ్తున్న బస్సు, డీజిల్ ట్యాంకరుని ఢీకొంది. మక్కా నుంచి మదీనాకు వెళుతున్న యాత్రికుల బస్సు ప్రమాదంలో 45 మంది సజీవదహనయ్యారు. మదీనాకు 25 కిలోమీటర్ల దూరం లో ఈ బస్సు చమురు ట్యాంకర్‌ను ఢీకొంది. వీరి లో 18మంది మహిళలు, 17మంది పురుషు లు, 10మంది చిన్నారులు ఉన్నారు. ప్రమాద సమయంలో యాత్రికులంతా నిద్రలో ఉండటంతో మృ తుల సంఖ్య ఎక్కువగా 45కు చేరిందని చెబుతున్నారు. బస్సులో ఉన్న వారందరూ హైదరాబాద్‌కు చెందినవారు. సిటి నుంచి 54మంది మక్కా యాత్ర కు వెళ్లగా అందులో 46మంది బస్సులో మక్కా నుంచి మదీనాకు వెళ్లి వస్తుండగా వీరు ప్రయాణిస్తున్న బస్సు డీజిల్ ట్యాంకర్ ఢీకొనడంతో తీవ్ర విషాదం నెల కొంది. బస్సులో మంటలు చెలరేగి క్షణాల్లో మొత్తం వ్యాపించడంతో ఒక్కరు మినహా 45 మంది సజీవ దహనం అయ్యారు. బాధితుల శవాలు కాలిపోయి గుర్తించలేని స్థితిలో ఉన్నాయి. డ్రైవర్ పక్కనే కూర్చొని ఉండటం వల్ల షోయబ్ గాయా లతో బయటపడ్డాడని అధికారులు వెల్లడిం చారు. ప్రస్తుతం సౌదీ జర్మన్ హాస్పిటల్ ఐసియులో చికిత్స పొందుతున్న అతడి పరిస్థితి నిలకడగా ఉంది.
అతడి కుటుంబం హైదరాబాద్‌లో ఆందోళనలో ఉంది. రియాద్ భారత రాయబారి కార్యాలయం, జెద్దా కాన్సులేట్ పూర్తి సహాయం అందిస్తోంది. జెద్దా కాన్సులేట్‌లో 24×7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు, టోల్‌ఫ్రీ నంబర్ 8002440003 అందుబాటులో ఉంది. చనిపోయి నవారి మృతదేహాలు గుర్తింపు కోసం డిఎన్‌ఎ టెస్టులు జరిపారు. సౌదీలోనే అంత్యక్రియలు జరపాలని కుటుంబాలు కోరుతున్నాయి. ఎఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎంఎల్‌ఎ మొహమ్మద్ మజీద్ హుస్సేన్ బాధిత కుటుంబాలతో సమావేశమై ధైర్యం చెప్పారు. తెలంగాణ ప్రభు త్వం ప్రత్యేక బృందాన్ని సౌదీ పంపుతోంది. అలాగే ఆర్థిక సాయం ప్రకటించింది. మృతుల బంధువులను సౌదీకి తీసుకెళ్లేదుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 18 మం ది మరణించారు. విద్యానగర్‌కు చెందిన విశ్రాంత రైల్వే ఉద్యోగి నజీరుద్దీన్ కుటుంబంతో కలిసి మ క్కాకు వెళ్లారు. సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన కుటుంబానికి చెందిన 18 మంది చనిపోయారు. నవంబరు 23 వరకు టూర్ ప్లాన్ చేసుకున్నారు. ఇందులో నలుగురు వ్యక్తులు నిన్న కారులో మదీనాకు వెళ్లగా మరో నలుగురు మక్కాలోనే ఉన్నారు.
మిగతా 46 మంది మక్కా నుంచి మదీనాకు బస్సులో బయలుదేరగా ప్రమాదం జరిగింది. ఇందులో ఒక యువకుడు బతికాడు. మిగిలిన 45 మంది మరణించారు. సౌదీ బస్సు ప్రమాదంలో హైదరాబాద్ నుంచి వెళ్లిన 45 మంది మృతి చెందారని హైదరాబాద్ సిపి సజ్జనార్ తెలిపారు. అబ్దుల్ షోయబ్ అనే యువకుడు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారన్నారు. ఈ క్రమంలో సీపీ వివరాలు వెల్లడించారు. సౌదీలో దగ్ధమైన బస్సులో 46 మంది ప్రయాణికులు ఉన్నారని వివరాలు వెల్లడించారు. మొత్తం 54 మంది బృందం హైదరాబాద్ నుంచి జెడ్డాకు వెళ్లిందని పేర్కొన్నారు. నవంబర్ 9 నుంచి నవంబర్ 23 వరకు జెడ్డా టూర్ ప్లాన్ చేశారన్నారు.
మృతులంతా హైదరాబాద్ వాసులే.. హజ్ కమిటీ
సౌదీ ప్రమాదంలో 45 మంది మృతి చెందారని వారంతా హైదరాబాద్ వాసులేనని హజ్ కమిటీ పేర్కొంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. నాలుగు ట్రావెల్ ఏజెన్సీల ద్వారా పర్యాటకులంతా జెడ్డాకు వెళ్లారని పేర్కొంది.
ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
బస్సు ప్రమాదానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. తెలంగాణ భవన్‌లోని సీనియర్ అధికారులు సౌదీ అరేబియా రియాద్‌లోని భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరుపుతున్నారు. సౌదీ అరేబియా మదీనాలో జరిగిన ప్రమాదంలో భారతీయులు మృతి చెందడంపై విదేశాంగ మంత్రి ఎస్. జై శంకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మరణించిన భారతీయుల కుటుంబాలకు రియాద్‌లో భారత రాయబార కార్యాలయం, జెడ్డాలోని కాన్సులేట్ పూర్తి మద్దతు అందిస్తున్నట్లు చెప్పారు. సౌదీ అరేబియాలోని మదీనా సమీపంలో గత రాత్రి జరిగిన బస్సు ప్రమాదంలో ఉమ్రా యాత్రికులు మరణించడం పట్ల బాధిత కుటుంబాలకు కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ప్రగాఢ సంతాపం తెలిపింది. ఈ ఘటనపై సౌదీ హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ, స్థానిక అధికారులతో సంప్ర దింపులు కొనసాగిస్తున్నట్లు రియాద్‌లోని ఎంబసీ, జెడ్డాలోని కాన్సులేట్ తెలిపింది. అలాగే తెలంగాణ అధికారులతో, సంబంధిత కుటుంబాల తోనూ సంప్రదింపులు చేస్తున్నట్లు పేర్కొంది. కాన్సులేట్ సిబ్బంది బృందం, భారతీయ వాలంటీర్లు వివిధ ఆస్పత్రిలో సహాయక చర్యల్లో నిమగ్న మైనట్లు తెలిపింది.
దురదృష్టకరం: బండి సంజయ్
సౌదీ అరేబియా బస్సు ప్రమాద ఘటన దురదృష్టకరమని కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటుందని చెప్పారు. కేంద్ర మంత్రి అమిత్ షా, సౌదీ అరేబియా అధికారులతో మాట్లాడి, అన్ని రకాల సహాయ చర్యలు చేపట్టాలని కోరినట్లు చెప్పారు.
రూ.5లక్షల పరిహారం ప్రకటన
సౌదీ అరేబియాలో జరిగిన బస్సు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు తెలంగాణ ప్రభు త్వం రూ. 5లక్షల పరిహారం అందజేయాలని నిర్ణయించింది. ఈ మేరకు మంత్రివర్గం తీర్మానించింది. మక్కా నుంచి మదీనాకు యాత్రికులను తీసుకువెళుతున్న బస్సుకు ప్రమాదం జరిగిన దుర్ఘటనలో 45 మంది మృతి చెందిన విషయం విదితమే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ఈ ఘటనపై తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసింది. ప్రభుత్వ ప్రతినిధి బృందంగా మంత్రి అజారుద్దీన్, మజ్లిస్ ఎమ్మెల్యే, మరియు మైనార్టీ విభాగానికి చెందిన ఒక అధికారి వెంటనే సౌదీ అరేబియాకు వెళ్లాలని మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది.మరణిం చిన వారి కుటుంబ సభ్యుల అభీష్టం మేరకు మృతదేహాలను అక్కడే మత సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించడానికి, ఒక్కో బాధి త కుటుంబం నుంచి ఇద్దరు కుటుంబ సభ్యులను సౌదీ అరేబియాకు తీసుకువెళ్లడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.