మన తెలంగాణ/హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజా పాలన వారోత్సవాల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. సోమవారం హైదరాబాద్‌లో సిఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశమైంది. దాదాపు నాలుగు గంటలపైనే ఈ భేటీ కొనసాగింది. ఈ సమావేశంలో గిగ్ వర్కర్ల బిల్లుకు సై తం కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలపై ఈ భేటీలో సుదీర్ఘంగా చ ర్చించింది. పార్టీపరంగానే బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కేబినెట్‌లో నిర్ణయించారు. మొదటగా సర్పంచ్ ఎన్నికలకు వెళ్లాలని ఆ తర్వాత ఎంపిటిసి, జడ్పీటిసి ఎన్నికలకు వె ళ్లాలని మంత్రివర్గం నిర్ణయించింది. డిసెంబర్ 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా పాలన వారోత్సవాలను, డిసెంబర్ 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 20 25ను నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా డిసెంబర్ 8,9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో ఈ సమ్మిట్-ను నిర్వహించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రెండేళ్లలో ప్రజా ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు, సాధించిన విజయాలను గ్లోబల్ సమ్మిట్ వేదికగా 8వ తేదీన ప్రజలకు వివరించే కార్యక్రమాలుంటాయి. డిసెంబర్ 9 న తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించాలని మంత్రివర్గం నిర్ణయించింది.
ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశం
15వ ఆర్ధిక సంఘం కాల పరిమితి వచ్చే 2026 మార్చి 31వ తేదీతో ముగియనుంది. అప్పటిలోగా పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయకపోతే గ్రామాలకు రావాల్సిన ఫైనాన్స్ కమిషన్ నిధులు దాదాపు రూ. 3 వేల కోట్లు రాకుండా పోతాయి. అందుకే ఈ డిసెంబర్ నెలలోనే పంచాయతీ ఎన్నికలను పూర్తి చేసేందుకు కసరత్తు ప్రారంభించాలని, అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని మంత్రివర్గం అధికారులను ఆదేశించింది. డెడికేటెడ్ కమిషన్ బిసిలకు 42 శాతం ప్రకారం రిజర్వేషన్ల జాబితాను ఇప్పటికే ఇచ్చింది. దాని ఆధారంగానే ఎన్నికల ప్రక్రియ కూడా మొదలైంది. కోర్టు కేసులతో ఎన్నికల ప్రక్రియ అర్ధంతరంగా నిలిచిపోయింది. ఇప్పుడు ఎన్నికలకు వెళ్లాలంటే 50 శాతం మించకుండా రిజర్వేషన్ల జాబితాను మరోసారి డెడికేటెడ్ కమిషన్ నుంచి తెప్పించుకోవాలని మంత్రివర్గం నిర్ణయించింది.
సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్‌లపై డెడికేటెడ్ కమిషన్ నుంచి నివేదిక
గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్ల సంఖ్యపై డెడికేటెడ్ కమిషన్ నుంచి నివేదిక కోరాలని కేబినెట్ తీర్మానం చేసింది. వారం రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసి కేబినెట్ ఆమోదం పొందాలని సూచించింది. బిసిలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై కోర్టు తీర్పులు కొలిక్కి వచ్చాకే ఎంపిటిసి, జడ్పీటిసి ఎన్నికలపై తదుపరి నిర్ణయం తీసుకోవాలని కేబినేట్ నిర్ణయించింది. ———కాగా, రాష్ట్రంలో స్థానిక సంస్థల పాలకవర్గాల పదవీకాలం ముగిసి దాదాపు 20 నెలలు గడుస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. అదే స్ఫూర్తితో స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ విజయబావుట ఎగురవేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకున్నారు.
అందెశ్రీ మృతి పట్ల మంత్రివర్గం సంతాపం
ప్రముఖ సహజ కవి అందెశ్రీ మృతి పట్ల మంత్రివర్గం సంతాపం తెలిపింది. అందెశ్రీ సేవలకు గుర్తుగా ‘అందెశ్రీ స్మృతివనం’ ఏర్పాటు, అలాగే ఆయన కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్న అంశాలపై కేబినెట్ చర్చించింది. అందెశ్రీ కుమారుడు ఎ. దత్త సాయికి డిగ్రీ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగం కల్పించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అందెశ్రీ రచించిన ‘జయ జయ హే తెలంగాణ‘ గీతాన్ని పాఠశాల పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని నిర్ణయం తీసుకుంది.
సౌదీ అరేబియా బాధిత కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం
సౌదీ అరేబియాలో బస్సు ప్రమాదంలో దుర్మరణం చెందిన బాధిత కుటుంబాలకు రూ. 5 లక్షలు పరిహారం అందించాలని కేబినెట్ నిర్ణయించింది. మంత్రి అజహరుద్దీన్, ఎంఐఎం ఎమ్మెల్యే, మైనారిటీ విభాగానికి చెందిన ఒక అధికారితో కూడిన ప్రభుత్వ ప్రతినిధి బృందాన్ని వెంటనే సౌదీకి పంపించాలని మంత్రివర్గం నిర్ణయించింది. మృతదేహాలను మత సంప్రదాయం ప్రకారం అక్కడే అంత్యక్రియలు చేయాలని, బాధితకుటుంబ సభ్యులను ఒక్కో కుటుంబానికి ఇద్దరిని తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఎస్‌ఆర్‌ఎస్ పీ స్టేజ్ 2 మెయిన్ కెనాల్ కు మాజీ మంత్రి దివంగత రాంరెడ్డి దామోదర్ రెడ్డి పేరు పెట్టేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాంరెడ్డి దామోదర్ రెడ్డి (ఆర్‌డిఆర్) ఎస్‌ఆర్‌ఎస్ పీ స్టేజ్ 2 కెనాల్ అని పేరు మార్చనున్నారు. ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్) లోపల ఉన్న ఇండస్ట్రీయల్ ల్యాండ్‌ను మల్టీ యూజ్ జోన్‌గా మార్చేందుకు రూపొందించిన ‘హైదరాబాద్ ఇండస్ట్రీయల్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీ (హెచ్‌ఐఎల్‌టిపి)’కి కేబినెట్ ఆమోదం తెలిపింది.