భార్య కడుపులో ఇద్దరు కవలలు మృతి చెందాలని డాక్టర్లు చెప్పడంతో మనస్థాపానికి గురైన ఓ తండ్రి ఆత్మహత్య చేసుకున్న సంఘటన రంగారెడ్డి జిల్లా, శంషాబాద్ ఆర్‌జిఐఎ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మృతుడి అన్న ప్రవీణ్ ఫిర్యాదు మేరకు ఈ విషాద సంఘటనకు సంబంధించిన వివరాలను ఆర్‌జిఐఎ పోలీస్ స్టేషన్ ఐన్‌స్పెక్టర్ బాల్‌రాజ్ వివరించారు.. కర్ణాటక రాష్ట్రం, బెంగుళూరు రాష్ట్రానికి చెందిన ముత్యాల విజయ్ (40) ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ శంషాబాద్‌లోని సామ ఎన్‌క్ల్యూవ్ కాలనీలో అద్దెకు ఉంటున్నాడు. అతని భార్య శ్రావ్య ఎనిమిది నెలల గర్భవతి.. ఆమెకు చెకప్ చేయించేందుకు అత్తాపూర్‌లోని బట్టర్ ఫ్లై హాస్పిటల్ కి తీసుకెళ్లాడు. వారి వెంట శ్రావ్య తల్లి కూడా వచ్చింది. డాక్టర్‌లు ఆమెకు చెకప్ చేసి కడుపులో ఇద్దరు కవలలు ఉన్నారని, వారి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. మెరుగైన చికిత్స అవసరం అవుతుందని డాక్టర్లు చెప్పడంతో ఆమెను గుడిమల్కాపూర్‌లోని మైత్రి హాస్పిటల్ కి తరలించారు. అయితే అప్పటికే హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమించిచడంతో హుటాహుటిన నగరంలోని సరోజిని హాస్పిటల్‌కి తరలించారు.
చికిత్స పొందుతున్న శ్రావ్య కడుపులో ఇద్దరు కవలలు, శ్రావ్య మృతి చెందారు. విషయాన్ని శ్రావ్య తల్లికి డాక్టర్లు తెలిపారు. ఆమె తన అల్లుడు విజయ్‌కి ఫోన్ ద్వారా చెప్పడంతో తీవ్ర మనస్థాపానికి గురై శంషాబాద్‌లోని తన రూమ్‌కు వెళ్లాడు. విజయ్ కోసం వెతికిన అతని మేనమామ ఫోన్ చేశాడు. కానీ రెస్పాండ్ కాకపోవడంతో హుటాహుటిన శంషాబాద్‌లోని రూమ్‌కు వచ్చిచూడగా విజయ్ ఫ్యాన్ కు చున్నీతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వెంటనే విజయ్ అన్నయ్య ప్రవీణ్ కు ఫోన్ చేసి చెప్పగా హుటాహుటిన శంషాబాద్‌లోని సామ ఎన్‌క్లూవ్‌కు చేరుకున్నాడు. తన తమ్ముడిని చూసిన ప్రవీణ్ శోకసముద్రంలో మునిగిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.