తెలంగాణలో బొగ్గు బ్లాకుల వేలం నిలిపివేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. సోమవారం ఖమ్మం జిల్లా, సత్తుపల్లిలోని విఆర్ ఓసి గేట్ మీటింగ్‌లో ఆమె కార్మికులను కలుసుకొని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. అపరిషృ్కతంగా ఉన్న సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం డిసెంబర్ 19న సింగరేణి సిఎండి కార్యాలయాన్ని ముట్టడించనున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత తెలిపారు. మాజీ సిఎం కెసిఆర్ గతంలో సింగరేణి సంస్థ కోసం చాలా సహకరించారని, తద్వారా చాలామందికి ఉద్యోగాలు కల్పించగలిగామంటూ తండ్రిని యాదికి తెచ్చుకున్నారు. ప్రస్తుత సిఎం రేవంత్‌రెడ్డి పలుమార్లు ప్రధాని నరేంద్ర మోడీని, కేంద్ర మంత్రులను కలిశారని, ఎన్నడూ సింగరేణి కార్మికుల సమస్యలపై స్పందించలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి సమస్యలను పట్టించుకోవట్లేదని, రెండేళ్లుగా మెడికల్ బోర్డ్ కోసం కొట్లాడుతున్నామని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణికి అక్షరాలా రూ.40 వేల కోట్లు అప్పు ఉందని, ప్రభుత్వాన్ని ఆర్థికంగా నడపగల సత్తా సింగరేణి సంస్థకి ఉందని, అటువంటి సంస్థ అస్తిత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతయినా ఉందన్నారు. ఇప్పుడున్న స్థితిలో డిపెండెంట్ ఉద్యోగాలను కాపాడుకోలేకున్నామని, సొంతింటి కల నెరవేరే మార్గం కనబడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి ఉద్యోగం ఒక కుటుంబానికి ఇన్సూరెన్స్ లాంటిదని, సమస్యల సుడిలో ఉన్న సంస్థ, కార్మికుల కోసం జాగృతి, హెచ్‌ఎంఎస్ పోరాడుతుందని అన్నారు. కేంద్రం బొగ్గు బ్లాక్‌లను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు వేలం పాటలు నిర్వహిస్తోందని, దీనికి జాగృతి వ్యతిరేకమని స్పష్టం చేశారు. తెలంగాణలో ఉన్న కొత్త బొగ్గు బ్లాకులను సింగరేణికే కేటాయించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. సింగరేణి కార్మికుల కోసం మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం చేపట్టాలని, అప్పటి వరకు కార్పొరేట్ హాస్పిటల్స్‌లో వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు ఇప్పుడు ఇస్తున్న రూ.470 రోజు వారీ వేతనాన్ని వేజ్ బోర్డు నిబంధనలు, లేబర్ చట్టాలకు అనుగుణంగా మారుస్తూ రూ.1200కు పెంచాలని,
అందుకోసం తాను పోరాడుతానని అన్నారు. జెన్‌కో, ట్రాన్స్ కో మాదిరిగా కాంట్రాక్ట్ కార్మికుల పర్మినెంట్ చేసేందుకు ప్రయత్నం చేస్తామని అన్నారు. సింగరేణి గని కార్మికులకు ఇన్కమ్ టాక్స్ కట్ చేయకూడదని గతంలో తాను ఎంపిగా ఉన్నప్పుడు పార్లమెంట్‌లో కూడా ప్రస్తావించానని గుర్తు చేశారు. అనంతరం మండల పరిధిలోని యాతాలకుంట గ్రామ సమీపంలో గల సీతారామ కాలువ పనుల పురోగతిని, భూ నిర్వాసితులు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎంఎస్ జనరల్ సెక్రటరీ రియాజ్ అహ్మద్, జాగృతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవీన చారి, గుంటి సుందర్, సాగర్, ఆంజనేయులు, వరికూటి శ్రీనివాస్, సందీప్ రెడ్డి, అజ్గర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.