జపాన్‌లో జరుగుతున్న డెఫ్లింపిక్స్ (బధిర) స్పోర్ట్స్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో స్వర్ణ పతకం సాధించి దేశ కీర్తిని చాటిన హైదరాబాద్ షూటర్ ధనుష్ శ్రీకాంత్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. సంకల్పం ఉంటే వైకల్యం అడ్డురాదని ధనుష్ నిరూపించి యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలిచారని ప్రశంసించారు. స్వర్ణ పతకం సాధించడమే కాకుండా 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో సరికొత్త ప్రపంచ రికార్డును సృష్టించిన ధనుష్ శ్రీకాంత్, భవిష్యత్తులో మరిన్ని రికార్డులను సాధించాలని, ఆత్మవిశ్వాసం, పట్టుదలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలబడుతుందని చెప్పారు. టోక్యోలో ఆదివారం జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్ ఫైనల్లో ధనుష్ శ్రీకాంత్ 252.2తో ప్రపంచ రికార్డు స్కోరు చేసి బంగారు పతకం దక్కించుకున్నాడు. భారత్‌కే చెందిన ముర్తజా వానియా 250.1 స్కోరుతో రజతం పతకం గెలుచుకన్నాడు. రాష్ట్రంలో అమలవుతున్న క్రీడా విధానం ప్రకారం డెఫ్లింక్స్‌లో స్వర్ణం అందుకున్న శ్రీకాంత్‌కు రూ. 1.20 కోట్లు ప్రోత్సాహక బహుమతి కింద ఇవ్వనున్నట్టు రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి ప్రకటించిన విషయం తెలిసిందే.