తెలంగాణా పల్లె మట్టి వాసనల పరిమళం అతని పాటలు. తను రాసిన తెలంగాణా అస్తిత్వ స్ఫూర్తి గీతాలు యావత్ తెలంగాణా ప్రజలను పోరాటాల్లోకి కదిలించగలిగిన మార్చింగ్ సాంగ్స్‌గా భాసిల్లాయి. ప్రకృతి గురించి, మృగ్యమౌతున్న మనిషితనం, పల్లెల గురించి అందెశ్రీ అద్భుతమైన పాటల్ని రాశారు. 1961 జూలై 18న సిద్ధిపేట జిల్లా రేబర్తిలో జన్మించిన ఆయన అసలు పేరు అందె ఎల్లయ్య. బాల్యం నుండే గొర్రెల కాపరిగా, ఆ తరువాత భవన నిర్మాణ కార్మికుడిగా కష్టభరితంగా సాగిన ఆయన జీవన యానంలో ఆశు కవిత్వం, పాట, మాట ఆయన వెన్నంటి నడిచాయి. ఆధ్యాత్మిక గురువులు, ఆచార్య బిరుదు రామరాజు వంటి పండితుల సాంగత్యంలో అతని ఆధ్యాత్మిక, సాహిత్య సృజన మరింత గాఢతనొందింది. అందెశ్రీ తన కవిత్వం, పాటలతో, పాటల పూదోట, అందెల సందడి, ఇతర కవులందరి పాటలతో నిప్పుల వాగు అనే సంకలనాలు వెలువరించారు. ‘మాయమైపోతున్నడమ్మ మనిషన్నవాడు’, ‘జైబోలో తెలంగాణా..’, ‘పల్లె నీకు వందనాలమ్మ’, ‘కొమ్మ చెక్కితే బొమ్మరా.. కొలిసి మొక్కితే అమ్మరా’ వంటి గొప్ప పాటలు ఆయన రాసిన అనేక పాటలలో కొన్ని. అందెశ్రీ రాసిన ‘జయ జయహే తెలంగాణ’ గీతం తెలంగాణ రాష్ట్ర జాతీయ గీతం అయింది. కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌తో ఆయనను సత్కరించింది. లోక్ నాయక్ పురస్కారంతో సహా అనేక అవార్డులు ఆయన పొందారు. చిరస్మరణీయ పాటలు, కవిత్వాన్ని రాసిన అందెశ్రీ తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిన గొప్ప వాగ్గేయకారుడు. మెహఫిల్ అందెశ్రీకి నివాళి అర్పిస్తోంది. సాహితీ, సాంస్కృతిక మిత్రులు ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ మాట్లాడిన మాటల్ని మీకందిస్తున్నాం.
– విమల (మెహఫిల్ గెస్ట్ ఎడిటర్)
మట్టిపదాల కవి : తెలంగాణ మట్టిని తొలుచుకుని వచ్చి, సహజ అభివ్యక్తితో పదాలల్లి, పాడి క్రమంగా తెలంగాణ ఉద్యమానికి ‘కలిసొచ్చే కాలంలో నడిచొచ్చిన కొడుకు’లాగా పాటల భుజం కాసినవాడు అందెశ్రీ. గ్రామీణ జీవనానుభవ తాత్వికత అతడి బలం. తెలంగాణ పల్లె పదాల పాటలను అల్లుకుంటూ మొదలై, ‘జయజయహే తెలంగాణ’ వరకు సాగిన అతడి ప్రస్థానం ఆశుసంప్రదాయపు కొనసాగింపులోని భాగం. తెలంగాణ ఉద్యమానికి అతను బాసటయ్యాడు. ఉద్యమం అతనికి బాసటయ్యింది. తెలంగాణకు అవసరమైన కాలంలో అవసరమైన ఉద్యమ సమరయోధుడిగా నిలబడ్డాడు. పాలేరు ఎల్లయ్య అనే సామాన్యుడు, పడిలేచిన కెరటపు పోలికలా అందెశ్రీగా ఎదిగాడు. ఒక్కో దశలో తన తాత్విక అన్వేషణను ఒక్కో దిశగా కొనసాగించాడు. ప్రపంచం, ఆధ్యాత్మికత, మూలా లు, నదులు- ఇలా అనేక పార్శ్వాల వైపుకు అతడి పాటలు నడిచాయి. అందరి మనసుల్లోకి చేరాయి. అందెశ్రీ అంటే తెలంగాణ సహజసిద్ధమైన సంస్కృతికి ఒక సింబల్.
– కవి యాకూబ్
అక్షరాలను అవలీలగా అల్లడంలో అందె వేసిన కలం మన అందెశ్రీ గారు. యువ కవి, గాయకులకు ఉత్తేజం అందెశ్రీగారు. పాట పరాధీనం కాకుం డా ప్రజల కోసమే అని పాడుతూ.. ప్రామాణికంగా నిలిచిన మహా మనిషి మన అందెశ్రీ. ఈ రోజు కళ ఉన్నవాళ్ల కోసం ఒకరకంగా, లేనోళ్ల కోసం మరో రకంగా ఉపయోగపడుతున్న తరుణంలో కష్టజీవుల కోసం కార్మికులు, కర్షకుల కోసం కడదాకా కార్మిక వర్గం కోసం తన కలా న్ని, తన గళాన్ని అందించిన కార్మిక, కర్షక పక్షపాతి, అందరూ మెచ్చిన ప్రకృతి కవి మన అందెశ్రీ అన్న. అరుణారుణ వందనాలతో మీకివే జోహార్లు.
– తులసీ నరసింహ
(ప్రజా నాట్యమండలి, తెలంగాణ)
అద్భుతమైన కవి, గాయకుడు : అందెశ్రీ జానపద కవిత్వ భూమిక నుంచి, ఉద్భవించినవాడు. శతకం పాటను రెంటిని కలిపి గేయపణతులు అల్లినారు. తాను రాసిన అత్యుత్తమ గీతాలు ఎన్నో ఉన్నాయి. ప్రజానాట్యమండలి మొదలుకొ ని, ప్రగతిశీల, అభ్యుదయ, సాంప్రదాయ కళా సంఘాల తో ఆయనకు అనుబంధం ఉన్నది. తెలంగాణ ఉద్యమం లో కీలక పాత్ర పోషించినాడు. గద్దరు, బిరుదు రామరాజు ప్రభావం తనపై ఉంది. తనకు ఆధ్యాత్మిక గురు పరంపర వల్ల వచ్చిన ఒక తాత్విక ధోరణి నేపథ్యంగా కవితలను సృజించినాడు. ఎన్నో ప్రకృతి గేయాలున్నాయి తనవి. ‘కొమ్మ చెక్కితే బొమ్మ’, ‘మాయమైపోతున్నడమ్మా మనిషి..’, ‘జైబోలో తెలంగాణ’, ‘జయ జయ హే తెలంగాణ’, ‘చూడు తెలంగాణ..’ వంటి గొప్ప పాటలకు ప్రాణం పోశాడు. శిష్ట, మౌఖి క, సంప్రదాయానికి మధ్య ఒక కొత్త దారి వేసుకొని సాగినవాడు. వ్యక్తిగతంగా చాలా సన్నిహితుడు. తెలంగాణ ఉద్యమం అంతకు ముందునుంచి కూడా కలిసి పనిచేసినం మేము. నేను, అందెశ్రీ, సుద్దాల అశోక్ అన్న ముగ్గు రం కలిసి తొలిసారి అమెరికా ప్రయాణం చేసాము. మా ఊరు దగ్గర రంగాపురం గున్న రాజేందర్‌రెడ్డి గారి దగ్గర తరచూ కలిసేవాళ్ళం. గొప్ప పాటలెన్నో తన కలంలో ప్రాణం పోసుకున్నాయి. అతను ఆకస్మికంగా ఈ లోకా న్ని విడిచిపోవడం ఎంతో విషాదకరం. భౌతికంగా మన ల్ని వీడిపోయినా.. మాసిపోని అక్షరమైయి అందెశ్రీ ఎల్లకాలం వెలుగుతాడు.
కాలం పాడిన పాట: తెలంగాణ అస్తిత్వ చైతన్యాన్ని తీర్చిదిద్ది, దానికి సృజనాత్మక స్వరాన్ని అందించిన మహా కవి, గాయకులలో అందెశ్రీ ప్రథమశ్రేణిలో నిలబడతారు. కాలం అందించిన కర్తవ్యమేమిటో, ఏ చరిత్రమలుపులో తానున్నాడో తెలిసి పాడిన పాట అతనిది. దుర్భిక్షంలోనూ, హింసలోనూ, సంక్షోభంలో పడిన పల్లెలను ఆర్తితో తలచుకుని వందనా లు చెప్పాడు. ప్రజల ఆధ్యాత్మికతతో పారవశ్యం పొంది అమ్మదేవతలను గానం చేశాడు. పోరాటం ఆరంభ దశలోనే అల్లిక మొదలుపెట్టిన ‘జయజయహే..’ గీతాన్ని, ఉద్యమం ఆసాంతం, తీర్చిదిద్దుతూ, జనజాతరలో జయకేతనంగా ఎగురవేశాడు. ప్రభుత్వాల గుర్తింపుతో నిమిత్తం లేకుండానే, ప్రజలు ఆయన పాటను తెలంగాణ మాతృ గీతంగా పాడుకున్నారు. ‘సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి’ అన్న ఆయ న ఆకాంక్షకు ఉద్యమ ప్రజ ఉప్పొంగిపోయింది. వినమ్రంగా మాతృభూమిని పాడిన గొంతుకే, ఉద్యమావేశాలతో బాణీ కలుపుకుని ‘జైబోలో తెలంగాణ’ అంటూ జడివానలా గర్జించింది. పరస్పరత లోపిం చి, అమానవీయంగా తయారవుతున్న మనిషి కోసం బాధాగీతం అయ్యాడు. తెలంగాణతనంలోని ప్రాణప్రదమైన విలువలన్నీ ఆయన పాటల్లో పలికాయి. ఏ కవికి అయినా అంతకంటె సార్థకత ఏముంటుంది? కె.శ్రీనివాస్
పల్లె పాటల పూదోట : అందెశ్రీ ఆశుకవి. పామరకవి. పల్లె పాటల పూదోట. తెలంగాణ పాట కవుల కార్ఖానా. జానపద బాణీలను ఉద్యమ గీతాలుగా మార్చి తెలంగాణ గడ్డను ఉద్యమ కెరటాల అడ్డాగా మార్చింది పాట కవులే. కానీ చదువులేని సుతారి కవి అందెశ్రీది మాత్రం భిన్నమైన శైలి. పండిత భాష, శబ్ద గాంభీర్యం ప్రదర్శించిన ప్రత్యేక శైలి అందెశ్రీది. తొలి నాళ్లలో జానపద బాణీలకు ప్రాణం పోసిన ఆయన ఆధ్యాత్మికత, గురువుల సాంగత్యాల తర్వాత సంస్కృత భూయిష్ట పదాలతో గంభీరమైన మార్చింగ్ బాణీలతో పాటలు పాడారు. ‘జన జాతరలో మన గీతం జయ కేతనమై ఎగరాలి.. జంజా మారుత జననినాదం..’ అన్నా, ‘జయజయహే తెలంగాణ.. జననీ జయకేతనం..’ అన్న జాతి గీతం అయినా అదే ఒరవడి. ‘సూడ సక్కని తల్లి సుక్కల్లో జాబిల్లి’ అని ప్రారంభించి తెలంగాణను ఉత్తేజపరిచి శాశించిన అందెశ్రీ ఇప్పుడు లేడు.. కానీ ఆయన పాటలో మాటలో నోటి కి చెయ్యడ్డం పెట్టుకుని పాట పాడి ఊగించి శాసించే అందెశ్రీ రూపం శాశ్వతం. సెలవు అందె ఎల్లన్న.
– అల్లం నారాయణ
ఆత్మగౌరవ కవి : జానపద సాంస్కృతిక ఔన్నత్యానికి అచ్చమైన ప్రతినిధి అందెశ్రీ. నిరుపేద కుటుంబంలో జన్మించినా గ్రామీణ సంబంధాల ఒడిలో ఎదిగి గర్వంగా తలెత్తుకునే సాహితీ వ్యక్తిత్వం సంతరించుకొనటం అందెశ్రీ ప్రత్యేకత. ఆయనది విలక్షణమైన స్వరం. విశేషమైన అక్షరం. ప్రభంజనంలా వెల్లువెత్తే భావోద్వేగం తన కవితాత్మ. పశువుల కాపరిగా పనిచేసిన ప్పుడే పాటను ఆవాహన చేసుకున్నాడు. తాపీ మేస్త్రిగా పనిచేస్తూ, పద సమన్వయ నేర్చాడు. జానపదాలు సృష్టిస్తూనే కాలం మోపిన బాధ్య తను తలకెత్తుకున్నాడు. అనుభవ జీవితాన్ని గానం చేశాడు. తెలంగాణ జాతిని జాగృతం చేసే అద్భుత గీతాలు ఉడుకెత్తిం చాడు. ఎక్కడా చెక్కుచెదరని కవి అందెశ్రీ. పాటలో, భావనలో పరిణితి సాధించి తనను తాను లోక కవిగా ప్రకృతి కవిగా మలుచుకున్నాడు. ఆధ్యాత్మిక ప్రయాణంలో సాగినా, సామాజిక చైతన్యంతో ఊగినా అందెశ్రీకి అందెశ్రీయే సాటి.
– నందిని సిధారెడ్డి
అందెశ్రీతో నాది మాయిముంత సంబంధం : ప్రజా కవులు -కళాకారులతో ఉద్యమ సం బంధం ఉన్నట్లే అందెశ్రీతో నాకు ఉద్యమ సంబంధం ఉంది. కానీ ఎప్పుడూ తన వ్యక్తిగత వివరాలు చెప్పడానికి ఇష్టపడని అన్న, నీది- నాది మాయిముంత సంబంధం అని చెబుతూ మా ఆడబిడ్డవని, అక్కా అంటూ ప్రేమగా సంబోధించేవాడు. మా ఇద్ద రి అమ్మమ్మల ఊరు ఆనాటి వరంగల్ జిల్లా లద్దునూ రు గ్రామం కావడమే ఈ మాయిముంత సంబంధం. ఆయన నివాసం ఉంటున్న లాలాపేట ఇంటికి ఒక సారి నేను పోయినప్పుడు చాలా నైరాశ్యంలో ఉన్నా డు. ‘మీ వదినను మీ దగ్గరే ఉంచుకోండమ్మా, నేనిక నదుల వెంట సాగిపోతానని’ చెప్పాడు. ఆ సమయం లో ‘నిప్పుల వాగు’ సంకలనం ఆయనకు కొంత ఉపశమనం ఇచ్చిందనే చెప్పాలి. నేను ఆయనను చూసేం దుకు వెళ్లినప్పుడు అందెశ్రీ భార్య అదే విషయం వలపోస్తూ నామీద పడి, పడి ఏడ్చింది.
పనికంటే ముందే పాట ధ్వనిలో పుట్టిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుండేవాడు. ఉద్యమ కాలంలో ఎన్నో వేదికలు మేము పంచుకున్నాము. ఉద్యమ గౌరవంతో పాటు, తెలంగాణలో ఆడబిడ్డలకు దక్కే ఆత్మీయ గౌరవమే ఆయన నుండి నాకు దొరికేది ఎప్పుడూ. ఆధ్యాత్మిక భావజాలం నుండి జానపద కవిగా, ప్రజాకవిగా, -గాయకుడిగా, ఉద్యమకారుడి గా, ప్రపంచ నదీ నాగరికతల అన్వేషకుడిగా ఎంతో ఎత్తుకు ఎదిగాడు. తెలంగాణ ఉద్యమ కాలంలో ఆయన రాసిన మూడు పాటల్లో ‘జై బోలో తెలంగాణ-జనగర్జనల జడివాన’తో పాటు ‘జయ జయహే తెలంగాణ’ పాటలు నేను పాడేదాన్ని. అన్నా, అందెశ్రీ మీ స్మృతి వనం, మీ పార్దివదేహం సాక్షిగా పాడిన వీడ్కో లు పాటలతోనే ప్రారంభమైంది. మీతో నాకు గల మాయిముంత రుణం చివరికి తీర్చుకున్నట్లయింది.
– అరుణోదయ విమలక్క
చిరస్మరణీయుడు :కాలం కన్న గొప్ప కవి అందెశ్రీ. మారుమూల పల్లెలో పశువుల కాపరిగా ప్రారంభమైన జీవితం అనేక కన్నీళ్లు, కష్టాలు అనుభవించింది. ఆకలి అందెశ్రీని కాల్చుకుతిన్నది. వెలివాడ అవమానపరిచింది. తెలంగాణ పల్లె జీవితమే ఊపిరిగా, ప్రపంచానికి తెలంగాణ ఔన్నత్యాన్ని చాటిన కవి అందెశ్రీ. తెలుగు భాష సంస్కృతికి చిహ్నమై నిలిచాడు. అందరిని కన్నీటి పర్యంతం చేసి వెళ్లిపోయాడు. పల్లె జీవితాన్ని అద్భుతంగా చిత్రించిన కవి అందెశ్రీ. తనకి చదువు రాకపోయినా, బడికి వెళ్లకపోయినా తన సృజనతో అక్షరాలను గానం చేశాడు. రాష్ట్ర సిద్ధి కోసం నిరంతరం తపించాడు. తెలంగాణ అవతరణ తరువాత తన పాటకు సముచితమైన స్థానం దొరకలేదని బాధపడ్డాడు. మనస్థాపానికి గురయ్యాడు. ప్రభుత్వం మారినం క తన గీతం రాష్ట్రగీతం అయినందుకు ఆనందించాడు. మనల్ని విడిచి వెళ్లిపోయా డు. ప్రజల నాలుకల్లో అందెశ్రీ చిరస్మరణీయుడు.
– జయరాజ్
, “”
(, )
,
,
, “”
(, )