కోల్‌కతా: సౌతాఫ్రికాతో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య టీమిండియా ఘోర పరాజయం చవిచూసింది. దక్షిణాఫ్రికా ఉంచిన 124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కూడా ఛేదించలేక అవమానకర ఓటమిని మూటగట్టుకుంది. సఫారీ బౌలర్లు అసాధారణ బౌలింగ్‌తో భారత్‌ను 93 పరుగులకే పరిమితం చేసి తమ జట్టుకు 30 పరుగుల తేడాతో చిరస్మరణీయ విజయం సాధించి పెట్టారు. బ్యాటింగ్ వైఫల్యంతో భారత్ చిన్న లక్ష్యాన్ని కూడా అందుకోలేక పోయింది. గాయం వల్ల కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగలేదు. ఇక ఊరిస్తున్న లక్షంతో ఆదివారం మూడో రోజు బ్యాటింగ్ చేపట్టిన భారత్‌కు ఆరంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. సఫారీ బౌలర్లు వరుస క్రమంలో వికెట్లను తీస్తూ టీమిండియా బ్యాటర్లకు కుదురుకునే అవకాశం ఇవ్వలేదు. సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 153 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ తెంబ బవుమా (55), కార్బిన్ బోస్చ్ (25)లు మెరుగైన బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నారు.
భారత బౌలర్లలో జడేజా నాలుగు, కుల్దీప్, సిరాజ్ రెండేసి వికెట్లను పడగొట్టారు. కాగా, సౌతాఫ్రికా మొదటి ఇన్నింగ్స్‌లో 159 పరుగులు చేయగా, భారత్ 189 పరుగులకు ఆలౌటైంది. ఇక స్వల్ప లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన టీమిండియా వరుస క్రమంలో వికెట్లను కోల్పోయింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (0), రాహుల్ (1) విఫలమయ్యారు. ధ్రువ్ జురెల్ (13), రిషబ్ పంత్ (2) కూడా నిరాశ పరిచారు. జడేజా (18), అక్షర్ పటేల్ (26) పరుగులు చేశారు. వాషింగ్టన్ సుందర్ (31) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగతా బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడంతో భారత ఇన్నింగ్స్ 33 ఓవర్లలో 93 పరుగుల వద్దే ముగిసింది. సౌతాఫ్రికా బౌలర్లలో సిమన్ హార్మర్ నాలుగు, జాన్సన్, కేశవ్ మహరాజ్ రెండేసి వికెట్లను పడగొట్టారు.