సవాల్ విసిరిన నిందితుడు రవితోనే వెబ్‌సైట్లు మూసివేయించిన పోలీసులు
హార్డ్‌డిస్క్‌ల్లో వేలాది సినిమాలు
గ్లోబల్ నెట్‌వర్క్ ఏర్పాటు చేసిన నిందితుడు
సర్వర్లు హ్యాక్ చేసి సినిమాలు, వెబ్ సిరీస్, హెచ్‌డి వీడియోలను డౌన్‌లోడ్ చేసినట్టు గుర్తింపు
నిందితుడి కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టులో పోలీసుల పిటిషన్
మన తెలంగాణ/సిటీబ్యూరో: పైరసీ సినిమాల ను అప్‌లోడ్ చేస్తున్న ఐ బొమ్మ, బప్పం టివి వె బ్‌సైట్లను హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు మూసివేయించారు. కరేబియన్ దీవుల్లోని సర్వ ర్ల నుంచి ఐ బొమ్మను నిర్వహిస్తున్న ఇమ్మడి రవిని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఎపిలోని విశాఖపట్టణానికి చెందిన రవి ముంబాయిలో ఎంబిఏ చేశా డు. ముస్లిం యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో వి డిగా ఉంటున్నారు. 2018 నుంచి రెయిన్‌బో విస్టాలో ఉంటున్న రవి అక్కడ ఉంటున్న వారికి తాను సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నట్లు చెప్పేవాడని తెలిసింది. రవి గెట్టింగ్ యాప్, ఈ ఆర్ ఇన్ఫోటెక్‌లకు సిఈఓగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. కోర్టులో హాజరు పరిచే ముం దే రవి తో ఐ బొమ్మ, బప్పం టీవీల వెబ్‌సైట్లను వెబ్ లాగిన్స్, సర్వర్ వివరాలతో మూసివేయించారు. గతంలో దమ్ముంటే తనను పట్టుకోవాల ని పోలీసులకు సవాల్ విసిరిన రవితోనే వెబ్‌సైట్లను పోలీసులు మూసివేయించారు.
రవి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్క్‌లను పోలీసులు పరిశీలిస్తున్నారు. నిందితుడి బ్యాంక్ ఖాతాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. నాంపల్లి కోర్టులో హాజరుపర్చిన పోలీసులు చంచల్‌గూడ జైలుకు రిమాండ్‌కు పంపారు. రవిని కస్టడీకి కోరుతు పోలీసులు నాంపల్లి కోర్టులో పిటీషన్ వేశారు. రవిని కస్టడీకి తీసుకుని విచారిస్తే సినిమాల పైరసీకి సంబంధించిన నెట్‌వర్క్, వెనుక ఉన్న వ్యక్తుల వివరాలు బయటపడుతాయని పోలీసులు భావిస్తున్నారు. తెలుగు సినీ నిర్మాతలు, పలువురు ఫిర్యాదు చేయడతో ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిపై హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు ఐదు కేసులు నమోదు చేశారు.
సర్వర్లు హ్యాక్…
ఐ బొమ్మ నిర్వాహకుడు రవి సినిమా నిర్మాణ సంస్థల సర్వర్లను హ్యాక్ చేసి కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌ల హెచ్‌డి వీడియోలను డౌన్‌లోడ్ చేసినట్లు గుర్తించారు. కొన్ని సార్లు ఆయా నిర్మాణ సంస్థలకు చెందిన క్లౌడ్ డేటాలో కూడా చొరబడి చోరీ చేసేవాడిని తెలిసింది. కొన్ని సమయాల్లో థియేటర్లలోకి తన మనుషులను పంపించి సినిమాను రికార్డు చేసి విడుదల అయిన రోజే తన ఐ బొమ్మలో పెట్టేవాడు. నిర్మాణ సంస్థల సర్వర్లను హ్యాక్ చేసేందుకు ఏకంగా హ్యాకర్లను నియమించుకుని వారికి లక్షలాది రూపాయలు ఇస్తున్నాడు. వేలాది సినిమాలను రవి తన టీంతో కలిసి సర్వర్లను హ్యాక్ చేసి వెబ్‌సైట్‌లో పెట్టాడు. దీని కోసం రవి గ్లోబల్‌లో పెద్ద నెట్ వర్క్‌ను నడిపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
పోలీసులను అభినందించినః హోం శాఖ స్పెషల్ సిఎస్ సివి ఆనంద్
ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్టు చేసిన హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు, కమిషనర్ విసి సజ్జనార్‌ను తెలంగాణ రాష్ట్ర హోం శాఖ స్పెషల్ సీఎస్ సీవీ ఆనంద్ అభినందించారు. ఈ మేరకు రవి అరెస్ట్‌పై సోషల్ మీడియా ఎక్స్‌లో ట్వీట్ చేశారు. దమ్ముంటే పట్టుకోండి అన్నోడిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారని పేర్కొన్నారు. ఇమ్మడి రవిని పట్టుకోవడానికి జూన్ నుంచి సైబర్ క్రైమ్ టీం రేయింబవళ్లు కష్టపడిందని ప్రశంసించారు. రవిని తప్పా ఈ పైరసీకి సంబంధించిన వాళ్లందరినీ పట్టుకుందని గుర్తుచేశారు. దమ్ముంటే పట్టుకోండని పోలీసులకు సవాలు విసిరి, బెదిరించిన వ్యక్తిని ఇప్పుడు అరెస్టు చేశారని కొనియాడారు. డీసీపీ కవిత, హైదరాబాద్ సీపీ సజ్జనార్‌కు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు సీవీ ఆనంద్.