ఆర్‌ఎఫ్‌సిలో జరిగిన కార్యక్రమంలో పక్కపక్కనే ఆసీనులైన తెలుగు రాష్ట్రాల సిఎంలు
ముసిముసి నవ్వులతో అందరి దృష్టిని ఆకర్షించిన ముఖ్యమంత్రులు
హైదరాబాద్: రామోజీ ఫిల్మ్ సిటీలో ఆదివారం సాయంత్రం జరిగిన అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమంలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్‌రెడ్డి, చంద్రబాబు నాయుడు ఒకే వేదికపై కలిశారు. ఇరువురు ముఖ్యమంత్రులు కరచాలనం అనంతరం పక్కపక్కనే కూర్చుని కాసేపు ముచ్చటించుకున్నారు. మధ్యమధ్యలో ముసిముసి నవ్వులు నవ్వుతూ కనిపించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం తర్వాత చంద్రబాబు, రేవంత్ కలుసుకోవడం ఇదే మొదటిసారి. ఇరువురి చిత్రాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. నెటిజన్లు వారికి నచ్చిన కామెంట్లు, క్యాప్షన్లతో పోస్టులు పెడుతున్నారు.