రిజర్వేషన్లు పెంచకుండా ఎన్నికలకు వెళ్లొద్దు
తక్షణమే ప్రధాని వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్ళాలి
బిసి రిజర్వేషన్లు పార్టీ పరంగా ఒప్పుకోం.. చట్టబద్దంగా ఇవ్వాల్సిందే
బిసి రిజర్వేషన్లపై డిసెంబర్ మొదటి వారంలో పార్లమెంట్ ముట్టడి
రన్ ఫర్ సోషల్ జస్టిస్ ర్యాలీలో బిసి నేతల వెల్లడి
మన తెలంగాణ/హైదరాబాద్: బిసి రిజర్వేషన్లు పెంచిన తర్వాతే స్థానిక ఎన్నికలకు వెళ్ళాలని బిసి నేతలు డిమాండ్ చేశారు. రిజర్వేషన్లు పెంచకుండా తొందరపడి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళితే బిసిల అగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు. రిజర్వేషన్ల సాధనకు కేంద్రంపై ఒత్తిడి తేవడానికి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని, ఇందుకు సంబంధించి కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని బిసి జెఎసి వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బిసి జెఎసి ఇచ్చిన అష్టంగా ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం జెఎసి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా రన్ ఫర్ సోషల్ జస్టిస్ పేరుతో బిసిలు పెద్ద ఎత్తున రన్ నిర్వహించారు. హైదరాబాద్‌లో బషీర్బాగ్ కూడలి లో ఉన్న బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం నుండి లోయర్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు నిర్వహించిన రన్ లో వందలాది మంది బిసి ఉద్యమకారులు పాల్గొన్నారు.
బిసి రిజర్వేషన్ రక్షించాలని, రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ చేయాలని, బిసి రిజర్వేషన్లు పెంచిన తర్వాతే స్థానిక ఎన్నికలకు పోవాని ఉద్యమకారుల నినాదాలతో రన్ ఫర్ సోషల్ జస్టిస్ ర్యాలీ మారుమోగింది. ఈ రన్‌లో మాజీ ఎంపి వి హనుమంతరావు, మాజి మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, బిసి జెఎసి వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్, చీప్ కో ఆర్డినేటర్ గజ్జ కృష్ణ, కో ఆర్డినేటర్ కులకచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, బిసి కుల సంఘాల జెఎసి చైర్మన్ కుందారం గణేష్ చారి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బిసి రిజర్వేషన్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తేవడానికి ఒక రాజకీయ కార్యచరణ తీసుకుని వచ్చే పార్లమెంటు సమావేశాల దృష్టా రాష్ట్ర ప్రభుత్వం పోరాడాలని డిమాండ్ చేశారు. ఇండియా కూటమి ద్వారా పార్లమెంటును స్తంభింప చేయాలని కోరారు. అఖిలపక్షంతో సిఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి ప్రధానితో కలిసి ఒత్తిడి పెంచాలన్నారు. ఇవేమి చేయకుండా స్థానిక ఎన్నికలకు వెళతామంటే బిసిలను నమ్మించి మోసం చేయడమే అవుతుందన్నారు. బిసి రిజర్వేషన్లపై బిజెపి ద్వంద వైఖరి విడనాడి వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బిసి రిజర్వేషన్ల చట్టాన్ని తేవాలని లేని పక్షంలో వేలాది మందితో పార్లమెంటు ముట్టడిస్తామని జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు.
మాజి ఎంపి వి హనుమంతరావు మాట్లాడుతూ బిసి రిజర్వేషన్లు ఇప్పుడు అమలు కాకుంటే భవిష్యత్తులో ఇంకెప్పుడు అమలు జరిగే పరిస్థితి లేదని అన్నారు. బిసి రిజర్వేషన్ల పై బిజెపి తో కాంగ్రెస్ తరపున పోరాడుతామని ఆయన తెలిపారు. రిజర్వేషన్లపై స్పష్టత రాకుండా స్థాని ఎన్నికలు నిర్వహించ వద్దని ఆయన సిఎం రేవంత్ రెడి,్డ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌లకు విజ్ఞప్తి చేశారు. మాజి మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ సర్పంచ్ ఎన్నికలు ఆగిపోతే కేంద్రం నుండి రావలసిన నిధులు రావడం లేదని చెబుతున్న ప్రభుత్వం లక్షల కోట్ల బడ్జెట్‌లో రూ. 3 వేల కోట్లు ఆగిపోతే వచ్చే నష్టం ఏందని ప్రశ్నించారు, రిజర్వేషన్లపై కేంద్రంతో కొట్లాడడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైతే, బిఆర్‌ఎస్ పార్టీ కూడా ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తుందన్నారు. బిసిలను మోసం చేయాలని చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బిసిలు వదిలిపెట్టే ప్రశ్న లేదని ఆయన హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బిసి జెఎసి చీప్ కో ఆర్డినేటర్ గుజ్జ కృష్ణ, కో ఆర్డినేటర్ కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, బిసి కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి, సంచార జాతుల సంఘం అధ్యక్షులు వీరస్వామి, బిసి విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు తాటికొండ విక్రమ్ గౌడ్, బిసి యువజన సంఘం జాతీయ అధ్యక్షులు కనకాల శ్యామ్ కుర్మ, సగర సంగం రాష్ట్ర అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సగర, గంగపుత్ర సంఘం రాష్ట్ర అధ్యక్షులు దిటి మల్లయ్య, వడ్డెర సంఘం జాతీయ అధ్యక్షులు పిట్ల శ్రీధర్, బిసి సంఘాల నేతలు ఈడిగ శ్రీనివాస్ గౌడ్, వరికుప్పల మధు, ఇ. నిరంజన్, కవుల జగన్నాథం, పాలకూరి కిరణ్ గౌడ్, మాదేశి రాజేందర్, తారకేశ్వరి, సంధ్యారాణి, గౌతమి, స్వామి గౌడ్, ఇంద్ర ం, మహేష్ మీరు,భరత్ గౌడ్,తదితరులు పాల్గొన్నారు.