శ్రీనగర్ : పలు రాష్ట్రాలకు విస్తరించుకున్న వైట్‌కాలర్ టెర్రర్ వ్యవస్థ ఛేదన దశలో జమ్మూ కశ్మీర్‌లో ఆదివారం ఓ లేడీ డాక్టర్‌ను అరెస్టు చేశారు. ఎర్రకోట పేలుడు కీలక మూలాలున్న హర్యానాలోని రొహతక్‌కు చెందిన వైద్యురాలు ప్రియాంక శర్మను అనంత్‌నాగ్‌లో భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. అనంత్‌నాగ్‌లో ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్‌గా విధులలో ఉన్న లేడీ డాక్టర్‌ను ఆమె నివాసం ఉంటున్న వసతి గృహంపై దాడి చేసి అరెస్టు చేశారు. ఎర్రకోట ఉగ్రపేలుడు తరువాత టెర్రర్ ముఠా ప్రత్యేకించి డాక్టర్లుగా పనిచేస్తున్న వారే ఉగ్ర చర్యలకు పాల్పడుతున్నట్లు నిర్థారణ అయింది. దీనితో బహుళస్థాయి దర్యాప్తు సంస్థలు ఇప్పటికే కశ్మీర్, ఢిల్లీ, హర్యానా రాష్ట్రాలలో అనుమానిత ప్రాంతాలలో సోదాలకు దిగుతున్నాయి.
ఈ క్రమంలోనే అనంత్‌నాగ్‌లో ఈ డాక్టర్‌ను అరెస్టు చేశారు. ఎర్రకోట పేలుడు కేసు దర్యాప్తు వేగవంతం అయింది. ఈ క్రమంలోనే దీని వెనుక పలు స్థాయిల్లో పాకిస్థాన్, అఫ్ఘనిస్థాన్ ఉగ్ర సంస్థలతో ఈ వైట్‌కాలర్ టెర్రర్ గ్యాంగ్‌కు లింక్‌లు ఉన్నట్లు వెల్లడైంది. పైగా టర్కీనుంచి కూడా ఎప్పటికప్పుడు ఫరీదాబాద్‌లోని టెర్రర్ లింక్‌ల అల్ ఫలాహ్ మెడికల్ కాలేజీకి సాయం అందుతోందని సూచనప్రాయంగా తెలిసింది. అదుపులోకి తీసుకున్న వైద్యురాలిని భద్రతా సంస్థలు వెంటనే తరలించి కీలక విషయాలను రాబట్టుకునేందుకు విచారిస్తున్నాయి. అరెస్టు తదుపరి ప్రక్రియ గురించి అనంత్‌నాగ్ పోలీసులుమీడియాకు సంక్షిప్తంగా తెలిపారు.
అనంత్‌నాగ్‌లోని మలక్‌నాగ్ ప్రాంతంలో ఓ హాస్టల్‌లో ఈ డాక్టర్ ఉంటోంది. అక్కడి నుంచి స్వాధీనపర్చుకున్న మొబైల్ ఫోన్, సిమ్‌కార్డులోని సమాచారాన్ని ఫోరెన్సిక్ పరీక్షలతో రాబట్టుకునేందుకు యత్నిస్తున్నారు. ఈ ఆసుపత్రిలో ఇంతకు ముందు పనిచేసిన అదీల్ అనే వ్యక్తిని పట్టుకుని జరిపిన విచారణ క్రమంలో ఈ లేడీడాక్టర్ పాత్ర గురించి తెలిసింది. అదీల్ ఫోన్ కాల్స్ సమాచారంతో డాక్టర్ చిరునామాను నిర్థారించారు. ఈ టెర్రర్ మాడ్యూల్ ప్రకంపనలు ఉత్తరప్రదేశ్‌లోనూ చోటుచేసుకున్నాయి. అక్కడ చదివే దాదాపు 200 మంది కశ్మీరీలైన మెడికల్ కాలేజీ విద్యార్థుల కదలికలను కూడా స్థానిక పోలీసు సహకారంతో నిఘా సంస్థలు ఆరాతీస్తున్నాయి. కాన్పూర్, లక్నో, మీరట్, సహ్రాన్‌పూర్ ఇతర చోట్ల ఉన్న మెడికల్ కాలేజీలు, అక్కడి విద్యార్థుల మూలాలు, పూర్వాపరాలపై నిఘా సంస్థలు ఆరా తీస్తున్నాయి.