మన తెలంగాణ / హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో పార్టీతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగా మాత్రమే నవీన్ యాదవ్‌కు మద్దతిచ్చామని ఎంఐఎం అధినేత, ఎంపి అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలపై ఆయన స్పందిస్తూ తాము కాంగ్రెస్ కు మద్దతిచ్చినట్లు భావించడం సరికాదన్నారు. బిఆర్‌ఎస్ పార్టీతో తమకు ఎలాంటి విభేదాలు లేవని అసదుద్దీన్ స్పష్టం చేశారు. కెసిఆర్ అయినా, తానైనా తమ పార్టీలకు ఏది మంచిదనిపిస్తే అది చేసుకుంటూ వెళ్తామని తెలిపారు. నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
సీమాంచల్‌కు వెళ్లనున్న ఓవైసీ
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు స్థానాలు కైవసం చేసుకున్న మజ్లిస్ పార్టీలో ఆనందోత్సవాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం 23 స్థానాల్లో పోటీ చేసింది. ఐదు స్థానాల్లో విజయం సాధించడం ద్వారా తమ సిట్టింగ్ స్థానాలను నిలుపుకుంది. ఈ నేపథ్యంలో అసదుద్దీన్ ఓవైసీ అక్కడి ప్రజలను కలిసి ధన్యవాదాలు తెలిపేందుకు ఈ నెల 21, 22 తేదీల్లో బీహార్‌లోని సీమాంచల్ వెళుతున్నారు. ఈ విషయాన్ని అసదుద్దీన్ ఎక్స్ వేదికగా తెలిపారు.