జడేజా మాయాజాలం
రెండో ఇన్నింగ్స్‌లోనూ తేలిపోయిన ప్రొటీస్
కోల్‌కతా: ఈడెన్ గార్డెన్ టెస్టులో టీమిండియా విజయం వైపు దూసుకెళుతోంది. దక్షిణాప్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో భారత్ విజయం ఖాయమైనట్టే కనిపిస్తోంది. బ్యాటింగ్‌లో తడబడినా భారత్ బౌలింగ విభాగంలో అద్భుత ప్రదర్శనతో సఫారీలను కట్టడిచేస్తోంది. శనివారం 30 పరుగుల వెనుకంజతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ప్రొటీస్.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 35 ఓవర్లలో 7 వికెట్లకు 93 పరుగులు చేసి కష్టాల్లో పడింది. సారథి టెంబా బవుమా(29 బ్యాటింగ్) ఒంటరి పోరాటం చేయగా మిగతా బ్యాటర్లు చేతులెత్తేశారు. బవుమాతో పాటు టెయిలెండర్ కోర్బిన్ బోష్(1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా(4/29) నాలుగు వికెట్లు తీయగా.. కుల్దీప్ యాదవ్(2/12) రెండు వికెట్లు పడగొట్టాడు. అక్షర్ పటేల్‌కు ఓ వికెట్ దక్కింది. ప్రస్తుతం సౌతాఫ్రికా 63 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకుముందు 37/1 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్ 189 పరుగులకు ఆలౌటైంది. కెఎల్ రాహుల్(39), వాషింగ్టన్ సుందర్(29) టాప్ స్కోరర్లుగా నిలిచారు. రిషభ్ పంత్(27), రవీంద్ర జడేజా(27) పర్వలేదనిపించారు. సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సెన్(3/35), సిమన్ హర్మర్(4/30) భారత్ పతనాన్ని శాసించగా.. కేశవ్ మహరాజ్, కోర్బిన్ బోష్ చెరో వికెట్ పడగొట్టారు.