మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణను 2030 నాటికి దేశ ‘ఏరో ఇంజిన్ రాజధాని’గా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీ ధర్ బాబు అన్నారు. ఇందుకోసం ప్రపంచంతో పోటీపడేలా దిగ్గజ పరిశ్రమలు, ప్రముఖ విద్యాసంస్థల భాగస్వామ్యంతో ‘ఏరోస్పేస్, డిఫెన్స్ ఎకోసిస్టమ్’ను రాష్ట్రంలో అభివృద్ధి చేసేందుకు రోడ్డు మ్యాప్‌ను రూపొందిస్తున్నామన్నారు. ‘ఎండ్ టూ ఎండ్ ఎకోసిస్టం’ కోసం గత కాంగ్రె స్ ప్రభుత్వాలు వేసిన పునాదులే ప్రస్తుతం తెలంగాణను దేశ స్ట్రాటెజిక్ డిఫెన్స్ హబ్‌గా మార్చాయని వివరించారు. కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్‌మెంట్, ఐఎస్‌బీ, ముంజాల్ ఇన్సిట్యూట్ ఫర్ గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ సంయుక్తాధ్వర్యంలో శనివారం గచ్చిబౌలి లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ)లో నిర్వహించిన ‘ఎంపవరింగ్
ఆత్మనిర్భర్ భారత్: ఇండియాస్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సమ్మిట్’కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై కీలకోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఏఅండ్ డీ రంగంలో నమోదవుతున్న వేగవంతమైన వృద్ధిని మనకు అనుకూలంగా మార్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో హీరో ఎంటర్ ప్రైజెస్ ఛైర్మన్ సునీల్ కాంత్ ముంజాల్, ఐఎస్ బీ డీన్ ప్రొఫెసర్ పి.మదన్, ప్రొఫెసర్ చందన్ చౌదరి పాల్గొన్నారు.