సూరత్: విద్వేషకర శక్తులకు బీహార్ ఎన్నికల్లో ప్రజానీకం ఘాటైన జవాబు ఇచ్చిందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. గుజరాత్‌లోని సూరత్‌లో తనకు బీహారీలు జరిపిన సన్మాన కార్యక్రమంలో శనివారం ఆయన మాట్లాడారు. దేశంలో కులాల విషం చిమ్మిన వారికి, మతాల చిచ్చు రగిల్చిన కాంగ్రెస్‌కు ప్రజలు తమ తిరస్కార ఓటుతో పరాజయం పాలుచేశారని, ఇందుకు తాను బీహారీలను అభినందిస్తున్నానని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, రాహుల్ గాంధీలతో కలిసి పనిచేసిన కాంగ్రెస్ జాతీయ స్థాయి నాయకులు ఇప్పటి ఈ గాంధీలతో విసిగివేసారి, బాధపడుతున్నారని చెప్పారు.
బీహార్‌లో బిజెపి సారధ్యపు ఎన్‌డిఎ ఘనవిజయంపై మోడీ నాయకత్వాన్ని అభినందించేందుకు సూరత్‌కు చెందిన బీహారీలు ప్రధానిని ఆహ్వానించి సన్మానించారు. గడిచిన దశాబ్ధంలో కాంగ్రెస్ పార్టీ అనేక ఎన్నికల పరాజయాలను మూటగట్టుకుంది. ఇప్పటికైనా కొందరు ఈ సంకుచిత, విద్వేషపూరిత కాంగ్రెస్ నేతలకు అంతర్మథనం మొదలవుతుందా? చూడాల్సి ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ముస్లిం లీగ్ మావోయిస్టు పార్టీగా మారింది. అంతా అరాచకంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. దీనిపేరు ఇప్పుడు పొడిపొడిగా చెప్పాలంటే ఎంఎంసి అని వ్యాఖ్యానించారు.