‘అబ్ కే బార్ చార్ సౌ పార్’ అనే నినాదంతో బయలుదేరి 2024లో 240 స్థానాల దగ్గర ఆగిపోయిన భారతీయ జనతా పార్టీ, అటు ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ, ఇటు బీహార్ లో జనతాదళ్ యునైటెడ్ తదితర పార్టీల సహాయంతో కేంద్రంలో మూడోసారి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఆ పార్టీ అధినాయకత్వంలో రాజ్య విస్తరణకాంక్ష రోజు రోజుకు బలపడుతున్నట్టు అర్థం అవుతున్నది.శుక్రవారంనాడు బీహార్ లో అక్కడి రాష్ట్ర శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న క్రమంలోనే పశ్చిమబెంగాల్లో ఆ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ శాఖ తన అధికారిక ఎక్స్ ఖాతాలో ‘నెక్స్ వెస్ట్ బెంగాల్’ అని ట్వీట్ చేసింది. అంతేకాదు, కేంద్రమంత్రి గిరిరాజ్ తో సహా పలువురు బిజెపి నాయకులు ‘బెంగాల్ ఈ విజయ పరంపరను అందిపుచ్చుకుంటుంది’ అని వ్యాఖ్యానించారు. అంటే బీహార్ తర్వాత పశ్చిమ బెంగాల్ని ఆక్రమించుకోబోతున్నామని అర్థం కదా. దానికి అక్కడ అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ యూట్యూబ్ లో ఒక బాలుడి చేత చేయించిన వీడియో దేశమంతా ఆసక్తికరమైన చర్చకు తెర లేపింది. ఆ బాలుడు వీడియోలో ‘సప్నే దేఖ్నా అచ్ఛీ బాత్ హై’ (కలలు కనడం మంచిదే) అంటాడు. అంటే బీహార్ తర్వాత వెనువెంటనే ఎన్నికలు రాబోతున్నది పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అసోం, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల్లో. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భాషలో బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా ‘జంగిల్ రాజ్’ (ఆటవిక రాజ్యం)ను అంతమొందించే సమయం ఆసన్నమైందని బిజెపి కలలు కంటున్నదని అర్థం.
2021లో పశ్చిమ బెంగాల్లో బిజెపి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 294 శాసనసభ స్థానాల్లో 77 చోట్ల గెలిచిన కారణంగా ఈసారి అక్కడ అధికారంలోకి వస్తామని ధీమాతో ఉన్నట్టు కనిపిస్తున్నది. ఇక తమిళనాడు విషయానికొస్తే నిన్న బీహార్ ఫలితాలు వెలువడిన వెంటనే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ తన ఎక్స్ ఖాతాలో ఎన్‌డిఎ ఘన విజయానికిగాను జెడి(యు) నాయకుడు, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు అభినందనలు తెలుపుతూనే కేంద్ర ఎన్నికల సంఘం నిర్వాకాన్ని మాత్రం దుయ్యబట్టారు. బీహార్ ఎన్నికల ఫలితాలు కేంద్ర ఎన్నికల సంఘం చేసిన అవకతవకలను, నిర్లక్ష్య వైఖరిని కప్పిపుచ్చజాలవని స్టాలిన్ అభిప్రాయపడ్డారు. అంతేకాదు, ఈ దేశానికి మరింత బలమైన, నిష్పాక్షికమైన ఎన్నికల సంఘం అవసరం అంటూ, ఓడిపోయేవారిలో కూడా విశ్వాసం కల్పించేలా ఎన్నికల వ్యవస్థ నిర్వహణ పద్ధతి ఉండాలన్న స్టాలిన్ మాటల వెనుక మరో ఆరు నెలల్లో తన రాష్ట్రానికి ఎన్నికల సంఘం ద్వారా ప్రమాదం ముంచుకురానున్నదన్న సూచన ఉందేమో అనిపిస్తుంది. తమిళనాడు అధికారపక్షం డిఎంకె కేంద్రంలో ఎన్‌డిఎ ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్న బిజెపికి బద్ధశత్రువు. ఎన్‌డిఎ వ్యతిరేక కూటమైన ‘ఇండియా’లో భాగస్వామి. డిఎంకె ప్రత్యర్ధి ఎఐఎడిఎంకె తో కలిసి డిఎంకె ని ఎదుర్కోవడం సాధ్యమయ్యే పని కాదని అర్థం అయిన బిజెపి, తమిళ ప్రముఖ నటుడు విజయ్‌తో పార్టీ పెట్టించిందనే ప్రచారం తమిళనాట జోరుగా సాగుతున్నది.
ఒక రాజకీయ పార్టీ ఎల్లకాలం కేంద్రంతోపాటు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో తానే అధికారంలో ఉండాలని కోరుకోవడంలో తప్పులేదు. ఎమర్జెన్సీ ఎత్తేసిన తర్వాత జనతా పార్టీ అధికారంలోకి వచ్చేదాకా కాంగ్రెస్ దే ఈ దేశంలో ఏకఛత్రాధిపత్యం. భారతీయ జనతా పార్టీ ఏర్పడిందే 80 లలో. ఇక కేంద్రంలో, రాష్ట్రాల్లో తామే శాశ్వతంగా అధికారంలో ఉండాలన్నది బిజెపి ఆలోచన కావచ్చు. ప్రజామోదం ఉంటే ఎవరాపగలరు?హర్యానా, మహారాష్ట్ర , బీహార్ ఫలితాల ఊపులో కమలనాథులు ఆ ఊహల్లో తెలియాడుతుండటంలో తప్పులేదు కానీ అది అంత సులభం కాదన్న విషయం ఎవరు చెప్పాలి? కేంద్ర ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వం చెప్పుచేతల్లో ఉన్నంతకాలం అది సులభమేనని ఈ దేశ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చెబుతున్నారు. బీహార్ ఎన్నికల ప్రక్రియ మొదటినుండి సక్రమంగా సాగలేదని చెబుతూనే ఫలితాలు ఆశ్చర్యం కలిగించాయన్నారు రాహుల్ గాంధీ. అంతేకాదు, నా పోరాటం రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసమే అని కూడా వ్యాఖ్యానించారు. అధికారంలోకి రావడంకంటే రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించడమే ప్రధానమైంది. అందులో సందేహం లేదు. దానిలో ఎవరికీ రెండో అభిప్రాయం ఉండాల్సిన అవసరం లేదు. కానీ తాను చేస్తున్న ఈ ప్రయత్నం సఫలీకృతం కావాలంటే అధికారం కూడా అవసరమన్న విషయం రాహుల్ గాంధీకి పెద్దగా పట్టినట్లు లేదు. రాజ్యాంగబద్ధమైన, స్వయంప్రతిపత్తిగల కేంద్ర ఎన్నికల సంఘం లోపభూయిష్టంగా ఉన్నదని, అధికారంలో ఉన్నవారి అడుగులకు మడుగులు ఒత్తుతున్నదని చెపుతూ అందుకు వ్యతిరేకంగా ఆయన చేస్తున్న పోరాటం ఓటర్లకు పెద్దగా ఎక్కుతున్నట్లు లేదు. ఒకవైపు ఆయన పోరాటం సాగుతూనే ఉన్నది, ఇంకో వైపు హర్యానా పాయె, మహారాష్ట్ర పాయె, ఇప్పుడు బీహార్ కూడా పాయె.
ఆయన ఇంకా ప్రజాస్వామ్య, రాజ్యాంగ రక్షణ ఉద్యమ జెండా భుజానేసుకుని ఇలానే ముందుకుపోతుంటే రేపు పశ్చిమ బెంగాల్, తమిళనాడు కూడా పాయే అనుకోవాల్సి వస్తుందేమో. తమిళనాడులో కాంగ్రెస్ ఎప్పుడూ అధికారంలో లేదు. పశ్చిమ బెంగాల్లో కూడా కాంగ్రెస్ ది గత చరిత్రే అయినప్పటికీ ఆ రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పక్షాలు భారతీయ జనతా పార్టీకి బద్ధ విరోధులు. వచ్చే కొద్ది మాసాల్లో ఆ రెండు రాష్ట్రాల్ని రాహుల్ గాంధీ చెబుతున్న ఎన్నికల సంఘం అవకతవకలనుంచి కాపాడటానికి ఏం చేయాలో ఈరోజు నుండే రాహుల్ గాంధీ ఆలోచించకపోతే త్వరలోనే ఆయన రాజకీయ రంగస్థలం మీద నుండి నిష్క్రమించే పరిస్థితి రావచ్చునన్నది విశ్లేషకుల అంచనా.
రాహుల్ గాంధీ రాజ్యాంగ వ్యవస్థల్ని సరైన మార్గంలో పెట్టాలనుకుంటే ఆయన చేతుల్లో అధికారం అనే అస్త్రం ఉండాలి. కానీ ఆయన ఆ ఆలోచన, ప్రయత్నాలు పక్కనపెట్టి విమర్శలు ఎదుర్కొంటున్నారు. బీహార్ నే ఉదాహరణగా తీసుకుంటే అక్కడ పేరుకే మహా ఘట్‌బంధన్ గా కాంగ్రెస్, ఆర్‌జెడి తదితర పార్టీలు ఎన్నికల్లో ఎన్‌డిఎను ఢీకొనేందుకు వెళ్లాయి కానీ, సరైన హోంవర్క్ జరగలేదని స్పష్టంగా కనిపిస్తున్నది. హేమాహేమీలైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీహార్ రాజకీయాల్లో కురువృద్ధుడు నితీశ్ కుమార్ మీద పోరాటానికి నాయకత్వం వహించాల్సిందిగా అంతగా రాజకీయ అనుభవం లేని తేజస్వి యాదవ్‌ను వదలడమే నష్టం చేసిందన్న వాదన వినిపిస్తోంది. మహాఘట్‌బంధన్‌లో ప్రధాన పాత్రధారి కాంగ్రెస్ పరిస్థితి బీహార్ లో అత్యంత దయనీయమైంది. అక్కడ పోటీ చేసిన మజ్లిస్ పార్టీకి వచ్చిన ఐదు స్థానాలకంటే ఒక్క స్థానం మాత్రమే ఎక్కువ గెలుచుకుంది కాంగ్రెస్. ఇండియా కూటమిలో ఉన్న మజ్లిస్‌ను బీహార్ ఎన్నికల్లో ఎందుకు ఘట్‌బంధన్‌లో చేర్చుకోలేకపోయారు? ఆ పార్టీ ఒంటరిగా ఎందుకు పోటీ చేసింది? అన్న ప్రశ్నలకు సమాధానం లేదు.
కేంద్రంలో అధికార కూటమికి నాయకత్వం వహిస్తున్న బిజెపి కూడా బీహార్ రాష్ట్రానికి పరిమితమైన నితీశ్ కుమార్ నే ముందుపెట్టి నడిపించినప్పటికీ ఆ పార్టీ నితీశ్ పార్టీ కంటే ఎక్కువ స్థానాలు గెలుచుకున్న విషయం గమనార్హం. నితీశ్ కుమార్ ముందు తేజస్వి యాదవ్ పర్సనాలిటీని ఓటర్లు పట్టించుకోలేదనిపిస్తుంది. అయితే విచిత్రం ఏమిటంటే, 25 స్థానాలకే పరిమితమైన ఆర్‌జెడి ఓట్ల శాతం మాత్రం గెలిచిన బిజెపి, జెడి(యు’ పార్టీలకంటే ఎక్కువ. ఆర్‌జెడికి 23 శాతం ఓట్లు లభించగా, ఆ పార్టీ కంటే బిజెపికి 2. 92 శాతం, జెడి(యు)కు 3.75 శాతం తక్కువ ఓట్లు లభించాయి.ఇక్కడ ప్రసిద్ధ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గురించి ప్రస్తావించాలి. కొన్ని పార్టీలను అధికారంలోకి తేవడానికి ఆయన ఎన్నికల వ్యూహాలు పని చేసాయి కాని, స్వయంగా తాను రాజకీయాల్లోకి వచ్చి బరిలో దిగితే పోటీ చేసిన అన్ని స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయిన పరిస్థితి. జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం తయారు చేసిన ఫైర్ బ్రాండ్ యువ నాయకుడు, బీహార్ కే చెందిన కన్హయ్యకుమార్ కాంగ్రెస్ తరఫున ప్రచారంలో లేకపోవడం కొట్టొచ్చినట్టు కనిపించింది.
ఓట్ల సంఖ్య విషయంలో రాహుల్ గాంధీ విమర్శలకు మరింత బలం చేకూర్చిన అంశం బీహార్‌లో రెండవ విడత పోలింగ్ తరువాత ఎన్నికల సంఘం అధికారికంగా మొత్తం ఓటర్ల సంఖ్యను పేర్కొంటూ విడుదల చేసిన పత్రికా ప్రకటన. కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ అక్టోబర్ ఆరున బీహార్‌లో అర్హులయిన ఓటర్ల సంఖ్య ఏడుకోట్ల 42 లక్షలు అని అధికారికంగా ప్రకటించారు. అదే ఎన్నికల సంఘం నవంబర్ 11న రెండవ విడత పోలింగ్ ముగిసాక చేసిన ప్రకటనలో మొత్తం ఓట్ల సంఖ్య ఏడుకోట్ల నలభై అయిదు లక్షలు అని ప్రకటించింది. ఈ మూడు లక్షల ఓట్లు ఎలా పెరిగాయి? దీనికి ఎన్నికల సంఘం దగ్గర సమాధానం లేదు.
అధికార ఎన్‌డిఎ కూటమి బీహార్ లో ఎన్నికల నియమాల్ని ధిక్కరించినా పట్టించుకున్న నాథుడు లేడు. బీహార్ ఎన్నికల షెడ్యూల్ని కేంద్ర ఎన్నికల సంఘం అక్టోబర్ ఆరవ తేదీన ప్రకటించింది. అంటే, ఎన్నికల కోడ్ ఆ రోజునుంచే ప్రారంభమైందని అర్థం. లెక్క ప్రకారం ఎటువంటి ఆర్థిక మంజూరీలు కానీ, సంక్షేమ పథకాలు కానీ, నిధుల విడుదల కానీ చేయకూడదు. అయితే బీహార్‌లో అధికారంలో ఉన్న పక్షాలకు లాభం చేకూరే విధంగా ప్రభుత్వం అక్టోబర్ 31న, నవంబర్ 7న, నవంబర్ 14న డబ్బులు పంచింది. మహిళల ఖాతాల్లోకి పదివేల రూపాయల చొప్పున ఈ తేదీల్లో నేరుగా నగదు బదిలీ చేయడం ఎన్నికల ఉల్లంఘనే అవుతుంది. కేంద్ర ఎన్నికల సంఘానికి ఆర్‌జెడి అధికారికంగా ఫిర్యాదు చేసినా పట్టించుకున్న నాథుడు లేడు.ఇదీ పరిస్థితి. మరి రాహుల్ గాంధీ ఎన్నికల వ్యవస్థను సరిచేసేందుకు పోరాటం చెయ్యాలా? ప్రతిపక్షాలను కలుపుకుని అధికారంలోకి రావడానికి ప్రయత్నించాలా? భవిష్యత్తు తమదయిన యువత ఆలోచించాల్సిందే.
