‘జూబ్లీ’ ఫలితంతో నేతల డీలా
డిపాజిట్ గల్లంతుతో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, పార్టీ చీఫ్ రాంచందర్‌రావుకు షాక్
ఘోర పరాజయంపై అగ్రనేతల పోస్ట్‌మార్టం
బిసి అభ్యర్థికి టికెట్ ఇవ్వకపోవడం కారణమంటున్న కార్యకర్తలు
చివరి రెండు రోజులే కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రచారం చేయడమూ దెబ్బతీసిందన్న భావన
మన తెలంగాణ/హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం బిజెపి రాష్ట్ర నాయకులను, ద్వితీ య శ్రేణి నాయకులను, కార్యకర్తలను తీవ్ర నిరాశకు గురి చేసింది. బిజెపి డిపాజిట్ తెచ్చుకుంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లోనూ గెలుపొందినట్లేనని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్య లు నిజం కావడం కమలనాథులు జీర్ణించుకోలేకపోతున్నారు. త్వరలో పార్టీ రా ష్ట్ర ముఖ్య నేతల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఓటమిపై సమగ్రంగా, లోతుగా అధ్యయనం చే యాలని పార్టీ అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు భావిస్తున్నారు. నిజానికి ఉప ఎన్నిక ఫలితం ప్రధానంగా రాంచందర్ రావుకు, కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డికి అతి పెద్ద షాక్ కలిగించింది. ఓడిపోయినా కనీసం రెండో స్థానంలో నిలబడగలిగినా, భవిష్యత్తు ఉందని, అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చేసుకోగలమన్న నమ్మకం కలిగేదని పార్టీ నాయకులు, కార్యకర్తలు అంటున్నారు.
బిఆర్‌ఎస్ అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతున్నందున ఆ పార్టీ ఇప్పుడిప్పుడే కోలుకోలేదని, కాబట్టి ఈ సమయంలో బిజెపియే ప్రత్యామ్నాయమని ఇంత కాలం చెబుతూ వచ్చినా, ఈ మాటలపై ప్రజలను ఎలా విశ్వాసం కల్పించలమన్నది వారి అంతర్మథనం. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బిజెపికి కూడా డిపాజిట్ రాద ని, డిపాజిట్ దక్కనీయ రాదని జూబ్లీహిల్స్ ఓటర్లకు పదెపదే చెబుతున్నా దానిని సరైన విధంగా తిప్పికొట్డంలో విఫలమయ్యామన్నది వారి బాధ. ప్రచారంలోనూ బాగా వెనుకబడ్డామని, ఎంత సేపూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి కనిపించారే తప్ప ముఖ్య నాయకులెవ్వరూ ఆసక్తి కనబరచలేదని వారు భావిస్తున్నారు. ముఖ్యంగా ప్రచారానికి నల భై మంది స్టార్ క్యాంపెనయర్ల పేర్లతో జాబితా ప్రకటించినా, ఆ స్టార్‌లెవరూ ప్రచారంలో పాల్గొనలేదని వారంటున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మాజీ మంత్రి పురంధీశ్వరి తదితరులను స్టార్ క్యాంపెనయర్లుగా ప్రకటించినా వారిని ఎందుకు ఆహ్వానించలేదో అర్థం కావడం లేదన్నారు.
ప్రచారంలో పాల్గొనని ఎంపి అరవింద్
పార్టీ ఎంపిలు ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్ మాస్ లీడర్లుగా పేరు పొందారని పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు చెబుతున్నారు. ఈటల రాజేందర్ మొక్కుబడిగా ప్రచారం నిర్వహించారని అంటున్నారు. కాగా ధర్మపురి అరవింద్ ప్రచారానికి హాజరుకాలేదు. అరవింద్ హాజరు కాకపోవడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఒకనొక సందర్భంలో ప్రశ్నించారని వారు గుర్తు చేస్తున్నారు. అయితే తనను ప్రచారానికి ఆహ్వానించలేదని అరవింద్ చెప్పడం గమనార్హం. ఇదే విషయాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ప్రశ్నించినప్పుడు పార్టీలో అందరూ బాధ్యత తీసుకోవాలని, ప్రత్యేకించి ఆహ్వానించలేదని చెప్పారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి, ఎంపి అరవింద్‌కు మధ్య గ్యాప్ ఉందని పార్టీలో గుసగుసలు వినపడుతున్నాయి. మరోవైపు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా చాలా తక్కువ సమయం జూబ్లీహిల్స్ ప్రచారానికి కేటాయించారు. పాల్గొన్న రెండు, మూడు రోజులైనా మాటల తూటాలతో, కాంగ్రెస్-మజ్లిస్ మైత్రిపై నిప్పులు కురిపించారు. ఇదే తరహా ప్రచారం మొదటి నుంచీ చేసి ఉంటే బాగుండేదని వారు అభిప్రాయపడుతున్నారు.
కూటమి అభ్యర్థిగా ప్రచారం చేయకపోవడం
ఆంధ్రప్రదేశ్‌లో బిజెపి-టిడిపి-జనసేన కలిసి ఉమ్మడిగా పో టీ చేసినప్పుడు, జూబ్లీహిల్స్ అభ్యర్థిని కూటమి అభ్యర్థిగా ప్రకటించి ఉంటే బాగుండేదని పలువురు నాయకులు అ భిప్రాయపడ్డారు. టిడిపికి బలమైన క్యాడర్ ఉందని, ఎపి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు మాస్ ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్‌ను ప్రచారానికి ఆహ్వానించి, కనీసం ఒక్క రోజైనా రోడ్-షో నిర్వహించి ఉంటే ఫలితం భిన్నంగా ఉండేదంటున్నారు. పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్డీయే భాగస్వామ్యంలో ఉన్నారు కాబట్టి వారు ప్రచారానికి రాకపోయినా, బిజెపి అభ్యర్థికి మద్దతుగా పిలుపునిస్తూ కనీసం వీడియో లేదా ప్రకటన కూడా చేయలేదని, ఇందుకు పార్టీ రాష్ట్ర నాయకత్వం కృషి చేయకపోవడం బాధాకరమని నేతలు, కార్యకర్తలు వాపోతున్నారు.
బిసి అభ్యర్థి లేకపోయినా..
బిసి రిజర్వేషన్ల అంశం ప్రధానంగా చర్చ జరుగుతున్న సమయంలో బిసి అభ్యర్థిని ప్రకటించలేకపోయినా, పార్టీలో ఉన్న సీనియర్ బిసి నాయకులను, బిసి ఎంపీలను ప్రచారానికి దించి ఉంటే బాగుండేదని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
అభ్యర్థి ఎంపికలోనూ జాప్యం..
చివరకు పార్టీ అభ్యర్థి ఎంపికలోనూ నాయకత్వం జా ప్యం చేసిందని పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన దీపక్‌రెడ్డికే టిక్కెట్ ఇవ్వాలని పార్టీ నాయకత్వం భావించినప్పుడు, ముందుగానే ప్రకటించకుండా అభ్యర్థి ఎంపిక కోసం కమిటీ ఏర్పాటు చేసి జాప్యం చేశారన్న విమర్శలు వెల్లువెత్తాయి. కాంగ్రెస్, బిఆర్‌ఎస్ అభ్యర్థులు, వారి తరపున నేతలు ప్ర చారం మొదటి పెట్టిన తర్వాత, ఎన్నికల నోటిఫికేషన్ వె లువడిన తర్వాతే తమ పార్టీ అభ్యర్థిని ప్రకటించడం జరిగిందని, దీంతో ప్రచారంలో వెనుకబడ్డామని, బిజెపికి అభ్యర్థి దొరకడం లేదని మిగతా పార్టీల నేతల నుంచి విమర్శలు ఎదుర్కొవాల్సి వచ్చిందని పార్టీ నాయకులు ఆందోళన చెందుతున్నారు. ఇలా జరిగిన లోపాల కారణంగానే పార్టీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ఓడిపోయారని సొంత పార్టీ నాయకులు వాపోతున్నారు. భవిష్యత్తులోనైనా ఇటువంటి పొరపాట్లు జరగకుండా సమిష్టి కృషితో ముందుకెళ్ళాలని నాయకులు అంటున్నారు.