దేశానికి సుమారు 30 వేల మంది అదనపు పైలట్లు అవసరమని కేంద్ర పౌర విమానయాన శాఖమంత్రి కె.రామ్ మోహన్ నాయుడు తెలిపారు. 1700 విమానాల కోసం దేశీయ విమాన సంస్థలు బోయింగ్, ఎయిర్‌బస్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాయి, వీటి నిర్వహణకు భారీగా పైలట్ల అవసరం ఉంది. దేశంలో వేగంగా పెరుగుతున్న విమానయాన మార్కెట్ కోసం శ్రామికశక్తి పెంచాల్సిన అవసరం ఉందని మంత్రి వెల్లడించారు. సిఐఐ భాగస్వామ్య సదస్సులో మంత్రి మాట్లాడుతూ, భారతదేశానికి వచ్చే కొన్ని సంవత్సరాల్లో కనీసం 30 వేల మంది అదనపు పైలట్లు అవసరం అవుతారని తెలిపారు. ప్రస్తుతం దేశంలోని విమానయాన సంస్థలు సుమారు 1,700 కొత్త విమానాల కోసం ఆర్డర్లు ఇచ్చాయి. ఈ కొత్త విమానాలు సేవలోకి వచ్చే సరికి వాటిని నడపడానికి పెద్ద సంఖ్యలో శిక్షణ పొందిన పైలట్లు కావాల్సి ఉంటుందని మంత్రి అన్నారు. ఒకే విమానాన్ని క్రమం తప్పకుండా నడిపేందుకు 10 మంది నుండి 15 మంది పైలట్లు అవసరమవుతారని, ఆ లెక్కన మొత్తం 25,000 నుండి 30,000 మంది అదనపు పైలట్లు తప్పనిసరిగా కావాల్సి వస్తుందని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో 8,000 మంది పైలట్లు ఉన్నా, వారిలో 2,000 నుండి 3,000 మంది
చురుకుగా సేవలో లేరని మంత్రి దృష్టికి తేవడం జరిగింది. ఈ నేపథ్యంలో మరిన్ని ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్లు ప్రారంభించడం అత్యవసరం అని ఆయన అన్నారు. ప్రస్తుతం ఉన్న శిక్షణ సంస్థలు చాలా తక్కువ సంఖ్యలోనే పైలట్లను తయారు చేస్తున్నాయని, దేశపు శ్రామిక శక్తిని మరింతగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. కార్గో విమానాశ్రయాల నిర్మాణంపై కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోందని, ఫెడెక్స్ వంటి ప్రపంచ లాజిస్టిక్స్ సంస్థల మాదిరిగా ప్రత్యేక కార్గో మౌలిక సదుపాయాలు భారత్‌లో అవసరమని మంత్రి పేర్కొన్నారు. ప్రతిరోజూ దేశంలో దాదాపు 4.8 లక్షల మంది విమానాల్లో ప్రయాణిస్తుండగా, నవంబర్ 10న 5.3 లక్షల మంది ప్రయాణించడం కొత్త రికార్డ్ అని తెలిపారు. భారతదేశం స్వదేశీ విమానాల రూపకల్పన, తయారీ, నిర్వహణ దిశగా ముందుకు సాగుతోందని మంత్రి నాయుడు తెలిపారు. విమానయాన రంగం వేగంగా పెరుగుతున్న ఈ దశలో పైలట్ శిక్షణ కీలకమని, దీనిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని ఆయన వెల్లడించారు.