మన తెలంగాణ/సైదాపూర్: కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం శివరాంపల్లి గ్రామానికి చెందిన రెడ్డి అర్చన (16) అనే ఇంటర్ విద్యార్థి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ శనివారం తెల్లవారుజామున మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు సైదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే శివరాంపల్లి గ్రామానికి చెందిన రెడ్డి రాజు కు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. రెండవ కూతురు అర్చన సైదాపూర్ మండలం సోమవారం గ్రామ మోడల్ స్కూల్ లో ఇంటర్మీడియట్ ఫాస్ట్ ఇయర్ చదువుతుంది. శుక్రవారం మోడల్ స్కూల్ కి వెళ్లి వచ్చిన అర్చన కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపింది.
అర్చన థైరాయిడ్, కడుపునొప్పి తదితర అనారోగ్య సమస్యలతో చాలా రోజులుగా ఇబ్బంది పడుతుందని, ఇవన్నీ భరించలేక రాత్రి పడుకున్నాక గుర్తుతెలియని విష గుళికలు మింగి చనిపోయిందని, రాత్రి పడుకున్నాక ఏదైనా విష సర్పం కాటు వేసిందా తెలియదని కుటుంబ సభ్యులు తెలిపారు. తెల్లవారుజామున చూసేసరికి నురుగులు కక్కుతూ చనిపోయిందని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. తమ కూతురి మృతిపై తమకు ఎలాంటి అనుమానం లేదని అర్చన తండ్రి రాజు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తిరుపతి తెలిపారు.అర్చన మృతికి అనారోగ్య సమస్యలే కారణమా..ఇంకా ఏమైనా జరిగిందా అనే విషయంపై పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని ప్రజలు కోరుతున్నారు.