పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తరువాత రెబెల్స్‌పై బిజెపి దృష్టి పెట్టింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు ఉన్న కేంద్ర మాజీ మంత్రితో సహా ముగ్గురు నేతలను సస్పెండ్ చేసింది. బీహార్‌కు చెందిన సీనియర్ నేత, శకేంద్ర మాజీ మంత్రి ఆర్‌కే సింగ్, శాసనమండలి సభ్యుడు అశోక్ అగర్వాల్, కతిహార్ మేయర్ ఉషా అగర్వాల్‌కు షోకాజ్ నోటీస్‌లు జారీ చేసింది. పార్టీ నుంచి వారిని ఎందుకు బహిష్కరించకూడదో వారంలోగా వివరణ ఇవ్వాలని బీహార్ బీజేపి ప్రధాన కార్యాలయం ఇన్‌ఛార్జ్ అరవింద్‌శర్మ ఆ నోటీస్‌లో కోరారు.
బీహార్ లోనలి అర్రామాజీ ఎంపీ అయిన ఆర్‌కె సింగ్, 2024 ఎన్నికల్లో ఓడినప్పటి నుంచి బీజేపీతోపాటు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ఎన్డీఎ నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మాజీ దౌత్యవేత్త అయిన ఆయన మన్మోహన్ సింగ్ హయాంలో హోం కార్యదర్శిగా ఉన్నారు. 2013 లో బీజేపీలో చేరారు. 2014,2019లో రెండుసార్లు అర్రా నుంచి ఎంపీగా గెలిచారు. 2017లో మోడీ తొలి మంత్రివర్గంలో విద్యుత్ మంత్రిగా పనిచేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో తన స్థానాన్ని కోల్పోయారు.