కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం సదాశివపల్లి గ్రామ స్టేజ్ వద్ద శనివారం ఆర్టీసీ బస్సు ముందు వెళుతున్న లారీని ఢీకొనడంతో బస్సులో ఉన్న 15 మంది ప్రయాణీకులకు గాయాలయ్యాయి.స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. నిజామాబాద్ 1వ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు నిజామాబాద్ నుండి వరంగల్ వైపు వెళుతూ ముందు వెళుతున్న మహారాష్ట్రకు చెందిన లారీని ఢీకొంది.ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 60 మంది ప్రయాణీకులు ఉండగా వారిలో 15 మంది ప్రయాణీకులు గాయపడినట్లు తెలిపారు.గాయపడిన వారిని చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు.సమాచారం అందుకున్న మానకొండూర్ సిఐ సంజీవ్ సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాద వివరాలు తెలుసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.