బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాగఠ్ బంధన్ కూటమి పరాజయం కావడంతో లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణీ ఆచార్య తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని, తన కుటుంబంతో కూడా సంబంధాలను తెంచుకుంటున్నానని సంచలన ప్రకటన చేశారు. కుటుంబం లోని కొందరి ఒత్తిడి కారణం గానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆమె సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ నిర్ణయం తీసుకోవడానికి ఆర్‌జెడి రెబెల్ సంజయ్ యాదవ్, తన భర్త రమీజ్ ఆలం సలహా వల్లనే అని, తాను ఈ నిందనంతా స్వీకరిస్తున్నానని స్పష్టం చేశారు. వృత్తి రీత్యా డాక్టర్ అయిన ఆమె ఇదివరకు ఆర్‌జెడి సభ్యురాలుగా ఉండేవారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీహార్ లోని సరన్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. కానీ బీజేపీ సభ్యుడు రాజీవ్ ప్రతాప్ రూడీ చేతిలో ఓడిపోయారు. బీహార్ ఎన్నికల ముందే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు.
కుటుంబం లోని రగులుతున్న కలహాలే ఈ పరిస్థితికి కారణమైంది. లాలూ కొడుకులు తేజ్ ప్రతాప్ యాదవ్, తేజస్వియాదవ్‌ల మధ్య చాలా కాలంగా విభేదాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో తన వ్యక్తిగత జీవితాన్ని తేజ్ ప్రతాప్ నెట్టింట పెట్టడంతో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడంటూ ఎన్నికల ముందు ఆర్‌జేడీ బహిష్కరించింది. దీంతో జనశక్తిజనతాదళ్ (జెజెడి) అనే కొత్త పార్టీని ప్రారంభించి మహువా నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈ విభేదాలే ఆర్‌జెడిలో అంతర్గత సంక్షోభానికి దారి తీశాయని,ఎన్‌డిఎ కూటమి ఈ విభేదాలను ప్రచారంలో వాడుకుందని చెబుతున్నారు. ఇవే ఇండియా కూటమి ఓటమికి ఒక కారణంగా రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.