‘జిల్ల వరముగల్లు జిజ్ఞాస నా ఇల్లు
మా ఊరు రేబర్తి మంచి స్ఫూర్తి
అందె ఇంటి పేరు అలరించు రాగాల
ఆత్మమేలు కొలుపు అవనిలోన
నిష్ఠ కలిగియున్న కష్టాల నెదురీదు
మనిషికందని విద్య మహిని కలదె
పల్క బలపంబట్టి పాఠశాలకు పోలె
అచ్చు హల్లులు కాస్త అభ్యసించ
కలము బట్టాను కరమున కళ్లు దెరిచి
పారజూశాను లోకాన్ని పట్టుబట్టి
ప్రజల భావాలె కవితగ పల్లవించు
తప్పులున్నచో దిద్దుడీ తండ్రులారా!”
ఇది ప్రజాకవి ఉద్యమ గాయకుడు అందెశ్రీ స్వగతం అతని మాటల్లోనే. తన గేయాల సంపుటి అందెల సవ్వడి పుస్తకం ఆఖరి అట్టమీద రాసుకున్న తన ఆనవాలు. అందెశ్రీ తెలంగాణ గడ్డ మీద తన పాటల తోటను పేర్చి దాని అందచందాలను, సువాసనల గాలులను మనకు వదిలేసి తన దారి తాను చూసుకున్నాడు. ఆయన జీవితం గురించి ఆయనే చాలా సాధారణంగా మనకు చెప్పారు. అది అందరికి తెలిసిందే జీవితం సాధారణమైనదే. కాని ప్రయాణమే అంటె సాహితీ జీవితం చాలా చాలా మలుపులు తిరిగింది. ఒక దగ్గర ఆగిపోయే వ్యక్తిత్వం కాదు. ఎప్పుడు ఏదో చేయాలనే, మరేదో రాయాలనే తపనే ఆయనను అక్షరం రాని స్థితి నుంచి విశ్వవిద్యాలయం డాక్టరేట్ ఇచ్చే దాకా తీసుకెళ్లింది. ఆయన పేరు మీద అచ్చయిన రెండు గేయాల సంకలనాలు ఆయన సాహితీ సారాన్ని మనకు అందిస్తాయి. దానితోపాటు ఆయన సంకలనం చేసిన తెలంగాణ ఉద్యమ పాటలు “నిప్పులవాగు” కూడా అందరిలో తనను కూడా ఆవిష్కరించుకున్నాడు. అట్లా ఆయన మొదలు పెట్టిన ప్రయాణం నుంచి నేటి వరకు ఆయన ఆలోచనల ధారను మనకు సాక్షాత్కరింప జేస్తుంది.
‘పాటల పూదోట’ అనే మొదటి పుస్తకంలో మనకు ప్రకృతి కవి, ప్రేమ కవి, దేశభక్తి కవి, ఆధ్యాత్మిక కవి ఎక్కువగా కనిపిస్తాడు. ఆ పాటల పుస్తకానికి పరిచయ వాక్యాలు రాసిన వాళ్లలో సి. నారాయణరెడ్డి, పేర్వారం జగన్నాధం, రావూరి భరద్వాజ, ఆచార్య తిరుమల, నాగిశెట్టి లాంటి వాళ్లున్నారు. అందులో రావూరి భరద్వాజ రాసిన నాలుగు వాక్యాలైన ఆనాటి వరకు అందెశ్రీ గురించి మనకు అందించిన విషయాలు చాలా సంక్షిప్తంగా ఎంతో ప్రేమగా ఉన్నాయి. “అందెశ్రీ గారి పాటల పూదోట” ను చూసి నేను సుక్షేత్రంలో విరిసిన సుమవనం అని అనుకున్నాను. నేనెందు కలా అనుకున్నదో, ఈ పుస్తకం చదివాక మీకే తెలుస్తుంది” అని భరద్వాజ కవితాత్మకంగా రాసిన వాక్యాలు ఆనాడు అందెశ్రీకి ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చి ఉంటాయి. మిగతా పెద్దలు కూడా చాలా ప్రోత్సాహపూరితంగా రాసి, ఎంతో నైతిక మద్దతును పలికారు. ఈ పుస్తకం నిండా మనకు ప్రకృతితో అందెశ్రీ ఆడకున్నట్టు కనిపిస్తుంది. ఇది 1993 కు ముందు ప్రచురించింది. సమస్య ఏమిటంటే ఇందులో ప్రచురణ సంవత్సరం, వివరాలు లేవు. రెండోది, అందెల సవ్వడి. ఈ పుస్తకంలోని పాటలు, గేయాలు రాసే నాటికి అభ్యుదయ, ప్రజా కవుల ఆలోచనలలోకి రాగలిగాడు. అందుకే ఆ పుస్తకం ప్రజాకవి అలిశెట్టి ప్రభాకర్‌కు అంకితం ఇచ్చాడు.
“అబద్ధాల గొంతునొక్కే, వాస్తవ చిత్రాలు చెక్కే, ఇజమెప్పుడు వీడకుండా, నిజమన్నది వాడకుండా ప్రజాకవిగా ప్రభవించిన అజరామరుడు” అంటూ ప్రభాకర్‌ను సొంతం చేసుకున్నాడు. ఇది 1995 96 ప్రాంతంలో అచ్చయి ఉంటుంది. ఈ పుస్తకానికి ప్రముఖ పాత్రికేయులు జి. కృష్ణ రాసిన పరిచయం అందెశ్రీకి ఒక నిలువెత్తు ధ్రువపత్రం. “ఇది” చదువు రాని వాడు “వ్రాసే కవిత’ కు కవిత్వం రానివాడు “వ్రాస్తున్న పరిచయం” అంటూ మొదలు పెట్టాడు. ఇందులో చదువురాని వాడు, కవిత్వం రానివాడు అన్న పదాలు ఇన్‌వర్టెడ్ కామాలలో ఉంచడం గమనించాలి.
“అసలు చదువు రానివాడు వ్రాసే కవిత్వం లోనే నిజమూ, అమాయకత్వమూ సొంపుగా పెన వైచుకొని సాక్షాత్కరిస్తూ ఉంటాయి” అంటూ పరిచయ వాక్యాలు కొనసాగాయి. ఆ తర్వాత వాసిలి వసంత కుమార్ కూడా ఈ పుస్తకానికి ముందు మాట రాశారు. ఈ పుస్తకం వచ్చే సరికి తనలో ఉన్న సామాజిక చైతన్యం బయటకు వచ్చింది”. పూర్వీకులు తవ్విన పునాదులను, పునర్జన్మలను పేరుతో నింపి భయభ్రాంతుల గోడల పెట్టే పురాణ ఇతిహాసాల మేడలు కట్టే స్వర్గం నరకాలు అను పేర్లు పెట్టి మానవతను మంటకల్పి మనుధర్మ శాస్తాలు మనకందని వేదాలు” అంటూ తనలో అంతర్లీనంగా దాగిన ధిక్కారాన్ని బయటకు లాగాడు. అయినా ప్రకృతిని, పల్లెను తన వెంటనే మోసుకొస్తున్నాడు.
ఆ తర్వాత 2000 సంవత్సరాల తర్వాత తన గొంతును సవరించుకొని స్వరాన్ని పెంచాడు. అందులో “పల్లె నీకు వందనాలమ్మో, మముగన్నా తల్లీ నీకు వందనాలమ్మో” అంటూ పల్లెను ప్రపంచం ముందుపెట్టాడు. అంటూ గత నాటి పల్లెను పలవరించే విధంగా చేశాడు. తెలంగాణ మలిదశ ఉద్యమం ప్రారంభమైన తర్వాత తన నిజరూపం, విశ్వరూపం ప్రదర్శించాడు. సూడసక్కని తల్లి సుక్కల్లో జాబిల్లి అంటూ తెలంగాణ పల్లెను, ఆ పల్లెల్లో ఉండే గొప్పతనాన్ని తన పాటలో ప్రదర్శించాడు . అందువల్లనే ఆ పాట నృత్య రూపకమైపోయింది. అదే తెలంగాణ ధూంధాం ఆరంభ గీతమైంది. ఆ తర్వాత “సూడు తెలంగాణ చుక్క నీళ్లలేని దాన’ అంటూ జల దోపిడీ ఆర్థిక సిద్ధాంతానికి పాట పరిచయ గొంతునిచ్చింది. తెలంగాణ జాతీయ గీతమైన జయ జయ హే తెలంగాణపాట ఉద్యమ ఊపిరిగా మారిపోయింది. జై బోలో తెలంగాణ సినిమాకు రాసిన జై బోలో తెలంగాణ గళ గర్జనల జడివాన అన్న పాట తెలంగాణను ఉర్రూతలూగించింది.
చాలా మంది ఉద్యమకారులకు, మానవతావాదులకు, సెల్‌ఫోన్‌లో రింగ్ టోన్‌గా మారిన “మాయమైపోతున్నాడమ్మా” అన్న పాటతో మాయమైపోతున్న సమాజాన్ని మన ముందుంచాడు. అదే మానవత్వం మనుగడ మీద, మనిషి ఉనికి మీదనే కొరడా ఝళిపించినట్టయింది. అంతేకాకుండా, తన సామాజిక నేపథ్యాన్ని, గ్రామ దేవతల వైభవాన్ని ముఖ్యంగా అమ్మతల్లులైన దేవతల మీద రాసిన పాట తన కవితా సృజనకు ఒక మచ్చుతునక. “కొమ్మ చెక్కితే బొమ్మరా కొలిసే మొక్కితే అమ్మరా, ఆదికే ఇది పాదురా కాదంటే ఏది లేదురా! అంటూ మనిషికి దేవుని, దేవతలపట్ల ఉన్న తాత్వికతను కళ్లముందుంచాడు. వీటన్నింటితోపాటు, “తల మీద సుట్టబట్ట ఆపైన పండ్ల తట్ట, పండ్లు పండ్లుయో అని పల్లెంత తిరిగి అమ్మే తెనుగోల్ల ఎల్లమ్మ ఏది మా పల్లెల్లోన కండ్లల్లో కానరాదేమి! అన్న పాట పల్లె జీవితాన్ని మనకు మరిచిపోకుండా చేయగలదు.
ఎంతో సాహితీ శక్తిని ప్రదర్శించిన అందెశ్రీ ఎవ్వరూ చేయని మరొక గొప్ప కార్యం చేశారు. ఇది చాలా మందికి తెలియదు. ఆయన మెదడులో ఒక ఆలోచన పుట్టింది. అదే ప్రపంచంలోని నదులన్నింటిని సందర్శించాలనేది. అది ఆలోచన. దానికి ఆచరణ జోడించాడు. అమలు చేశాడు. అనుభూతిని పొందాడు. దాదాపు ప్రపంచంలోని ముఖ్యమైన నదులన్నింటిని చూసినవాడు అందెశ్రీ ఒక్కడే అయి ఉంటాడేమో. ప్రపంచంలో ఈ ఘనతను ఎవ్వరూ చేయలేదేమో అనిపిస్తుంది. ఎవరైనా ఇంత కన్నా ఎక్కువ నదులను సందర్శించి ఉంటే మన అభిప్రాయాన్ని సరిచేసుకోవచ్చు. అభ్యంతరం లేదు. 2010 సంవత్సరంలో తన ‘నదీ యాత్ర’ ను ప్రారంభించి ఉత్తర అమెరికా, ఆఫ్రికా ఖండాల్లోని మిసిసిపి, ఆమెజాన్, నైలు, సరానా, కాంగో, జాంబేజ నదులను చూశారు. వాటి మీద యాత్ర చేశాడు. ఎన్నో వందల రోజులు ఆ నదులతో మాట్లాడాడు.
ఆ తర్వాత రష్యాలోని రష్యా, ఇర్తిష్, ఓట్, యెన్సి నదులను కూడా తన కళ్లతో చూసి, మనసుతో మాట్లాడాడు. అదే విధంగా ఫ్రాన్స్‌లోని సేన్, జర్మనీలోని రైన్ నదులను పలకరించి యాత్రను ముగించాడు. చైనాలోని యాంగ్జి, ఎల్లో నదుల జలాన్ని చేతుల్లోకి తీసుకొని కళ్ల కద్దుకున్నాడు. ఆస్ట్రేలియాకు వెళ్లి యారా, మురై, హకేష్‌బరి నదులలో ఆటలాడి, పాటలు పాడాడు. ఇది మరెవ్వరూ చేయలేని పని. అయితే ఇది అక్షర రూపం దాల్చలేదు. ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో ఈ నదీ యాత్ర మొత్తం ఒక పుస్తకంగా వస్తుందని చెప్పాడు. కాని అది పూర్తి కాలేదు. ఆయనతో ఈ నది యాత్రలో పాల్గొని తుదకంటూ ఆయనతో నడిచిన సంగిశెట్టి సత్యం మీద ఈ బాధ్యత ఉండేమో.
అయితే ఈ నదీ యాత్ర గురించి ఒక సందర్భంలో “అవి నదులు కాదు. నడిచొచ్చే సముద్రాలు. ఆ నదులపై కావ్యం రాయాలనే కోరిక త్వరలోనే నెరవేరుతుందని ఆశిస్తున్నా” అంటూ మనకు హామీ ఇచ్చాడు. అయితే కావ్యం రాసినట్టు తెలుస్తున్నది. అయితే అది అచ్చు కావాలి. నదీ యాత్ర మీద రాసిన నాలుగు వాక్యాలు మనకు లభ్యమవుతున్నాయి.
“కొండలను కోనలను కొనగోట కొలిసింది
నేలపై నెలవంక తారయై వెలిసింది
అడవులను ముద్దాడి ఆకు పసరయ్యింది
నేలలో పాయలుగా ఉయ్యాల లూగింది
తొలిపొద్దు గీతమై లోక సంగీతమై
నడినడిచిపోతున్నది నన్ను నావనై రమ్మన్నది!” అంటూ “నా జీవన గమనం నా ప్రపంచ నదీ యాత్రా” అంటూ ఎంతో అనుభూతిని వ్యక్తపరిచాడు. కవిత్వంలో, జీవితంలో ఎన్నో అనుభవాలను అనుభూతులను మనకు అందించి, మన నుంచి మరుగై, మాయమైపోయిన మానవతా మూర్తి అందెశ్రీ.
– మల్లేపల్లి లక్ష్మయ్య (దర్పణం)