అడవులు, పర్వత ప్రాంతాల్లో విస్తరించి ఉన్న గిరిజన సమూహాలు భారత ఉపఖండ నాగరికతలో అత్యంత పురాతన దశలను ప్రతిబింబిస్తాయి. వీరు భూమి, నీరు, అటవీ వనరుల అసలైన సంరక్షకులు. ప్రకృతి ఆధారిత ప్రత్యేక సామాజిక వ్యవస్థలు, పర్యావరణ పరిజ్ఞానం, ఆధ్యాత్మిక జీవన విధానాలను వీరు రూపొందించారు. శతాబ్దాల తరబడి తక్కువగా చూడబడినప్పటికీ వీరు తమ ప్రత్యేక సాంస్కృతిక అస్తిత్వాన్ని కాపాడుకొని, అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడారు. భారత స్వాతంత్య్ర పోరాట చరిత్రలో వీరి కృషిని చరిత్రకారులు సముచిత రీతిలో ప్రస్తావించలేదు. నిజానికి బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా, భూస్వామ్య దోపిడీకి ఎదురు నిలిచిన మొదటి తిరుగుబాట్లను వీరే ప్రారంభించారు. ఈ గిరిజన పోరాటాలు భారతదేశంలో జాతీయ చైతన్యానికి పునాది వేశాయి.
గిరిజన సాంస్కృతిక వారసత్వం: గిరిజన సంస్కృతి కేవలం గతానికి చెందినదే కాదు; అది నేటికీ జీవిస్తున్న, ప్రకృతి సమన్వయంతో కూడిన, సామూహిక ఐక్యతను ప్రతిబింబించే జీవన విధానం. గిరిజన సమాజాలు సుస్థిరమైన వ్యవసాయ పద్ధతులు, అటవీ వనరుల వినియోగంలో శతాబ్దాల అనుభవాన్ని గడించాయి. పోడు సాగు, పవిత్ర అరణ్యాలు, టోటెమిక్ ఆరాధన వంటి ఆచారాలు వారి పర్యావరణ నైతికతను సూచిస్తాయి. ఆదివాసులు వర్లీ (మహారాష్ట్ర), సవర (ఒడిశా), గోండు (మధ్యప్రదేశ్), కోయ (తెలంగాణ) చిత్రకళలతో ప్రసిద్ధి చెందారు. ఆసిఫాబాద్ జిల్లాలోని ఓజాల లోహకళ, ఖమ్మం జిల్లాలోని నాయకపోడ్ల దారు పనులు (మాస్కులు), మైదాన ప్రాంత లంబాడీల వస్త్ర కళ (ఎంబ్రాయిడరీ) -ఇవన్నీ దైనిక, దైవిక ప్రయోజనాలతో పాటు వారి కళాత్మకతకు నిదర్శనాలు. ప్రతి గిరిజన పండుగ జీవనోత్సవం. ఢోల్, తుడుం, ఔజం, తప్పెటగూళ్ళు (డప్పులు) వంటి వాద్యాలతో చేసే గుస్సాడి, డెమ్సా, కొమ్ముకోయ (తెలంగాణ- ఆంధ్ర), కర్మ (చత్తీస్‌గఢ్), గోటిపువా (ఒడిశా) వంటి వారి నృత్యాలు వారి సామూహిక ఐక్యతను, ప్రకృతిపట్ల గౌరవాన్ని ప్రతిబింబిస్తాయి. సంతాళ్ల మంజీ-పర్గణ వ్యవస్థ, గోండుల దొర్ల గుట్ట పంచాయితీ, భిల్లుల గమేటి సభ వంటి సంస్థలు వలస పాలనకు ముందే మనుగడలో ఉన్న ప్రజాస్వామ్య పరిపాలనా వ్యవస్థలకు నిదర్శనాలు.
గిరిజన తిరుగుబాట్లు: జాతీయ స్వాతంత్య్ర ఉద్యమం పుట్టకముందే గిరిజన సమాజాలు వలస పాలన, దోపిడీకి వ్యతిరేకంగా తిరుగుబాట్లు చేపట్టాయి. చువార్, భూమిజ తిరుగుబాట్లు (1760- 1830, బెంగాల్): జంగల్ మహల్ ప్రాంత గిరిజనులు అధిక పన్నులు, అరణ్య భూములపై బ్రిటిష్ ఆక్రమణకు వ్యతిరేకంగా ఉద్యమించారు. కోల్ తిరుగుబాటు (183132, ఛోటానాగ్‌పూర్): కోల్ గిరిజనులు వడ్డీ వ్యాపారులు, భూస్వాముల దోపిడీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. సంతాల్ హుల్ (1855- 56): సిద్ధూ, కన్హు ముర్ము నాయకత్వంలో సంతాళ్లు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా విప్లవాన్ని ప్రారంభించారు. ఇది 1857 తిరుగుబాటుకు ముందున్న అతి పెద్ద ఆదివాసీ ఉద్యమం.
బిర్సా ముండా ఉద్యమం (1899 -1900): బిర్సా ముండా ఛోటా నాగ్‌పూర్ ప్రాంతానికి చెందిన యువ ఆదివాసీ నాయకుడు. బ్రిటిష్ పాలన, క్రైస్తవ మిషనరీ జోక్యానికి వ్యతిరేకంగా ఉల్గులాన్ (మహా తుఫాను)ను నడిపించాడు. ఆయన అబువా దిశుమ్, అబువా రాజ్ (మన భూమి, మన రాజ్యం) అనే నినాదం ద్వారా స్వాతంత్య్రం, సమానత్వం, స్వదేశ విశ్వాస సంరక్షణకై పోరాడాడు. భిల్ తిరుగుబాట్లు (1818-1858): పశ్చిమ భారతదేశంలోని భిల్లులు తమ అరణ్య హక్కుల రక్షణకై, భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా పోరాడారు. రంపా తిరుగుబాట్లు (1879, 1922- 24, ఆంధ్రప్రదేశ్): తమన్ దొర, అల్లూరి సీతారామరాజు నేతృత్వంలో కోయ, ఇతర తెగలు బ్రిటిష్ అటవీ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడారు. రాజు గాంధేయ సిద్ధాంతాలను గెరిల్లా యుద్ధ పద్ధతులతో కలిపి పోరాటం చేశారు.
గోండు తిరుగుబాట్లు (జోడేఘాట్, ఆసిఫాబాద్, 1940): కుమ్రం భీమ్ నిజాం అధికారుల దోపిడీకి వ్యతిరేకంగా జల్, జంగల్, జమీన్, ‘మావె నాటే మావె రాజ్‘ (మా ప్రాంతంలో మా రాజ్యం) అనే నినాదాలతో అసిఫాబాద్ జిల్లా జోడేఘాట్ లో పోరాడాడు. ఆయన త్యాగం తెలంగాణ గిరిజన గౌరవానికి ప్రతీకగా నిలిచింది. ఖాసీ, గారో తిరుగుబాట్లు (ఈశాన్య భారతం): టిరోట్ సింగ్, పా టోగన్ నెంగ్‌మింజా సంగ్మా వంటి నాయకులు మేఘాలయ -అస్సాం పర్వత ప్రాంతాల్లో బ్రిటిష్ విస్తరణను ప్రతిఘటించారు.
స్వాతంత్య్ర ఉద్యమంలో గిరిజనుల పాత్ర (1857- 1947): 1857 తర్వాత భారత స్వాతంత్య్ర ఉద్యమంలో గిరిజనులు ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొన్నారు. భిల్, గోండు దళాలు 1857 తిరుగుబాటులో పాల్గొన్నాయి. 1857 నాటి సిపాయి తిరుగుబాటు పిలుపునందుకొని నిర్మల్‌లో రాంజీ గోండ్ 500 ల మంది గిరిజనులు, రోహిల్లా సైనికులను వెంటేసుకుని ఆనాటి నిజాం, బ్రిటీష్ సైన్యాలకు వ్యతిరేకంగా నిర్మల్ ఘాట్ లో పోరాడి అసువులు బాసాడు. సహాయ నిరాకరణ, భారత్ విడిచి పో (క్విట్ ఇండియా) ఉద్యమాలలో గిరిజన కార్యకర్తలు ప్రజలను సంఘటితం చేశారు. హైదరాబాద్, మధ్య ప్రదేశ్ ప్రాంతాలలో లంబాడీలు, కోయలు భూస్వామ్య, వలస వ్యతిరేక పోరాటాలకు మద్దతు ఇచ్చారు. స్వాతంత్య్రం అనంతరం జైపాల్ సింగ్ ముండా వంటి గిరిజన నాయకులు రాజ్యాంగ సభలో గిరిజన హక్కులు, స్వపాలన, భూస్వామ్య రక్షణ అంశాలను ప్రవేశపెట్టారు.
ఆధునిక భారతదేశానికి గిరిజనుల చేర్పులు: గిరిజన సంప్రదాయాలు భారతదేశపు బహుళ సంస్కృతికి అందాన్ని అద్దాయి. గిరిజన జానపద కళలు, సంగీతం, జానపద గాథలు, పర్యావరణ పరిజ్ఞానం వంటి రంగాల్లో వీరి పాత్ర అపారమైనది. భారత రాజ్యాంగంలోని ఐదవ, ఆరవ షెడ్యూల్స్ గిరిజన స్వపరిపాలన, సాంస్కృతిక హక్కులను కాపాడుతున్నాయి. భూమిని తల్లిగా, అడవిని పవిత్రంగా భావించే గిరిజన దృక్పథం సుస్థిర అభివృద్ధికి మార్గదర్శకంగా నిలుస్తుంది. భారత గిరిజన సమాజ చరిత్ర అంటే వారి పోరాటాలు, ఆత్మగౌరవ ప్రకటనల చరిత్ర. జార్ఖండ్ అడవుల నుండి తెలంగాణ కొండల వరకు, ఈశాన్య పర్వతాల వరకు, ఆదివాసులు తమ భూమి కోసం, తమ ఆత్మ గౌరవ పరిరక్షణ కోసం నిరంతరం పోరాడారు. వీరి తిరుగుబాట్లు కేవలం ప్రాంతీయ ఉద్రిక్తతలు కావు అవి స్వాతంత్య్రం, న్యాయం, ఆత్మగౌరవం కోసం చేసిన తొలి జ్వాలలు. బిర్సా ముండా జయంతి సందర్భంగా జరుపుకునే జనజాతీయ గౌరవ దివస్ (నవంబర్ 15) గిరిజన వీరుల త్యాగం, ధైర్యం, స్వాభిమానం పట్ల జాతీయ నివాళి. భారత స్వాతంత్య్రం సంపూర్ణత.. గిరిజన సమాజాల గౌరవం, స్వాతంత్య్రంతోనే సాధ్యమవుతుంది.
– డా. ద్యావనపల్లి సత్యనారాయణ
– 94909 57078