హైదరాబాద్: ముషీరాబాద్ పరిధిలోని పద్మారావునగర్ ప్రాంతం గాంధీనగర్‌లో కుటుంబ కలహాలతో ఓ ఐటి ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… విశాల్ గౌడ్(28) అనే వ్యక్తి రెండు సంవత్సరాల క్రితం నవ్య అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. అతడు టిసిఎస్‌లో ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గత కొన్ని రోజుల నుంచి దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఘర్షణలు తారాస్థాయికి చేరుకోవడంతో పెద్దలు పలుమార్లు దంపతులకు నచ్చజెప్పారు. మార్చి నెలలో దంపతుల మధ్య గొడవ జరగడంతో నవ్య పుట్టింటికి వెళ్లింది. రెండు నెలల క్రితం ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో విశాల్ పిఎస్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. అనంతరం కేసు నమోదు కావడంతో మరోసారి పిఎస్‌కు రమ్మని పోలీసులు కబురు పంపారు. దీంతో అతడు ఇంట్లోనే సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. గాంధీనగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.